అమర వీరులకు చోటేది?
- ఉద్యమ వీరుల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర పాఠాలు
- ‘తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమం’లో ప్రస్తావించని వైనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన విద్యార్థుల పోరాటక్రమం లేకుండానే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంపై విద్యార్థులకు పాఠాలు రూపొందాయి. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరుల ప్రస్తావన లేకుండా ఉద్యమ చరిత్రను లిఖించారు. దీంతో ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన విద్యార్థులను విస్మరించి తెలంగాణ ఉద్యమ క్రమాన్ని భావి పౌరులకు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం పదో తరగతి సాంఘిక శాస్త్రంలో ‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం’ పేరుతో ప్రవేశపెట్టిన పాఠ్యాంశం చర్చనీయాంశమైంది. ఇందులో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతాచారి, పార్లమెంటు వద్ద బలిదానం చేసుకున్న యాదిరెడ్డి, ఉస్మానియా క్యాంపస్‌లో ప్రాణాలు వదిలిన ఇషాంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, నిజామాబాద్‌లో కాల్చుకుని చనిపోయిన కానిస్టేబుల్ కిష్టయ్య వంటి అమరుల ప్రస్తావన లేకుండా తెలంగాణ ఉద్యమాన్ని వివరించారు.
ఈ అమరులకు పదో తరగతి చరిత్ర పుస్తకంలో చోటు లేకుండా చేశారు. అంతేకాదు, తెలంగాణ సిద్ధాంతకర్తగా అంతా ఆరాధించే ప్రొఫెసర్ జయశంకర్, తన ఇంటినే(జలదృశ్యం) టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ వేదికగా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి అనేక మంది ఉద్యమ నేతలకూ ‘చరిత్ర పుస్తకం’లో చోటు కల్పించలేదు. అయితే 9వ తరగతి తెలుగు ఉపవాచకంలో మాత్రం నాలుగో పాఠంగా జయశంకర్ పేరుతో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా ఉద్యమంలో ఆయన పాత్రను వివరించారు. ఇక అన్ని తరగతుల తెలుగు పుస్తకాల్లో రాష్ట్ర గేయం లేకుండానే ముద్రించారు.
మలి దశలో బలిదానాలెన్ని?
విద్యార్థుల బలిదానాల విషయంలోనూ సరైన వివరాలను పొందుపరచక పోవడం గమనార్హం. మలి దశ(2009 నుంచి) ఉద్యమంలో ఎంత మంది విద్యార్థులు చనిపోయారన్న విషయాన్ని స్పష్టం చేయలేదు. నిజానికి తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యయనంలో 1,080 మంది చనిపోయినట్లు తేలింది. అయితే మలిదశలో బలిదానాల సంఖ్యను మాత్రం పదో తరగతి పాఠ్యాంశంలో ఎక్కడా చెప్పలేదు. వందల మంది చనిపోయారన్న విషయాన్ని పేర్కొంటూ ముగించేశారు. 8వ తరగతి తెలుగు వాచకంలో మాత్రం 1969 ఉద ్యమంలో తమ ప్రాణాన్ని లెక్క చేయకుండా యువకులు, విద్యార్థులు ఉద్యమం చేశారని, అందులో 360 మందికి పైగా చనిపోయారని పేర్కొంటూ ‘అమరులు’ పేరుతో 9వ పాఠంగా పద్య, గద్య రూపంలో చేర్చారు.
పాఠ్యాంశంలో టీఆర్‌ఎస్
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం పాఠంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) ప్రస్తావన ఉంది. 2009లో టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా కె.చంద్రశేఖర్‌రావు నిరాహార దీక్షతోనే విద్యార్థులు ఉస్మానియా సహా అన్ని యూనివర్సిటీల్లో ఐక్య కార్యాచరణ సమితులుగా ఏర్పడ్డారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఉద్యమ తీవ్రత, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ప్రకటన, తర్వాత దాని ఉపసంహరణ వంటి అంశాలను వివరించారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ రాజకీయ పార్టీలను ఏకం చేసేందుకు పొలిటికల్ జేఏసీ ఏర్పాటు, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి వారి కృషిని పాఠంలో ఎక్కడా వివరించలేదు.