
రైతులకు అండగా నిలుద్దాం
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయి నిండు జీవితాన్ని బలితీసుకున్న రైతు కుటుంబానికి సర్కార్ అండగా నిలిచి ఆదుకోవాలని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి కోరారు.
- ఆత్మహత్యలను నివారిద్దాం
- పరిహారానికి నిబంధనలు సరికాదు
- బోరు వ్యక్తిగతం.. చెరువు సామూహికం
- నాణ్యమైన కరెంటు సరఫరా అనివార్యం
- రైతు సదస్సులో తెరసం అధ్యక్షుడు నందిని సిధారెడ్డి
సిద్దిపేట టౌన్/అర్బన్: ప్రకృతి వైపరీత్యాలతో పంటలు కోల్పోయి నిండు జీవితాన్ని బలితీసుకున్న రైతు కుటుంబానికి సర్కార్ అండగా నిలిచి ఆదుకోవాలని తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డా. నందిని సిధారెడ్డి కోరారు. బాధిత కుటుంబాలకు పరిహారమిచ్చేందుకు 13 నిబంధనలు విధించడం సరికాదన్నారు. మూడు నిబంధనలతో ఆత్మహత్యను నిర్ధారించి పరిహారం చెల్లించే విధానాన్ని ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టడం ద్వారా వారికి ఓదార్పు కలుగుతుందని అభిప్రాయపడ్డారు. సిద్దిపేట ఎన్‌జీఓ భవన్‌లో ‘వ్యవసాయ సంక్షోభం- రైతు ఆత్మహత్యలు - సవాళ్లు- పరిష్కారాలు’ అంశంపై పౌర సమాజ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు.
కుటుంబ యజమానిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్న రైతు కుటుంబం 13 నిబంధనలను పాటించడం కష్టమవుతుందన్నారు. బాధిత కుటుంబానికి తక్షణ ఖర్చుల కోసం రూ. 10 వేలు విడుదల చేయాలన్నారు. ఆత్మహత్య నిర్ధారణకు కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. దీర్ఘకాలిక ప్రణాళిక ద్వారా రైతు ఆత్మహత్యలు చేసుకోకుండా చూడాలన్నారు. పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని, పంటల బీమా పథకాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, లేకపోతే ఉపాధి కల్పించాలని కోరారు.
చెరువు సామూహికమని, బోరు వ్యక్తిగతమన్నారు. సామూహిక సేద్యాన్ని అమలు చేయాలన్నారు. చెరువులు, కుంటలను పటిష్టపర్చాలన్నారు. బతకాలె.. బతికించాలె అనే నినాదాన్ని ప్రచారం చేయాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రొ. రమా మేల్కోటె మాట్లాడుతూ, తెలంగాణ వాతావరణానికి అనుకూలంగా వ్యవసాయ విధానం రూపొందించాలన్నారు. సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచాలన్నారు. వ్యవసాయానికి పదిశాతం బడ్జెట్‌ను కేటాయించాలన్నారు.
మహిళా చైతన్యంతోనే వ్యవసాయం పండుగ
ఎక్కడ మహిళలు చైతన్యమవుతారో అక్కడ వ్యవసాయం పండుగలా మారుతుందని కేరింగ్ సిటిజన్ కలెక్టివ్ సంస్థ డెరైక్టర్ సజయ అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాల మహిళలు నేలమ్మ సహకార గ్రూపుగా మారడంతో పాటు తమ ఆకాంక్షలను ప్రభుత్వానికి ఐకమత్యంగా వినిపించాలన్నారు. ఆధునిక వ్యవసాయానికి అవసరమైన శిక్షణ తీసుకోవాలన్నారు. తెలంగాణ రైతు రక్షణ వేదిక అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు మాట్లాడుతూ, అప్పుల వల్లే రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.
జిల్లాలో 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడం సరికాదన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, తెలంగాణ ఉన్నత విద్య మండలి సభ్యుడు డా. పాపయ్య, తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు హన్మంతరెడ్డి, డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ తదితరులు రైతుల ఆత్మహత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమగ్ర పథకాన్ని రూపొందించి అమలు చేయడం ద్వారా ఆత్మహత్యలు జరగకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులు పాల్గొన్నారు.