
కొత్త..కొత్తగా...!
⇒ నవ్యాంధ్రలో తొలి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
⇒ తరలివచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
⇒ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఘన స్వాగతం
⇒ దారి పొడవునా హారతులు పట్టి తిలకం దిద్దిన మహిళలు
⇒ అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ శ్రేణుల ఓవర్‌యాక్షన్
⇒ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల బస్సుకు అడ్డుగా నిలిచి నినాదాలు
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి అసెంబ్లీ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో సోమవారం మొట్టమొదటగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నోచుకున్నాయి. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వీరిలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు విచ్చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్థానికులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన ప్రత్యేక బస్సులో ఎమ్మెల్యేలతో కలిసి వెలగపూడిలోని అసెంబ్లీ భవనానికి చేరుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తున్నారని తెలుసుకున్న స్థానికులు ప్రకాశం బ్యారేజి, ఉండవల్లి సెంటర్, పెనుమాక, యర్రబాలెం, కృష్ణాయపాలెం, వెంకటపాలెం శివారు ప్రాంతానికి చేరుకున్నారు. పెనుమాకలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు జగన్‌మోహన్‌రెడ్డికి హారతులు పట్టి తిలకం దిద్ది స్వాగతం పలికారు. యర్రబాలెం, కృష్ణాయపాలెంలోనూ స్థానికులు స్వాగతం పలికారు. మందడం శివారు ప్రాంతం నుంచి సచివాలయానికి నూతనంగా ఏర్పాటు చేసిన రహదారి మీదుగా వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళుతున్నారని తెలుసుకున్న వెంకటపాలెం గ్రామస్తులు రహదారి వద్దకు చేరుకున్నారు. తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర హెనీ క్రిస్టినా ఆధ్వర్యంలో తుళ్లూరు మండల పార్టీ అధ్యక్షులు బత్తుల కిషోర్ స్వాగతం పలికారు. వారందరికీ వైఎస్ జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఇదిలావుండగా, వెంకటపాలెం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు.
అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ నేతల ఓవర్ యాక్షన్..
రాష్ట్ర తొలి బడ్జెట్ సమావేశాలు కావటంతో ప్రభుత్వ భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. దారిపొడవునా పోలీసులను మోహరింపజేసింది. ముందుగానే అసెంబ్లీ గేట్ వద్దకు చేరుకున్న అధికారపార్టీ నేతలు హడావుడి చేయటం కనిపించింది. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కలిసి ప్రత్యేక బస్సులో అసెంబ్లీ గేటు వద్దకు చేరుకోగా, వాహనానికి అడ్డుగా నిలిచిన టీడీపీ శ్రేణులు లోకేష్‌బాబుకు అనుకూల నినాదాలు చేశారు.
బస్సుకు దారి వదలాలని పోలీసులు, అక్కడున్న నేతలు చెప్పినా పట్టించుకోకుండా నినాదాలు చేస్తూ కనిపించారు. టీడీపీ శ్రేణుల ఓవర్‌యాక్షన్‌ను గమనించిన ఇరుపార్టీ నాయకులు ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. కొంత సమయంపాటు ఇరు వర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం నడిచింది. ఆ తరువాత వైఎస్సార్‌సీపీ నేతలు, పోలీసులు జోక్యం చేసుకోవటంతో వివాదం సద్దుమణిగింది. ఇదిలా ఉంటే విజయవాడ నుంచి జెండాలు చేతపట్టుకుని వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ నాయకుడు వస్తున్నారని తెలుసుకుని చూడటానికి వచ్చామని ఎంతచెప్పినా పోలీసులు వినిపించుకోలేదు.
ఆసక్తిగా మారిన అసెంబ్లీ సమావేశాలు...
ఏపీ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొట్టమొదటిసారిగా వెలగపూడిలో ప్రారంభం కావటంపై కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు ఆసక్తి చూపారు. అసెంబ్లీని, సమావేశాలను తిలకించటానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో విజయవాడ, గుంటూరు ప్రధాన మార్గాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఉండవల్లి, వెంకటపాలెం, మందడం, మల్కాపురం గ్రామాల మీదుగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ నేతలు భారీ ఎత్తున వాహనాల్లో తరలిరావడం కనిపించింది. కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు, కార్యకర్తలు తరలిరావటంతో వెలగపూడి, మందడం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోని హోటళ్లు కిటకిటలాడాయి. ఇదిలాఉంటే భారీగా తరలివచ్చిన వారికి ప్రభుత్వ యంత్రాంగం భోజన ఏర్పాట్లలో విఫలమైంది. ఎర్రటి ఎండలో సందర్శకులు తాగు నీరు కూడా లభించక ఇబ్బందులు పడ్డారు. కొందరు సృహతప్పి పడిపోవటం కనిపించింది.