
‘బంగారు తెలంగాణ’కు కేంద్రం చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని... దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకురావాల్సి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర నుంచి నిధులు, ప్రాజెక్టులు పొందే విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణకు చెందిన బీజేపీ నేతల బృందం రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి 14 మంది కేంద్ర మంత్రులను కలుసుకొని.. తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడే ప్రతిపాదనలను అందజేసినట్టు ఆయన వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘ఏ’ గ్రేడు కోల్పోకుండా చూడాలని తాము చేసిన విన్నపానికి మంచి స్పందన వచ్చిందని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. దాని అభివృద్ధికి రూ. 200 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరామన్నారు.