
దింపుడు కల్లం వద్ద కుమార్ , ఇన్‌సెట్లో కుమార్‌ను ఇంటికి తీసుకెళ్తున్న సర్పంచ్ వెంకన్న
కురవి/మరిపెడ: తండ్రి మృతితో దుఃఖాన్ని దిగమింగుకుని విద్యార్థి పదో తరగతి పరీక్ష రాసిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని నేరడ శివారు మంచ్యా తండాలో చోటు చేసుకుంది. ఈ విషాదకరమైన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నేరడ శివారు మంచ్యా తండాకు చెందిన భూక్య రాజు(40) గుండెపోటుతో శనివారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి కుమారుడు భూక్య కుమార్ మరిపెడలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుకుంటున్నాడు.
కుమార్ ప్రసుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. తండ్రి రాజు మృతి చెందిన విషయం తెలిసి కుమార్ కన్నీరుమున్నీరయ్యాడు. గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మనోధైర్యం ఇవ్వడంతో కన్నీళ్లను దిగమింగుకుంటూ మరిపెడలోని సీతారాంపురం జెడ్పీ హైస్కూల్‌లో కుమార్ సైన్స్ రెండో పేపర్ రాశాడు. పెద్దనాన్న అయిన మాధవపురం సర్పంచ్ ఇస్లావత్ వెంకన్న పరీక్ష సమయం ముగియగానే కుమార్‌ను ద్విచక్రవాహనంపై తీసుకుని తండాకు చేరుకున్నాడు.
తండాకు వచ్చిన కుమార్ తండ్రి శవంపై పడి నాన్న లే నాన్న అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. నన్ను ఒంటిరి చేసి వెళ్లావా? అంటూ రోదిస్తుంటే తండావాసులు కన్నీటిపర్యంతమయ్యారు. వెంటనే తండావాసులు అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. దింపుడు కల్లం వద్ద తండ్రి ముఖం చూస్తూ బోరున విలపించాడు. చితికి నిప్పంటించాడు. అశ్రునయనాల నడుమ అంత్యక్రియలు ముగిశాయి. కుమార్‌కు తోడుగా తల్లి శారద ఉంది. ఈ సంఘటనతో తండాలో విషాదం అలుముకుంది. రెండు రోజులు సెలవులు ఉండడంతో కుమార్ తండాలోనే ఉంటాడని బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment