తెలంగాణ రౌండప్.. | Telangana Round up: More memories in 2014 | Sakshi
Sakshi News home page

తెలంగాణ రౌండప్..

Published Tue, Dec 30 2014 3:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:55 PM

తెలంగాణ రౌండప్..

తెలంగాణ రౌండప్..

2014 మిగిల్చిన జ్ఞాపకాలెన్నో..
మన రాష్ట్రం.. మన పాలన
పద్నాలుగేళ్ల ఉద్యమంతో తొలి అధికార పీఠానికి టీఆర్‌ఎస్
తొలి సీఎంగా కె.చంద్రశేఖర్‌రావు.. రూ. లక్ష కోట్లతో తొలి బడ్జెట్
రాష్ట్ర పండుగగా బతుకమ్మ.. గోల్కొండలో స్వాతంత్య్ర వేడుకలు
రాష్ట్రాన్ని చుట్టుముట్టిన కరెంటు కష్టాలు, జల వివాదాలు
బియాస్ నదిలో కొట్టుకుపోయిన రాష్ట్ర విద్యార్థులు
మాసాయిపేట ప్రమాదంలో చిన్నారుల దుర్మరణం
రాష్ట్రంలో మారిపోయిన రాజకీయ సమీకరణాలు
పదేళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనకు చరమగీతం
కొన్ని జిల్లాల్లో తుడిచిపెట్టుకుపోయిన తెలుగుదేశం
ఉనికి చాటిన వైఎస్‌ఆర్‌సీపీ.. వామపక్షం దయనీయం

 
తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష, అరవై ఏళ్ల కల నెరవేరిన సంవత్సరమిది. కోట్లాది తెలంగాణ ప్రజల మదిలో నిలిచిపోయిన ఏడాది ఇది. ఉద్యమపార్టీగా రాష్ట్ర సాధనకు తోడ్పడిన టీఆర్‌ఎస్... తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేసీఆర్ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లతో తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణ సంప్రదాయమైన బతుకమ్మను రాష్ట్ర పండుగగా నిర్వహించింది.. తెలంగాణకు చెందిన 13 ఏళ్ల గిరిజన విద్యార్థిని మాలావత్ పూర్ణ అతిచిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కి రికార్డు సృష్టించింది.. ఇలాంటి తీపిగుర్తుల మధ్య ఎన్నో సమస్యలూ ఈ ఏడాదికి సాక్షీభూతంగా నిలిచాయి.  ఆంధ్రప్రదేశ్‌తో జల జగడాలు, విద్యుత్ వివాదాలు తప్పలేదు.. ఉద్యోగుల విభజన, ఇంటర్‌బోర్డు, పరీక్షల వ్యవహారాల్లో తగాదాలూ తప్పలేదు.. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో కొట్టుకుపోయిన రాష్ట్ర విద్యార్థులు, మెదక్‌జిల్లా మాసాయిపేట వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొన్న ప్రమాదంలో బలైన చిన్నారులు ఇంకా కళ్లముందే మెదులుతున్నారు.
 - సాక్షి, హైదరాబాద్
 
60 ఏళ్ల కల సాకారం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం
ఇన్నాళ్లకు నెరవేరింది..
2013 జూన్ 30వ తేదీ కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక కమిటీ సీడబ్ల్యూసీలో తీర్మానం చేసిన తర్వాత నుంచి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న లోక్‌భలో, 20న రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పాస్ అయ్యింది. మార్చి 1వ తేదీన గె జిట్ విడుదలైంది. ఇక జూన్ 2వ తేదీ నుంచి అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. దేశంలో 29వ రాష్ట్రంగా, 12వ అతి పెద్ద రాష్ట్రంగా నిలిచింది. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు, 17 లోక్‌సభ స్థానాలతో ఏర్పాటైన తెలంగాణలో... ఏప్రిల్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్‌ఎస్) అత్యధిక స్థానాలు సాధించి.. అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రం అమల్లోకి వచ్చిన జూలై 2వ తేదీనే ప్రమాణ స్వీకారం చే శారు.
 
కొత్త రాష్ట్రం.. తొలి ఎన్నికలు
కొత్త రాష్ట్రం తెలంగాణలో ఈ ఏడాది జరిగిన తొలి ఎన్నికల్లో.. అంతకు ముందు పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మట్టి కరిచింది. కేవలం 21 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది. పద్నాలుగేళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన పార్టీ టీఆర్‌ఎస్.. 63 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 63, కాంగ్రెస్ 21, టీడీపీ 15, ఎంఐఎం 7, బీజేపీ 5, వైఎస్సార్‌సీపీ 3, బీఎస్పీ 2 సీట్లు గెలుచుకోగా... సీపీఎం, సీపీఐ ఒక్కో సీటును, ఒక స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఇక 17 లోక్‌సభ స్థానాల్లో... టీఆర్‌ఎస్ 11, కాంగ్రెస్ 2, టీడీపీ, బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీ, ఎంఐఎం ఒక్కో సీటు దక్కించుకున్నాయి.
 
కొలువు తీరిన తొలి శాసనసభ..
రాష్ట్రం అధికారికంగా ఏర్పడిన రోజే తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్‌రావు ప్రమాణ స్వీకారం చేయగా... తొలుత ఆయన 11 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. డాక్టర్ రాజయ్య, మహమూద్ అలీ ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా నియమితులయ్యారు. రాష్ట్ర శాసనసభ జూలై 9వ తేదీన తొలిసారిగా సమావేశమైంది. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనాచారి తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డిని ఎంపిక చేశారు. కొంతకాలం తర్వాత శాసనమండలి చైర్మన్‌గా టీఎన్జీవోల సంఘం మాజీ నేత స్వామిగౌడ్‌ను ఎన్నుకున్నారు. శాసనసభ తొలి సమావేశాలు జూన్ 9 నుంచి 14 వరకు ఆరు రోజుల పాటు జరిగాయి. తొలి బడ్జెట్ సమావేశాలు నవంబర్ 5వ తేదీ నుంచి 29 వరకు 19 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగాయి.
 
 రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ రూ. 1,00,637 కోట్లతో తొలి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక పల్లెపల్లెకూ తాగునీటిని అందించేందుకు వాటర్‌గ్రిడ్, గ్రామీణ చెరువులకు నీటి కళను తెచ్చిపెట్టేలా చెరువుల పునరుద్ధరణ కోసం ‘మిషన్ కాకతీయ’, ఫార్మా సిటీ, రాచకొండ గుట్టల్లో ఫిల్మ్‌సిటీ, యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి వంటి వాటికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు రూ. లక్ష వరకు పంట రుణాలను, బంగారంపై తీసుకున్న అప్పులను మాఫీ చేస్తూ సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకుంది. 36 లక్షల మంది రైతులకు చెందిన మొత్తం రూ. 17 వేల కోట్ల రుణాలకు గాను మొదటి విడతగా రూ. 4,250 కోట్లు (25 శాతం) బ్యాంకులకు అందజేసింది. మిగతా సొమ్మును దశల వారీగా ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు హామీయిచ్చింది.
 
 ‘సర్వే’త్రా ఉత్కంఠ..
 తెలంగాణలో ప్రతి కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే నిమిత్తం ప్రభుత్వం విస్తృత స్థాయిలో ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నిర్వహించింది. ఆగస్టు 19న ఒకే రోజు రాష్ట్రంలోని దాదాపు 90 లక్షల కుటుంబాలకు చెందిన సుమారు 3.6 కోట్ల మంది సమాచారాన్ని విజయవంతంగా సేకరించగలగడాన్ని ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు, సిబ్బంది సుమారు 1.20 లక్షల మంది ‘సర్వే’లో పాల్గొనడం విశేషం. సర్వే రోజున నగరాలు, పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలన్నిటిని వినియోగించుకుని ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా పూర్తి చేసింది.
 
