
వరంగల్ రూరల్: జిల్లాలోని 32 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) పాలకవర్గాలకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఓటరు జాబితాలను సిద్ధం చేసి సొసైటీల్లో అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలపై ఈ నెల 27వ తేదీ వరకు అభ్యంతరాలు ఉంటే తెలపవచ్చు. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక చేర్పులు, మార్పులతో రూపొందిన తుది జాబితాకు ఈ నెల 28న ఎన్నికల రిజిస్ట్రార్ ఆమోదం తెలపనున్నారు.
ఈ నెల 30న ఓటర్ల జాబితాకు రాష్ట్ర సహకార ఎన్నికల నిర్వాహకులు ఆమోదముద్ర వేయనున్నారు. ఇదిలా ఉండగా సంగెం పీఏసీఎస్ పాలకవర్గం పదవీ కాలం 2020, ఆగస్టు 2 వరకు ఉన్నందువల్ల ఆ సొసైటీకి మినహా మిగతా 32 పీఏసీఎస్‌లకు ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోని 32 సొసైటీల్లో మొత్తం 1,58,011 మంది ఓటర్లు ఉన్నారని ఆమె వెల్లడించారు.
ఎన్నికల నిర్వహణకు సిద్ధం
ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాల తుది జాబితా డిసెంబర్ 30 ఆమోదం పొందాక ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషనే మిగిలి ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. – ఎస్.పద్మ, జిల్లా సహకార శాఖ అధికారి