32 మండలాల్లో కరువు
ఖమ్మం జెడ్పీ సెంటర్: జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు రైతులను కరువు కోరల్లోకి నెట్టివేశాయి. ఖరీఫ్‌లో వరుణుడు ముఖం చాటేశాడు. సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదైంది. ఆశించినస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో నాటిన విత్తనాలు మొలకెత్తలేదు. రెండు, మూడుసార్లు విత్తనాలు నాటినా ప్రయోజనం లేకపోయింది. విపరీతంగా పెట్టుబడులు పెరిగాయి కానీ చివరకు పంట చేతికి వచ్చేలా లేదు. వర్షానికి వర్షానికి మధ్య వ్యవధి చాలా ఎక్కువగా ఉండటంతో పంటలు ఎండిపోయాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు.
జిల్లా కలెక్టర్ ఇలంబరితి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం తీవ్ర వర్షాభావ పరిస్థితులున్న మండలాలను గుర్తించింది. మండలాల్లో నమోదైన వర్షపాతం ఆధారంగా వీటిని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా 32 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి, కరువు విలయతాండవం చేస్తోందని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. గతేడాది సైతం జిల్లా వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయని, వరుసగా రెండోసారి విపత్కర పరిస్థితి తలెత్తడంతో జిల్లా రైతాంగం ఆందోళనలో ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు.
వ్యవసాయ, గణాంకశాఖ అధికారుల లెక్కలు ఇలా...
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, పంటల దిగుబడులు, వ్యవసాయ, గణాంకశాఖల నివేదికల ఆధారంగా కరువు మండలాలను గుర్తించి ప్రతిపాదనలు రూపొందించారు.
ఈ ఖరీఫ్ సీజన్‌లో 10 లక్షల ఎకరాల్లో పంటల సాగు చేసినట్లు వ్యవసాయాధికారులు తమ నివేదికల్లో పేర్కొన్నారు. దీనిలో పత్తి 4.30 లక్షల ఎకరాలు, వరి 3 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 35 వేల ఎకరాలు, ఇతర పంటలు 3 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు పేర్కొన్నారు. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా పత్తి, వరి , మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారుల లెక్కల ప్రకారం తెలుస్తోంది. ఖరీఫ్‌లో పంటలు పూర్తిగా దెబ్బతినగా రబీ సీజన్ కూడా ఆశాజనకంగా లేకపోవడం రైతులతో పాటు యంత్రాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.
మద్దతు ధర కరువు
అడపాదడపా కురిసిన వర్షాలకు పండిన కొద్దిపాటి పంటలకు కూడా మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. అప్పలబాధతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కరువు మండలాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటిస్తే రైతులకు ఆసరా ఉండేదని రైతుసంఘాలు అంటున్నాయి. పండిన కొద్దిపాటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నాయి. జిల్లా రైతాంగం కూడా ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురుచూస్తోంది. అధికారులు గుర్తించిన 32 మండలాలతో జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రబీ సీజన్‌కు ఎరువులు, విత్తనాలు సబ్సిడీపై అందించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.