ఆ క్యాన్సర్ వదల్లేదు..
అత్యధిక చిత్రాల నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు గడించిన రామానాయుడు గత పదమూడేళ్ల కింద ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన
పడ్డారు. అప్పటి నుంచి ఆ మహమ్మారి ఆయనను బాధపెడుతూనే ఉంది. దీంతో ఆయన తరుచుగా ఆస్పత్రులకు వెళుతూపలుమార్లు చికిత్సలు పొందారు. అయితే ఆయన పూర్తిగా కోలుకున్నారని అనుకుంటుండగానే, క్యాన్సర్ తిరగబడిందని తెలిసింది. దీంతో ఆయన గత కొద్దికాలంగా కృత్రిమశ్వాస ద్వారా చికిత్స పొందుతున్నారు. ఈయన చికిత్స పొందుతున్న తీరును సినీ నటుడు రాజశేఖర్ కూడా పర్యవేక్షించారు. రామానాయుడు కుమారుడు సినీ నటుడు వెంకటేష్ ఇటీవల తన తండ్రి కోలుకుంటున్నారని చెప్పారు. ఆయన మనసంతా సినిమామీదే ఉందని, వైజాగ్లో సినీ పరిశ్రమను ఎలా అభివృద్ధి చేయాలనే విషయాన్ని తన సోదరుడు సురేశ్తో మాట్లాడుతున్నారని చెప్పారు. కానీ ఇంతలోనే ఆయన తన కుటుంబ సభ్యులను, అశేష అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్ని వీడారు.