తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా శోభారాణి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా జిల్లాకు చెందిన నాయకురాలు బండ్రు శోభారాణి నియమితులయ్యారు. ఆలేరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న శోభారాణికి తెలుగు మహిళా పగ్గాలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆమె పార్టీ తొలి మహిళా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. చాలాకాలం నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న శోభారాణి గతంలో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గతంలో కూడా పార్టీలో పలు పదవులు నిర్వహించారు. పార్టీలో తెలంగాణవాదిగా ముద్ర ఉన్న ఈమె ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ భవన్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈమెతోపాటు జిల్లాకు చెందిన మరో ఇద్దరికి రాష్ట్ర స్థాయి పదవులు లభించాయి. మునుగోడు, సూర్యాపేట నియోజకవర్గ ఇంచార్జులు చిలువేరు కాశీనాథ్, పాల్వాయి రజనీకుమారిలను పార్టీ అధికార ప్రతిని ధులుగా నియమించారు. ఈ పదవిలో గతంలో జిల్లాకు చెందిన నన్నూరి నర్సిరెడ్డి ఉన్నారు. ఆయనతో పాటు కొత్తగా ఇద్దరు కొనసాగుతారని సమాచారం.
మహిళల గొంతుకనవుతా: శోభ
తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర మహిళా విభాగం బాధ్యతలు ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి తన శాయశక్తులా ప్రయత్నం చేస్తానని ఆమె సోమవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు.రాష్ట్ర మహిళాలోకానికి ఒక గొంతుకగా నిలుస్తానని ఆమె చెప్పారు.