దైవలీల | The grateness go to God, Reporter Ali | Sakshi
Sakshi News home page

దైవలీల

Published Sun, Jun 29 2014 1:20 AM | Last Updated on Mon, Oct 22 2018 8:06 PM

దైవలీల - Sakshi

దైవలీల

వారు వచ్చి అయం ముహూర్తః సుముహూర్తోస్తు.. అంటేనే ఏ పనైనా మొదలవుతుంది. మూడు ముళ్ల వేడుకైనా.. కొత్త ఇంట కాలు పెట్టినా.. అయ్యవార్లు తథాస్తు అనాల్సిందే. అయితే పురహితం కోరే పురోహితులకు ఎన్నో సమస్యలున్నాయి. వందల పెళ్లిళ్లు చేసిన పంతుళ్లు కొందరు బ్రహ్మచారులుగానే మిగిలిపోతుంటే.. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అని దీవెనలిడుతున్న పూజార్లు అష్టదరిద్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధిరస్తు అని దీవిస్తున్న అర్చకుడి పరిస్థితి దయనీయంగా ఉంది. వేదపండితులుగా వేనోళ్ల గౌర వం పొందుతున్న పూజార్లు ఇదంతా దైవలీల అంటూ తమ అంతరంగాన్ని.. స్టార్ రిపోర్టర్ అలీ ముందు ఆవిష్కరించారు.
 
 అలీ: మామూలుగా మీరు లేకుండా పెళ్లిళ్లు జరగవు. అలాంటిది మీకు పెళ్లిళ్లు అవడంలేదు. ఎందుకని?
 నెలరాజ శర్మ : ఈ కాలంలో పూజారి అనే పదమే పెళ్లికి అడ్డుపడిపోతోంది. చదువులు, ఉద్యోగాల్లో మునిగి  తేలుతున్న అమ్మాయిలు.. పంచె, పిలకతో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోడానికి ముందుకు రావడం లేదు.
 చంద్రశేఖర్ శర్మ: మా అవతరాలొక్కటే కాదు.. చేతినిండా సంపాదన ఉండదు, తెల్లవారుజామునే లేవాలి, మడి ఆచారాలు.. వేళకు ఇంటికిరారు.. వీళ్లని కట్టుకుని ఎందుకిన్ని తిప్పలు పడాలి అనుకుంటున్నారండి.
 అలీ:  ఈ పరిస్థితి వచ్చి ఎన్నాళ్లయింది?
 ఫణికుమార్ శర్మ: ఓ ఆరేడేళ్లయింది.
 ఎమ్.శ్రీనివాసు: పూర్వం ఫలానా ఇంటిపేరు గల అబ్బాయి అనగానే ఆడపెళ్లివారు సంబంధం ఖాయం చేసేసేవారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
 నెలరాజ శర్మ: ఇప్పుడు అర్చకుడైనా, పురోహితుడైనా ఒక అలంకారంగా ఉండాల్సి వస్తోంది. దీనికి తప్ప మేం ఇక దేనికీ అర్హులు కాదన్నట్టు తయారయ్యాయి పరిస్థితులు.
 చంద్రశేఖర శర్మ: ఏవో తిప్పలు పడి పెళ్లిచేసుకున్నవారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ వేషధారణతో భార్యాబిడ్డల్ని తీసుకుని  ఏ సినిమాకో, షాపిం గ్‌కో వెళితే జూలో జంతువుని చూసినట్టు వింతగా చూస్తారు. ‘పూజారులు ఇలాగే ఉంటారు కదా.. ఇందులో వింత, విడ్డూరం ఏముందిలే’ అనుకోరు.
 అలీ: ఎవరితో పోల్చినా నాకు మీకన్నా ఉత్తములుండరనిపిస్తుంది. ఉదాహరణకు ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుని, ఓ పూజారిని  హాస్పటల్‌కి తీసుకెళ్లి చెకప్ చేయిస్తే మీకు ఒకటో, రెండో ఆరోగ్య సమస్యలుంటే, అతనికి ఒంటినిండా జబ్బులే ఉంటాయి. ఇంతకంటే ఉత్తమమైన లక్షణం ఏముంది చెప్పండి.
 నెలరాజశర్మ: మీరన్నది నూటికి నూరుపాళ్లు నిజమండీ. మేం చేసే పనులు, ఆహారపు అలవాట్ల వల్ల మేం చాలావరకూ  అనారోగ్యాలకు, జబ్బులకు దూరంగా ఉంటామనే చెప్పాలి.
 అలీ: అంతేకదా! చలికాలమైనా తెల్లవారుజామునే చన్నీళ్లు స్నానం చేస్తారు. చాలావరకు ఇంటి భోజనమే ఉంటుంది. వెయ్యికోట్లు పెడితే మాత్రం ఇలాంటి డెయిలీరొటీన్ దొరుకుతుందా చెప్పండి. మిగతావాళ్ల పరిస్థితి ఇలా లేదు.  మాట్లాడితే.. క్యాన్సర్లు, గుండె జబ్బులొస్తున్నాయి. ఉద్యోగాల గోలలో పడి ఏం తింటున్నారో, ఏం తాగుతున్నారో కూడా స్పృహ లేకుండా రకరకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఏసీ గదుల్లో కూర్చుని పనిచేసేవారంతా విటమిన్ డి లోపంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ విషయంలో మీరు లక్కీ. ఓకే.. షాపింగ్‌లకు వెళుతుంటారా!
 ఎమ్. శ్రీనివాసు: మిగతా ఉద్యోగస్తులెవరికైనా బండి  కావాలంటే.. బ్యాంకులో లోన్ తీసుకుని నిమిషాల్లో బండి కొనుక్కుంటారు. మా సంపాదనలకు రుజువేముంది చెప్పండి.
 తిరుమలాచారి: లోన్లు గట్రా సంగతి పక్కన పెట్టండి. పూర్వం బ్రాహ్మణుడు డాక్టర్ దగ్గరికి వెళితే..‘అయ్యవారి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏమిటి’ అనేవాడు. ఇప్పుడలా కాదు.. మీకేమిటండీ అంటున్నారు.
 
 అలీ: పూజారైనా, పురోహితుడైనా పంచె కట్టుకుంటేనే కదా గుర్తింపు. పెళ్లికి పంచె అడ్డనుకుంటే ఎలా. వాస్తవం మాట్లాడు కోవాలంటే భగవంతుడు నిద్రలేవకముందే మీరు నిద్రలేచి స్వామిని అలంకరించి భక్తులొచ్చే వేళకు సిద్ధంగా ఉంటారు. మీరు చేసేది చాలా పవిత్రమైన పని.  మీలాంటి పురుషుడ్ని పెళ్లి చేసుకోడానికి ఎంతో ఆనందంగా ముందుకు రావాలి. మరి అలాంటిది.. ఎందుకు మీ పట్ల అలా ఫీలవుతున్నారో అర్థం కాని విషయం. ఎమ్. శ్రీనివాసు: అర్థం కాకపోవడానికి ఏముందండీ...చదువులు, లక్షల్లో జీతాలొచ్చే ఉద్యోగాలు. ఉదాహరణకి ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని మా పక్కన నిలబెడితే.. ఓ చదువుకున్న అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది చెప్పండి!
 
 అలీ: అవునూ.. మీ వృత్తిలో కూడా బాగా సంపాదించేవారున్నారు కదా!
 ఫణికుమార్ శర్మ: ఎక్కడో ఒకరిద్దరిని చూపించి అందరూ అలాగే ఉంటారంటే ఎలాగండి?
 అలీ: లేదు.. లేదు అలా అనడం లేదు. ఆస్తులున్న అర్చకులు కూడా ఉన్నారు కదా.
 నెలరాజ శర్మ: ఆస్తులున్న బ్రాహ్మణులున్నారు. పురోహితులు, అర్చకులు కాదు. ఆస్తులు సంపాదించడం ఇప్పుడున్న ఖర్చులతో అయ్యేపని కాదు. మా దృష్టిలో ఆస్తులంటే.. పౌరోహిత్యం, అర్చకత్వం, ఆచారవ్యవహారాలే. సంపాదించే నాలుగు రూకలు ఏ మూలకూ సరిపోవడం లేదు. ఇంటి అద్దె, పిల్లల చదువులు.. అన్నీ కనాకష్టంగా మారాయి. చంద్రశేఖర శర్మ: చాలామందికి తెలియదు.. మన నగరంలో చిక్కడపల్లి, మల్కాజిగిరి వంటి చోట్ల అడ్డా పూజారులు పొద్దున ఆరింటికి వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకూ పని కోసం ఎదురుచూస్తుంటారు. వట్టి చేతులతో ఇంటికెళ్లలేక వంద రూపాయలకు కూడా పూజకు ఒప్పుకుని బండెక్కే సన్నివేశాలను చూశాను.
 ఎమ్. శ్రీనివాసు: ఇక్కడంటే మా పరిస్థితి బాగుంది. బయట చాలామంది పురోహితులు, అర్చకులు చాలారకాలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ సాధారణ పూజారి సంపాదన నెలకు రెండువేలకు మించి ఉండదంటే మీరు నమ్ముతారా!
 
* 12,500 తెలంగాణలో  మొత్తం గుర్తింపు పొందిన దేవాలయాలు
* 3,000 గ్రేటర్ హైదరాబాద్‌లోని  మందిరాలు
*     కేటగిరీలతో సంబంధం లేకుండా అన్ని ఆలయాల్లో పనిచేసేవారికి ఒకేరకమైన వేతన స్కేలును  అమలు చేయాలని 2007లో   దేవాదాయ శాఖ  చట్ట సవరణ చేసింది.ఇందుకోసం అన్ని  ఆలయాల నుంచి  నిధిని సేకరించి, ఆ నిధి నుంచే  జీతాలు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికీ అమలు కాలేదు.
 
 చంద్రశేఖరశర్మ: అంటే అన్నామంటారు.. నగరంలో జరిగే పెద్ద పెద్ద పెళ్లిళ్లకు కార్డులకు పెట్టే ఖర్చులో సగం పురోహితుడికి ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు. ‘పంతులుగారూ.. మీరు మరీ ఎక్కువ ఆశ పడుతున్నారు’ అంటున్నారు. మేం అంతలా ఆశపడిపోవడానికి అవకాశాలే తక్కువ కదండీ. ఈ ఏడాది కార్తీకమాసంలో మూడే మూడు పెళ్లిళ్ల ముహుర్తాలు ఉన్నాయి. ఒక పురోహితుడు ఒక ముహూర్తానికి ఒక పెళ్లే జరిపించగలడు.
 
ఆ నెలలో పురోహితులంతా ఆ మూడు ముహూర్తాలనే నమ్ముకుని బతకాలంటే ఎంత కష్టంగా ఉంటుందో ఒకసారి ఊహించండి. అలీ: నిజమే.. అదొక్కటే కాదు, ఈ మధ్యన ఆన్‌లైన్ పూజలు, స్కైప్ పూజలంటూ ఏవో వినపడుతున్నాయి. వాటి సంగతేంటి?తిరుమలాచారి: మా పొట్టకొట్టడానికి వచ్చినవండీ అవన్నీ. ఏమన్నా అంటే టెక్నాలజీ అంటున్నారు. పూజారి ఎదురుగా కూర్చుని విఘ్నేశ్వరుడికి పూజ చేసి దగ్గరుండి భక్తుడితో పూజ చేయిస్తేనే ఫలితం ఉంటుంది. చంద్రశేఖర శర్మ: అసలే.. భక్తుల పిలుపులు తక్కువగా ఉంటున్నాయని బాధపడుతుంటే మధ్యలో ఆన్‌లైన్ పూజా వ్యాపారుల దోపిడీ ఒకటి.
 అలీ: ఆ పని చేస్తున్నది కూడా మీ వాళ్లే కదా(నవ్వుతూ...)
 ఎమ్. శ్రీనివాసు: అవునండీ(నవ్వుతూ...)
 అలీ: మన హైదరాబాద్‌లో మీరు ఎంతమంది ఉంటారు?
 నెలరాజ శర్మ: ఉంటారండీ.. లక్షకు పైగానే.
 అలీ: నా ఉద్దేశం ఏంటంటే.. పొద్దున లేస్తే ఏదో ఒక వర్గం వారు మాకు ఈ విషయంలో న్యాయం చేయండి, ఆ విషయంలో న్యాయం చేయండీ అంటూ ప్రభుత్వాలతో పోరాడి పనులు చేయించుకుంటున్నారు. ఆ పని మీరెందుకు చేయడం లేదు?
 తిరుమలాచారి: పోరాడ్డాలు, పోట్లాడటాల గురించి మాకు తెలియదండి. మాకు చేతకాదు కూడా.
 అలీ : అలా అంటే ఎలా.. అడిగితే గాని అమ్మ కూడా పెట్టదు. ఇప్పుడు పరిస్థితి చూస్తే పైసా మే పరమాత్మా.
 చంద్రశేఖర శర్మ: ఏమని అడగాలి? ఎవర్ని అడగాలి?
 అలీ : ప్రభుత్వ ఆలయాల్లో ఉద్యోగాలు అడగాలి. పేద పుజారులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిదే కదా!
 చంద్రశేఖర శర్మ: మాకు సరైన సపోర్ట్ లేదండి.
 అలీ : చివరి ప్రశ్న.. పన్నెండేళ్లపాటు వేదాన్ని అవపోశన పట్టిన వారు మీరు. సంస్కృతం నేర్చుకున్నవారు. మా చిన్నప్పుడు స్కూల్లో మాస్టార్లు చెప్పేవారు సంస్కృతం నేర్చుకున్నవాడికి ఇతర భాషలు చాలా సులువుగా వస్తాయని. మీకెప్పుడైనా ఇతర భాషలు నేర్చుకోవాలని అనిపిస్తుందా?
 చంద్రశేఖర శర్మ: ఎందుకుండదండీ! ఇంగ్లిష్ బాగా మాట్లాడాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉంది. ఏం లాభం.. ఓ గంట ఏదైనా క్లాస్‌కి వెళ్లి నేర్చుకుందామంటే తీరికేదీ?
 తిరుమలాచారి: జీవితమంతా ఆ భగవంతుడికే అప్పజెప్పుకున్నట్టు సార్. నిజానికి మా వృత్తి లక్షణం అదే. కానీ, మారుతున్న పరిస్థితులు దానికి అనుకూలంగా ఉండటం లేదు.
 చంద్రశేఖర శర్మ: మా పనివేళలు దాదాపు పదిగంటలండీ. ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండింటి వరకు, సాయంత్రం ఐదింటి నుంచి రాత్రి తొమ్మిదివరకూ. మధ్యలో పూజకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడం.
 ఫణికుమార్ శర్మ: కార్తీక మాసంలో పన్నెండు నుంచి పద్నాలుగు గంటలవరకూ పనిచేయాల్సి వస్తుందండి.
 అలీ :  చివరాఖరి ప్రశ్న.. మీరు సినిమాలకు వెళ్తుంటారా?
 తిరుమాలాచారి: వెళతామండీ. భార్యా పిల్లలకోసం... బలవంతంగా. మార్నింగ్ షోకి వెళ్లాలంటే పొద్దున గుడికి డుమ్మా కొట్టాలి. మ్యాట్నీకి వెళదామంటే.. సాయంత్రం పూజకు డుమ్మా.
 అలీ : గ్రహణం పట్టినపుడు మాత్రమే ప్రశాంతంగా సినిమాకి వెళ్లొచ్చన్నమాట(నవ్వుతూ..). ఓకే... థ్యాంక్యూ!
 రిపోర్టర్ - అలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement