బర్డ్‌ఫ్లూ భయం లేదు | Telangana reports bird flu outbreak, culls poultry | Sakshi
Sakshi News home page

బర్డ్‌ఫ్లూ భయం లేదు

Published Wed, Apr 15 2015 3:02 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

బర్డ్‌ఫ్లూ భయం లేదు - Sakshi

బర్డ్‌ఫ్లూ భయం లేదు

* పశుసంవర్థక శాఖ స్పష్టీకరణ  
* 1.45 లక్షల కోళ్లను పూడ్చిపెడుతున్న అధికారులు
* పౌల్ట్రీ రైతుల కోసం కంట్రోల్ రూం ఏర్పాటు
* వైద్యారోగ్య శాఖతో సమన్వయం,పజలకు అవగాహన కార్యక్రమాలు
* నేడు రాష్ట్రానికి కేంద్ర బృందం రాక

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ కలకలం రేగింది. తెలంగాణలో ఈ వైరస్ తొలిసారిగా నిర్ధారణ అయింది.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరులోని ఓ పౌల్ట్రీ ఫాంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకినట్లు పశు సంవర్థక శాఖ సంచాలకులు డాక్టర్ వెంకటేశ్వర్లు మంగళవారం వెల్లడించారు. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తొర్రూరులోని రైతు బాలకృష్ణారెడ్డికి చెందిన పౌల్ట్రీ ఫాంలోని 70 వేల కోళ్లలో ఇటీవల కొన్ని కోళ్లు చనిపోవడంతో అనుమానం వచ్చి భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ ఏనిమల్ డిసీజ్ ల్యాబ్‌కు నమూనాలు పంపించారు. పది నమూనాల్లో ఐదింటికి పాజిటివ్ వచ్చిందని, వాటికి బర్డ్‌ఫ్లూ సోకినట్లు సోమవారం నిర్ధారణ అయిందని వెంకటేశ్వర్లు తెలిపారు.

వ్యాధి సోకిన జోన్‌లోని అన్ని కోళ్లను నాశనం చేస్తున్నట్లు తెలిపారు. బాలకృష్ణారెడ్డి ఫాంలోని కోళ్లతోపాటు మరో నలుగురు రైతులకు చెందిన మొత్తం 1.45 లక్షల కోళ్లను చంపేసి పూడ్చి పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. నిఘా జోన్‌లోని 18 గ్రామాల్లోని కోళ్ల శాంపిళ్లను పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు. నివేదికను బట్టే అక్కడి నుంచి గుడ్లు, కోళ్లను మార్కెట్‌లోకి అనుమతిస్తామన్నారు. గుడ్లను, మాంసాన్ని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 20 నిముషాలు ఉడికిస్తే వైరస్ చనిపోతుందన్నారు. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు.

వ్యాధి సోకి న ప్రాంతంలో నిపుణుల బృందం అధ్యయనం చేస్తుందని, వైరస్ ఎలా సోకిందన్న దానిపై పరిశోధించి ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభావిత ప్రాంతం నుంచి గత 20 రోజుల్లో ఏయే ప్రాంతాలకు గుడ్లు సరఫరా అయ్యాయన్న విషయాన్నీ ఆరా తీస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ర్టవ్యాప్తంగా కోళ్ల నుంచి నమూనాల సేకరణ నిరంతరం జరుగుతోందని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. అనుమానాలున్న పౌల్ట్రీ రైతుల కోసం తమ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 9989998097 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
 
సర్కారు అప్రమత్తం
బర్డ్‌ఫ్లూ వ్యాధిపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. నివారణ చర్యల్లో భాగంగా అత్యవసర సేవా విభాగాలను సన్నద్ధం చేసింది. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పశుసంవర్థక శాఖతో సమన్వయం చేసుకుంటూ వైద్య, ఆరోగ్య శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఒకవైపు పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్లను చంపి పూడ్చి పెడుతుండగా మరోవైపు వైద్య శాఖ అధికారులు రంగంలోకి దిగి కోళ్లఫారాల్లోని సిబ్బందికి వ్యాధి నిరోధక మాత్రలను పంపిణీ చేస్తున్నారు. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఎవరిలోనూ బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి.

రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరులోని 10 కిలోమీటర్ల పరిధిలో ఇంటింటినీ పరీక్షించాలని అధికారులు నిర్ణయించారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు బుధవారం ముగ్గురు సభ్యుల రాష్ట్రస్థాయి  బృందం తొర్రూరు పరిసర ప్రాంతాల్లో పర్యటించనుంది. అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందించేవిధంగా కార్యాచరణ రూపొందించారు. వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు అపోహలు తొలగించేలా ప్రచారం చేస్తారు. కాగా బుధవారం కేంద్ర బృందం కూడా రాష్ట్రానికి రానుంది. బర్డ్‌ఫ్లూ సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు, గొంతునొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement