ఏం జరుగుతుందో చూద్దాం!
తెలంగాణ ఏర్పడి, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మెల్ల మెల్లగా రాజకీయచర్చల వేడి ఊపందుకుంటోంది. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో అనేక శక్తులు, వ్యక్తులు, సంస్థలు, భిన్న భావజాలాలు, సిద్ధాంతాలు కలిగిన వారు ఐక్యంగా కలసి పోరాడిన విషయం తెలిసిందే. రెండేళ్లలో జరిగిన వివిధ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ భారీ మెజారిటీలతో విజయకేతనం ఎగురవేయడంతో ఆయా రాజకీయపార్టీల్లో స్తబ్ధత ఏర్పడడంపై కూడా ప్రస్తుతం రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయశక్తుల పునరేకీకరణకు అవకాశముందా ? లేక ప్రెషర్‌గ్రూప్ పాలిటిక్స్‌కు శ్రీకారం చుడతారా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.
తెలంగాణ ఉద్యమ సందర్భంగా అందరినీ కలుపుకుని పోయి ఏ పార్టీ ముద్రపడకుండా కీలకపాత్రను పోషించిన జేఏసీ భవిష్యత్‌లో ఏదైనా కీలకభూమికను నిర్వహిస్తుందా అన్న దానిపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి అసలు ప్రయత్నాలు అయినా మొదలయ్యాయో లేదో అంతలోనే దీనిపై పరోక్షంగా విమర్శలు, ఆరోపణల పర్వం కూడా మొదలైపోయిందట. ఈ చర్చలను, పరిణామాలను గమనిస్తున్న ముఖ్యులు గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్రను పోషించిన వారు మాత్రం.. అసలు ఏమి జరుగుతుందో చూడాలి అంటూ సంకేతాలు ఇచ్చేస్తున్నారట. ఆధిపత్య ధోరణులు, రాచరిక పోకడలను, భూస్వామ్య భావజాలాన్ని అస్సలు సహించని, ఎంతో రాజకీయచైతన్యం కలిగిన ఈ తెలంగాణ గడ్డ గర్భం నుంచి ఏమి ఉద్భవిస్తుందో చూడాల్సిందేనంటూ... ముక్తాయింపునివ్వడం కూడా రాజకీయవర్గాల్లో కలకలాన్ని రేపుతోందట...!