
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయ విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు. యూనివర్సిటీ వైస్ చాన్సులర్ (వీసీ) గత పదిహేను రోజులుగా కనిపించడంలేదంటూ విద్యార్థులు కరపత్రాన్ని విడుదల చేశారు. యూనివర్సిటీలో సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు ఉద్యోగులు గత నెల రోజులుగా విధులను బహిష్కరించి ధర్నా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులు విధులకు రాకపోవడంతో క్లాస్‌లు జరగడంలేదని విద్యార్థులు వీసీకి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశారు.
కానీ వీసీ సాంబయ్య విద్యార్థుల సమస్యలపై పట్టీపట్టనట్టు ఉంటున్నారని, ఇన్ని సమస్యలు ఉన్నా గత పదిహేను రోజులుగా యూనివర్సిటీకి రావడంలేదంటూ విద్యార్థులు మంగళవారం నిరసనకు దిగారు. తమ సమస్యలను పరిష్కారించాలని కోరుతూ యూనివర్సిటీలో ఆందోళనకు దిగి వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.