‘టీడీపీ ఎమ్మెల్యేలు పనిలేక ధర్నా చేస్తున్నారా, లేదా ధర్నా చేయడమే పనిగా పెట్టుకున్నారా?
పనిలేక ధర్నా చేస్తున్నారా: కేటీఆర్
‘టీడీపీ ఎమ్మెల్యేలు పనిలేక ధర్నా చేస్తున్నారా, లేదా ధర్నా చేయడమే పనిగా పెట్టుకున్నారా? ఇంతకూ స్పీకర్ చాంబర్‌లో కిందనే కూర్చున్నారా, సోఫాల్లో కూర్చున్నారా? అయినా అసలు వాళ్లెందుకు ధర్నా చేస్తున్నారు?’’ అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేలు మంగళవారం స్పీకర్ చాంబర్‌లో ధర్నా చేయడంపై లాబీలో ఆయన విలేకరులతో ఇలా స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ సస్పెన్షన్‌పై రాష్ర్టపతికి ఫిర్యాదు చేశారని గుర్తు చేయగా, ‘ఆడ, ఈడ తిరిగే బదులు మా దగ్గరికొచ్చి అడిగితే సరిపోయేది కదా’ అన్నారు.
సీఎల్పీ నేతను చూస్తే జాలేస్తోంది: కడియం
అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత జానారెడ్డిని చూస్తే జాలేస్తోందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. ‘జానా ఒకసారి నిరసన తెలుపుతున్నట్లు చెప్పాక కూడా మరో ఎమ్మెల్యే (భట్టి) లేచి మాట్లాడే ప్రయత్నం చేయడమేమిటి? నాయకుని కంట్రోల్‌లో ఎమ్మెల్యేలు లేరు. జానా మాట ఎవరూ వింటున్నట్లు లేదు’’ అన్నారు.
కాకతీయ ఉత్సవాలు ఇప్పట్లో లేనట్టే : అజ్మీరా
కాకతీయ ఉత్సవాలు ఇప్పట్లో ఉండవని పర్యాటక మంత్రి అజ్మీరా చందూలాల్ పేర్కొన్నారు. వాటిని అత్యంత ఘనంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉత్సవాలకు రాష్ట్రపతిని ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. కాకతీయుల వారసులను ఛత్తీస్‌గడ్‌లోని బస్తర్ నుంచి ఆహ్వానించాలనుకుంటున్నాం. హైదరాబాద్‌లోని కాకతీయ వంశస్తులందరినీ గుర్తించి వారి ఫోన్ నంబర్లను కూడా సేకరించాం’’ అని చెప్పారు.
భట్టి ఎగిరి పడుతుండెందుకు: నాయిని
‘భట్టి ఎందుకు ఎగిరిపడుతుండు? ఎస్సీ సబ్ ప్లాన్ గురించి ఆయనకు జానారెడ్డి కంటే ఎక్కువ తెలుసా?’ అని లాబీల్లో తనకు ఎదురు పడిన కాంగ్రెస్ నేత డీకే అరుణను హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశ్నించారు. ఆమె బదులి వ్వకపోవడంతో ఇంకేదో మాట్లాడబోయారు. పక్కనే ఉన్న మరో మంత్రి కేటీఆర్ ఆయనను పక్కకు తీసుకెళ్లారు.