రైతులను కాపాడడంలో ప్రభుత్వం విఫలం: పొంగులేటి
ఖమ్మం: ‘పత్తికి సీసీఐ మద్దతు ధర రూ.4,050 అని ప్రభుత్వం ప్రకటించింది. అయి నా వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. రైతుల నుంచి దళారులు కొనుగోలు చేసిన తర్వాత సీసీఐ వస్తుందా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. బుధవారం ఆయన ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లను పరిశీలించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పత్తికి కనీస మద్దతు ధర రూ.5 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రూ.4,050కి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.950 భరించాలన్నారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ నేతల ఆధ్వర్యంలో త్వరలో తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి వారికి ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు.