తెలంగాణ వీరవనిత పాత్రలో నటించడం నా అదృష్టం
హుజూర్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటాలు, ఆత్మ బలిదానాల ఇతివృత్తంతో నిర్మిస్తున్న జయహో తెలంగాణ సినిమాలో నటించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు సినీనటి ప్రీతి నిగమ్ అన్నారు. మంగళవారం హుజూర్‌నగర్‌లో జరిగిన ‘త్యాగాల వీణ- జయహో తెలంగాణ’ సినిమా షూటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కోసం పదవిని త్యాగం చేసిన డీఎస్పీ నళిని పాత్రలో తాను నటించడం ఆనందంగా ఉందన్నారు.
పముఖ దర్శకుడు ఎం.రవికుమార్ మొదటిసారిగా చిత్రీకరించిన ‘చాకలి అయిలమ్మ’ సినిమాలో వీరనారి అయిలమ్మ పాత్రలో తాను నటించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కవులు, కళాకారులు, నటీనటులకు కొదవ లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం వారిని ప్రోత్సహించాలన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన నటీనటులతో ఈ ప్రాంతంలోనే రూపుదిద్దుకుంటున్న సినిమాలను తెలంగాణ ప్రజలు ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రస్తుత తరుణంలో భావి తరాలకు రాష్ట్ర చరిత్రను తెలియజేసేందుకు ఇటువంటి సినిమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఆమె వెంట సినీ దర్శకుడు ఎం.రవికుమార్, నిర్మాత సతీష్‌బాబు, నటులు శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు.