
గుబులు.. గుబులుగా ఆ ఎమ్మెల్యేలు!
గులాబీ ఎమ్మెల్యేల గుండెలు అదురుతున్నాయి.. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోను సంభాషణలు రికార్డయితే.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వణుకుడు ఎందుకనుకోవద్దు సుమా.. వీరిలో కొందరు టీడీపీ జరిపిన బేరసారాల్లో ఉన్న వారే. అందుకే ఈ భయమంతా..! ఎమ్మెల్సీ ఎన్నికలు తమ ప్రాణం మీదికి తెచ్చాయని లబోదిబో మంటున్నారు.
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తెలంగాణ టీడీపీ నేతలు వల విసరడం.. పేరాశతో కొందరు వారికి చిక్కడం చక చకా జరిగిపోయాయి. నేరుగా సంప్రదించడమే కాదు.. ఫోన్లలోనూ ఓటు క్రాసింగుపై ముచ్చట్లు నడిచాయి. ఇంకేముంది .. తమ ఫోన్లూ రికార్డు అయ్యాయేమో ..? తమ జాతకాలు అధినేతకు చేరాయేమో అన్న శంక వీరిని పట్టి పీడిస్తోంది.
కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, జిల్లాలకు చెందిన కొందరు గులాబీ ఎమ్మెల్యేలను టీడీపీ బుట్టలో వేసుకుందన్న వార్తలు గుప్పుమనడంతో .. ఎక్కడ తమ వ్యవహారం బట్టబయలు అవుతుందోనన్న ఆందోళన వీరిని స్థిమితంగా ఉండనీయడం లేదు. ఒక వేళ ఇవేవీ బయటకు రాకున్నా.. అధినేత వద్ద ఉన్న తమ జాతకాలు ఎక్కడ తమ తలరాతలను మారుస్తాయోనని బెంబేలెత్తుతున్నారు. మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్నవారే కాదు... ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేల్లోనూ ఈ ఆందోళన కనిపిస్తోంది...!!