
ఓటుకు నోటు కేసులో బాబు అడ్డంగా దొరికినా..
మధిర(ఖమ్మం జిల్లా): ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ, ఏపీ సీఎంలు, కేసీఆర్-చంద్రబాబులు మ్యాచ్‌ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా మధిరలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికినప్పటికీ, కేసు విషయమై తెలంగాణ సీఎం స్పందించకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
రెండు రాష్ట్రాల్లో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయడంలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు ఎవరని టీఆర్‌ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని, తమ పార్టీలో కేసీఆర్ కంటే సమర్థులైన నాయకులు 30 మందికిపైగా ఉన్నారని తెలిపారు. బంగారు తెలంగాణ పేరుతో బంగారు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.