 బతుకమ్మకు కొత్త శోభ
 ఇంతకాలం గ్రామాలకే పరిమితమైన బతుకమ్మ పండుగకు 2014 సంవత్సరం కొత్త శోభను తెచ్చింది. బతుకమ్మ పండుగను రాష్ట్ర వేడుకగా ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మల నిమజ్జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బతుకమ్మ వైభవాన్ని చాటిచెప్పే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా నిర్వహించింది. నగరంలోని ప్రధాన కూడళ్లను బతుకమ్మ సంప్రదాయం ప్రతిబింబించేలా అలంకరించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇక నుంచి ఏటా ఘనంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది.
 
 జల వివాదాలు.. లేఖాస్త్రాలు
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఏడాది నీటి వివాదాలు చుట్టుముట్టాయి. ప్రధాన నదులైన కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై జగడాలు తప్పలేదు. జల వివాదాలు చివరికి రాజకీయ వివాదాలుగా కూడా మారాయి. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టా తాగునీటి అవసరాలకు నీటి విడుదలపై రేగిన వివాదం డిసెంబర్ చివరిదాకా కొనసాగింది. సాగర్‌లో వాడకానికి అందుబాటులో ఉన్న 93 టీఎంసీల నీటిని ప్రస్తుత రబీ అవసరాలకు వాడుకుంటామని తెలంగాణ చెబుతుంటే... అసలు ఆ నీటిని వాడుకునే హక్కు తెలంగాణకు లేదని ఏపీ వాదిస్తోంది. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ వాటా మేరకు అక్టోబర్‌లో శ్రీశైలం జలాశయం నీటిని వాడుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఏపీ అడ్డుపడి.. దుమారానికి తెరలేపింది. ఎడమ గట్టున విద్యుదుత్పత్తికి వీలుగా కనీస నీటి మట్టం 834 అడుగుల వరకు వాడుకొని తీరుతామని తెలంగాణ, 854 అడుగులకు దిగువన వాడుకునే వీలు లేదని ఏపీ పట్టుపట్టాయి. ఇందులో పైచేయి సాధించిన మన రాష్ట్రం... అవసరాల నిమిత్తం 854 అడుగుల దిగువన సైతం విద్యుదుత్పత్తి చేసింది.
 
277 గ్రామాలు ఏపీలోకి..
 రాష్ట్ర విభజనలో భాగంగా ఖమ్మం జిల్లాలోని 277 రెవెన్యూ గ్రామాలను తెలంగాణ కోల్పోయింది. పోలవరం ముంపు ప్రాంతాల కింద భద్రాచలం, పాల్వంచ డివిజన్ల పరిధిలోని ఏడు మండలాలకు చెందిన ఈ గ్రామాలను అవశేష ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. వీటిలోని భద్రాచలం రెవెన్యూ గ్రామంతో పాటు బూర్గంపాడు మండలంలోని 13 గ్రామాలను మినహా యించారు. అయితే.. ఈ గ్రామాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లో కలపాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా డిమాండ్ మొదలుపెట్టింది. బూర్గంపాడు మండలాన్ని పూర్తిగా ఏపీలో కలిపితే కిన్నెరసాని జలాలపై ఆ రాష్ట్రం చేతిలోకి వెళ్లిపోయే అవకాశముంది.
 
కరెంటుకు తప్పని కట కట..
 విద్యుత్ అంశంలో ముందుగా ఊహించినట్లుగానే తెలంగాణకు   కష్టాలు ఎదురయ్యాయి. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ చేష్టల కారణంగా విద్యుత్ వాటాల పంపిణీలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తప్పలేదు. ఖరీఫ్‌లో ఒక్కసారిగా డిమాండ్ పెరిగి.. తెలంగాణలో రోజుకు దాదాపు 20 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొరత ఏర్పడింది. పునర్విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం, సీలేరు కాంప్లెక్స్ నుంచి తెలంగాణకు వాటా మేరకు విద్యుత్ రావాల్సి ఉన్నా... ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. దీంతో తెలంగాణలో విద్యుత్ లోటు మరింత పెరిగిపోయింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేసుకుంది. రాష్ట్ర, కేంద్ర ఈఆర్‌సీలతో పాటు కేంద్ర ఇంధన శాఖ సైతం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను కొనసాగించాలని సూచించినా.. ఏపీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా తెలంగాణ శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేసింది. విద్యుత్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టింది. ఛత్తీస్‌గఢ్ నుంచి వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు సీఎం కేసీఆర్ స్వయంగా ఆ రాష్ట్రానికి వెళ్లి ఒప్పందం చేసుకున్నారు.
 
 ఖమ్మం జిల్లా మణుగూరులో 1,080 మెగావాట్ల విద్యుత్ కేంద్రం, కొత్తగూడెం ప్లాంట్‌లో అదనంగా 800 మెగావాట్ల యూనిట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో కృష్ణా తీరం వెంబడి.. ఎన్టీపీసీ, టీఎస్ జెన్‌కో ఆధ్వర్యంలో భారీ ఎత్తున 7,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించారు. ఇవేగాక సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపైనా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రైతులకు నేరుగా సోలార్ పంపుసెట్లను అందించేందుకు చర్యలు చేపడుతోంది.
 
వెంటాడుతున్న బియాస్ దుర్ఘటన..
జూన్ 7న హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో జరిగిన దుర్ఘటన రాష్ట్రాన్ని ఇంకా వెంటాడుతూనే ఉంది. స్టడీటూర్‌కు వెళ్లిన హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు నదిలో దిగి ఫోటోలు దిగుతుండగా ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపి నెలరోజుల పాటు ఆధునిక పరికరాలతో గాలించి 23 మంది విద్యార్థుల మృతదేహాలను వెలికితీశాయి. హైదరాబాద్‌లోని నల్లకుంటకు చెందిన కల్లూరి శ్రీహర్ష ఆచూకీ నేటికీ లభించలేదు.

రాచఠీవితో సంబరాలు..
గతానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశ స్వాతంత్య్ర దినోత్సవాలను తొలిసారిగా గోల్కొండ కోటలో నిర్వహించింది. దీంతో గోల్కొండ కోటపై సర్వత్రా చర్చలు మొదలయ్యాయి. వినూత్నంగా నిర్వహించే ఆలోచనతో పరేడ్ గ్రౌండ్ నుంచి ఈ ఉత్సవాలను గోల్కొండ కోటకు మార్చినప్పుడు విమర్శలు వచ్చినా.. సీఎం కేసీఆర్ అక్కడే పతాకావిష్కరణ చేశారు.
 
మారిన రాజకీయ ముఖ చిత్రం..
రాష్ట్రంలో ఈ సంవత్సరం ఒక్కసారిగా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. సుదీర్ఘకాలం అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్, టీడీపీ ప్రతిపక్ష పాత్రకు పరిమితమయ్యాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజలు తమను నెత్తికెత్తుకుంటారనుకున్న కాంగ్రెస్‌కు భంగపాటు తప్పలేదు. బలమైన నాయకత్వం లేకపోవడం, తెలంగాణ ఇచ్చింది తమ పార్టీయేనన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్.. సహజంగానే అధికారానికి దూరమైంది. ఇక రెండు కళ్ల సిద్ధాంతాన్ని వల్లె వేసిన టీడీపీకి రంగారెడ్డి, హైదరాబాద్ మాత్రమే కొంత అండగా నిలిచాయి. పలు జిల్లాల్లోనైతే టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
 
