ఎస్సీ కార్పొరేషన్ జిల్లా కార్యాలయం
ఖమ్మం మయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ)కు చెందిన నిరుద్యోగులు సబ్సిడీ రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకునే గడువు బుధవారంతో ముగియనుంది. నిరుద్యోగులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు.. యువతకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఎస్సీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాలు అందించి.. ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ప్రభుత్వం అందించే రుణాలు పొందిన లబ్ధిదారులు యూనిట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందుతుండగా.. కొత్త రుణాల కోసం దరఖాస్తుదారుల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం రుణ ప్రణాళికను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
గత నెల 19 నుంచి దరఖాస్తు చేసుకునేలా ఆన్‌లైన్ సైట్‌ను ప్రభుత్వం ఓపెన్ చేసింది. అయితే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పలు కారణాల వల్ల జిల్లా అధికారులు ఆలస్యంగా ప్రకటించారు. దీంతో దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు కొంత వెనుకబడ్డారు. ఈనెల 7వ తేదీతోనే ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అని ప్రకటించిన ప్రభుత్వం గడువు తేదీని ఈనెల 10వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు కొంత ఊరట చెందారు. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు గడువు తేదీ పెంచాలని కోరుతున్నారు. గడువు తేదీ ముగిస్తే సవరణలకు కూడా అవకాశం కోల్పోతామని, తాము పొందాలనుకున్న యూనిట్‌ను పొందలేమని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాకు 4,065 యూనిట్లు..
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం పలు కేటగిరీల్లో సబ్సిడీ రుణాలను అందిస్తుంది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు సంబంధించిన రుణ ప్రణాళికను ప్రభుత్వం విడుదల చేసింది. అర్హులైన ఎస్సీ అభ్యర్థులకు స్వయం ఉపాధి పథకం కింద సబ్సిడీ రుణాలను అందించడంతోపాటు పలు రుణాలకు సంబంధించిన ప్రణాళికలను విడుదల చేసింది. జిల్లాకు మొత్తం 4,065 యూనిట్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో బ్యాంక్ లింకేజీ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు 670 యూనిట్లు, సీఎం ఎంటర్ ప్రిన్యూర్‌షిప్ డెవలప్ ప్రోగ్రాం(సీఎంఈడీపీ) పథకానికి 93, ఆదాయ అభివృద్ధి పథకానికి 232, సంఘాలకు 7, బ్యాంక్‌తో సంబంధం లేకుండా భూ పంపిణీ పథకానికి 110, మైనర్ ఇరిగేషన్ కింద 664, ఎనెర్జిషన్ పథకం కింద 353, ఈఎస్‌ఎస్ పథకం కింద 775, ట్రైనింగ్ ప్రోగ్రాం కింద 925, ఇతర పథకాల కింద 236 యూనిట్లను జిల్లాకు కేటాయించారు.
అయితే ఈ ఏడాది ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ ద్వారా ఎస్సీల ఆర్థిక బలోపేతం కోసం అందించే రుణాల యూనిట్ల సంఖ్యను మాత్రం తగ్గించింది. 2018–19 సంవత్సరానికి మొత్తం 670 యూనిట్లను జిల్లా లక్ష్యంగా ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో పురుషులకు 447 యూనిట్లు, మహిళలకు 223, వికలాంగులకు 34 యూనిట్లను కేటాయించింది. ఎస్సీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంక్ లింకేజీ ద్వారా అందించే రూ.లక్ష యూనిట్లు 318, రూ.2లక్షల యూనిట్లు 255, రూ.7లక్షల యూనిట్లు 97 ఉన్నాయి. గత ఏడాది జిల్లాకు 1,382 యూనిట్లను జిల్లా లక్ష్యంగా నిర్ణయించిన ప్రభుత్వం.. ఈ ఏడాది 670 యూనిట్లను మాత్రమే కేటాయించడంతో దరఖాస్తుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటివరకు 20,449 దరఖాస్తులు
జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందేందుకు 20,449 మంది దరఖాస్తుదారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. స్వయం ఉపాధి పొందేందుకు బ్యాంక్ లింకేజీ ద్వారా అందుకునే రుణాలకు వీరంతా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది రుణాలకు దరఖాస్తు చేసుకొని రుణం పొందని దరఖాస్తులు సైతం ఈ ఏడాది అందించే రుణాలకు రెన్యూవల్ అయ్యాయి. దీంతో కొత్తగా, రెన్యూవల్ అయిన దరఖాస్తులు ఇప్పటివరకు 20,449 ఉన్నాయి. ఇంకా ఒక రోజు గడువు ఉండడంతో దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆన్‌లైన్‌లో పలు కారణాలతో దరఖాస్తులు అప్‌లోడ్ కావడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. దరఖాస్తు చేసుకునే గడువు పొడిగించాలని కోరుతున్నారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక ఎన్నికల తర్వాత జరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఎన్నికల తర్వాతే ఎంపికలు..
అసెంబ్లీ రద్దుతో త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు అందించే సబ్సిడీ రుణాలు ఎన్నికల తర్వాతే ఉంటాయి. అభ్యర్థులు గడువు తేదీని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. ప్రభుత్వం గడువు తేదీ పెంచితే జిల్లాలో ఇంకా దరఖాస్తుదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రేషన్ కార్డులో ఉన్న వారిలో ఒక్కరికి మాత్రమే రుణాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీనిని గమనించి దరఖాస్తు చేసుకోవాలి. – వై.ప్రభాకర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
Comments
Please login to add a commentAdd a comment