సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోరడానికోసం రాష్ట్ర ప్రభుత్వం నివేదిక సిద్ధం చేస్తోంది. ఏటా దాదాపు నాలుగు వేల కోట్ల చొప్పున ఐదేళ్ల కాలానికి రూ.20 వేల కోట్ల మేరకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ఆ నివేదికలో కోరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 92.2 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నివేదికను సిద్ధం చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధమ్యాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరనుంది.
రాష్ట్రంలో తొమ్మిది జిల్లాలు వెనుకబడి ఉన్న విషయాన్ని కేంద్ర ప్రణాళిక, ఆర్థిక శాఖలకు సమర్పించనున్న ఆ నివేదికలో ప్రస్తావించనుంది. తాగునీటి గ్రిడ్, రహదారులు, వ్యవసాయ అభివృద్ధి, విద్య, వైద్యం, చిన్ననీటిపారుదల అభివృద్ధి, స్వయం సహాయక సంఘాలను చైతన్యపరచడం వంటి కార్యక్రమాలతోపాటు, రాష్ట్రం అభివృద్ధికి ఈ ప్యాకేజీ అవసరమని సర్కారు కేంద్రానికి వివరించనుంది. 2005లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు దేశ వ్యాప్తంగా 250 జిల్లాలను ఎంపిక చేస్తే.. అందులో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు ఉన్నాయుని, అలాగే ఉపాధి హామీ పథకం కింద తొలిదశలో 187 జిల్లాలను ఎంపిక చేస్తే.. తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు ఈ పథకం కింద ఎంపికయ్యూయున్న విషయాన్ని వివరించనుంది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గతంలో తెలంగాణలో ఎక్కువ మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ప్రాంతంలో వ్యవసాయ వనరులను పెంచడం ద్వారా రైతుల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి వీలవుతుందని స్పష్టంచేయునుంది. తాజా లెక్కల ప్రకారం 11 శాతం మేర కు గిరిజనుల జనాభా అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులకు కూడా నిధులు కావాల్సిన అవసరాన్ని నివేదికలో పొందుపర్చనున్నారు.