ఇక రాష్ట్రంలో వామపక్షాల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తెలంగాణవాదాన్ని భుజాన వేసుకున్న సీపీఐ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని పోటీకి వెళ్లినా... కేవ లం ఒక్క సీటుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సమైక్యవాదానికి చివరివరకూ కట్టుబడి ఉన్న సీపీఎం ఒక సీటుతో సంతృప్తి పడింది. తెలంగాణలో తొలిసారి ఎన్నికలను ఎదుర్కొన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో విజయం సాధించింది. ఇక నాయకుల వ్యక్తిగత ఇమేజ్‌తోనే అయినా బీఎస్పీ ఆదిలాబాద్ జిల్లాలో రెండు సీట్లు గెలుచుకుంది.
 
గులాబీ నేతల ఆపరేషన్ ఆకర్ష్
 తమ పోరాటం ద్వారా తెలంగాణ కల సాకారమైందని చెప్పడంలో టీఆర్‌ఎస్ విజయవంతమైనా... రాష్ట్ర ప్రజలు ఆ పార్టీకి బ్రహ్మరథమేమీ పట్టలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు 60 సీట్లు అవసరంకాగా... టీఆర్‌ఎస్ తెచ్చుకున్నది 63 స్థానాలు మాత్రమే. దీంతో తమ బలాన్ని పెంచుకునేందుకు టీఆర్‌ఎస్ ‘ఆకర్ష్’ చేపట్టి వలసలను ప్రోత్సహించింది. జూన్ 25వ తేదీన ఒకే రోజు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలు, ఇద్దరు పీఆర్టీయూ ఎమ్మెల్సీలు కలిపి 11 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి (ఆగస్టు 7న), కనకయ్య (సెప్టెంబర్ 1న), రెడ్యానాయక్ (నవంబర్ 4న), కాలె యాదయ్య (నవంబర్ 16న), వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే మదన్‌లాల్ (సెప్టెంబర్ 1న) టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
 
సరికొత్త చిహ్నాలు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ప్రత్యేకంగా రాష్ట్రానికి కొత్త చిహ్నాలను ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పక్షిగా పాలపిట్ట, చెట్టుగా జమ్మిచెట్టు, పువ్వుగా తంగేడు పువ్వు, రాష్ట్ర జంతువుగా జింకను ఎంపిక చేయగా... కాకతీయ తోరణం, మధ్యలో చార్మినార్‌తో రాష్ట్ర అధికార చిహ్నాన్ని కూడా రూపొందించారు.  
 
 ‘మాసాయిపేట’ మహా విషాదం
జూలై 24... పద్దెనిమిది మంది చిన్నారులను చిదిమేసిన ‘మాసాయిపేట’ విషాదం యావత్తు దేశాన్ని కదిలించింది. అమ్మానాన్నలకు టాటా చెప్పి ఆడుతూపాడుతూ ఉన్న చిన్నారులను తీసుకెళుతున్న పాఠశాల బస్సును మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద కాపలాలేని లెవెల్‌క్రాసింగ్ వద్ద రైలు ఢీకొట్టిన ఈ ఘటనలో.. 12 మంది చిన్నారులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఆరుగురు చికిత్సపొందుతూ మరణించారు. ఈ ఘటన పార్లమెంటులో దుమారం లేపి... యుద్ధప్రాతిపదికన దేశవ్యాప్తంగా లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలాను ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేలా చేసింది. దశాబ్దాల రైల్వే శాఖను మొద్దు నిద్ర నుంచి లేపింది.


ఎవరెస్ట్ ఎక్కిన ప్రతిష్ఠ..
నిజామాబాద్ జిల్లా తాడ్వాయికి చెందిన మాలావత్ పూర్ణ, ఖమ్మం జిల్లా కలివేరుకు చెందిన ఆనంద్‌కుమార్ ఎవరెస్టుపై తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించారు. అతిచిన్న వయసులో ఈ పర్వతాన్ని అధిరోహించి రికార్డు సృష్టించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement