సచివాలయ పాత భవనాలను పేల్చి.. కూల్చేద్దాం! | Telangana Officials Plan For New Secretariat | Sakshi
Sakshi News home page

పేల్చి.. కూల్చేద్దాం!

Published Wed, Jul 31 2019 2:28 AM | Last Updated on Wed, Jul 31 2019 10:39 AM

Telangana Officials Plan For New Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయ పాత భవనాలను కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ పద్ధతిలో పేలుడు పదార్థాలు ఉపయోగించి కూల్చివేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సెక్రటేరియట్‌ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కొత్త భవన సముదాయానికి డిజైన్లు కూడా సిద్ధమవుతున్నాయి. త్వరలో వాటిని ఖరారు చేసి నిర్మాణానికి వీలుగా టెండర్లు ఖరారు చేయబోతున్నారు. శ్రావణ మాసంలో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. దాదాపు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక హంగులతో కొత్త భవనాల సముదాయం రూపుదిద్దుకోనుంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న పాత భవనాలను కూల్చివేయాల్సి ఉంది. ఈ ప్రక్రియను కూడా శ్రావణ మాసంలోనే మొదలుపెట్టాలని భావిస్తున్నారు.  

15 రోజుల్లో కార్యాలయాల తరలింపు... 
ప్రస్తుతం సచివాలయంలో దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాలున్నాయి. ఒక్కో భవనం ఒక్కో బ్లాకుగా మొత్తం పది భవనాలున్నాయి. ఇందులో జీ బ్లాకుగా ఉన్న నిజాం హయాంలో నిర్మించిన సైఫాబాద్‌ ప్యాలెస్‌ అన్నింటికంటే పురాతనమైంది కాగా, ప్రస్తుతం మంత్రుల కార్యాలయాలున్న డి బ్లాక్‌ భవనం కొత్తది. మిగతావి ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి తదితరులు ముఖ్యమంత్రులుగా ఉండగా నిర్మించినవి. ఇప్పుడు ఈ భవనాలన్నింటినీ కూల్చివేయనున్నారు. తొలుత ఎ, బి, సి, డి బ్లాకుల్లోని కార్యాలయాలను హెచ్, జే, కే బ్లాకుల్లోకి తరలించి వాటిని కూల్చి కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. కానీ అదే ప్రాంగణంలో కార్యాలయాలుంటే, కూల్చివేతల సమయంలో దుమ్ము ధూళితో ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించారు. దీంతో వేరే చోటకు కార్యాలయాలను తరలించి మొత్తం భవనాలన్నింటినీ ఒకేసారి కూల్చి కొత్త భవన సముదాయం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు వీలుగా బీఆర్‌కే భవన్‌ను ఎంపిక చేసి అందులోని కార్యాలయాలను ఖాళీ చేయించారు. వచ్చే పక్షం రోజుల్లో సచివాలయ కార్యాలయాలు అందులోకి తరలిపోనున్నాయి. 

పాత విధానంలో దుమ్ము ధూళి సమస్య...  
సచివాలయం మొత్తం ఖాళీ కాగానే ఆ భవనాల కూల్చివేతలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. పది బ్లాకులుగా పెద్దపెద్ద భవనాలున్నందున వాటిని సంప్రదాయ పద్ధతిలో కూల్చివేయటానికి చాలా సమయం పడుతుండటమే కాకుండా, పనులు జరుగుతున్నన్ని రోజులు దుమ్ము ధూళి సమీప ప్రాంతాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నందున ఆధునిక పద్ధతిలో కూల్చివేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం పేలుడు పదార్థాలు అమర్చి ఒకేసారి భవనం మొత్తాన్ని నేలకూల్చే బ్లాస్టింగ్‌ను ఎంచుకోనున్నట్టు సమాచారం. దీంతో ఒకటి రెండు రోజుల్లోనే అన్ని బ్లాకులను కూల్చివేసి శిథిలాలను తరలించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో సంబంధిత నిపుణులను పిలిపించి చర్చించనున్నారు. ఈ విధానం హైదరాబాద్‌లో పెద్దగా చేపట్టిన దాఖలాలు లేవు. గతంలో మూడునాలుగు పర్యాయాలు కొన్ని భవనాలను కూల్చారు. అయితే, వాటిలో కొన్ని పూర్తిగా విజయవంతం కాలేదు. దీంతో ఈ విధానంలో నైపుణ్యం ఉన్నవారికే ఈ బాధ్యత అప్పగించాలని యోచిస్తున్నారు. త్వరలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం భేటీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement