ఎక్కువ ఆయకట్టుకే తొలి ప్రాధాన్యం | The decision of the Cabinet Subcommittee on the restoration of ponds | Sakshi
Sakshi News home page

ఎక్కువ ఆయకట్టుకే తొలి ప్రాధాన్యం

Published Fri, Oct 17 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

ఎక్కువ ఆయకట్టుకే తొలి ప్రాధాన్యం

ఎక్కువ ఆయకట్టుకే తొలి ప్రాధాన్యం

చెరువుల పునరుద్ధరణపై మంత్రివర్గ ఉపసంఘంలో నిర్ణయం
స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామాల్లోనూ తొలిదశలో కార్యక్రమం
సీఎంకు నివేదించిన అనంతరం మార్గదర్శకాలు
డిసెంబర్ నుంచి పనుల ప్రారంభం
 

హైదరాబాద్: గరిష్ట స్థాయిలో ఆయకట్టుకు నీరందించగల చెరువులకే పునరుద్ధరణలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. దీంతోపాటు చెరువుల పునరుద్ధరణకు స్వచ్ఛందంగా ముందుకువచ్చే గ్రామాల్లోనూ తొలిదశలోనే పనులు ప్రారంభించాలని ప్రతిపాదిస్తోంది. పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రెండు, మూడు రోజుల్లో పూర్తి స్థాయి మార్గదర్శకాలను రూపొందించాల ని నిర్ణయించింది. చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంపై గురువారం మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి ఇందులో పాల్గొన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 46 వేల చెరువుల్లో ఏటా తొమ్మిది వేల వరకూ చెరువులను అభివృద్ధిలోకి తేవాలనే కార్యాచరణ ప్రణాళికపై నాలుగున్నర గంటల పాటు చర్చించారు. తొలిదశలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 751 కోట్లతో 1,500 చెరువులను అభివృద్ధి పరిచి... మూడు లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ పథకం కింద రూ. 710 కోట్లతో 1,500 చెరువుల మరమ్మతులు చేపట్టి 3.20 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలని, ఏఐబీపీ కింద రూ.281 కోట్లతో 44,574 ఎకరాలు కొత్త ఆయకట్టును అభివృద్ధి చేయాలని, జైకా కింద సైతం రూ. 269 కోట్ల వ్యయంతో 27 వేల ఎకరాల కొత్త ఆయకట్టును తీసుకురావాలని నిర్ణయించా రు.

ఉపాధిహామీ కింద రూ.4,500 కోట్లతో తొమ్మిది వేల చెరువుల్లో పూడికతీత చేపట్టి.. 1.85 లక్షల ఎకరాలను స్థిరీకరించాలని ప్రతిపాదించారు. హరీశ్‌రావు మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణను ఉద్యమంలా చేపడతామన్నారు. డిసెంబర్ నుంచి పనులు ప్రారంభిస్తామని... ఆయకట్టు, పరివాహకం ఎక్కువగా ఉన్న చెరువులకు, స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామాల్లో చెరువుల పునరుద్ధరణకు తొలి ప్రాధాన్యం ఇస్తామని, మూడు రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు ఖరారు చేస్తామని చెప్పారు.
 
‘ఫీజు’, ఇసుకపైనా చర్చ..


ఇదే సబ్ కమిటీ సమావేశంలో ఇసుక విధానం, ఆహార భద్రతా కార్డులు, రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ తదితర అం శాలపైనా చర్చించారు. రాక్ శాండ్‌ని ప్రోత్సహించేలా కార్యాచరణను సిద్ధం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. నామినేషన్‌పై ఇచ్చే పనుల పరిమితిని రూ. లక్ష నుంచి 5 లక్షలకు పెంచే విషయంపైనా చర్చ జరిగింది.  కళాశాలలకు బకాయిపడ్డ సుమారు రూ. 1,400 కోట్లను చెల్లించే అంశంపైనా చర్చిం చారు. శుక్రవారం దీనిపై సీఎంతో మాట్లాడాక ఒక నిర్ణయానికి రావాలని సంకల్పిం చారు. రుణమాఫీపై శుక్రవారం బ్యాంకర్లతో మరోమారు సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement