అమ్మ.. ఈ వరుసకు లేదు నిర్వచనం
జన్మజన్మలకూ తీర్చుకోలేని రుణబంధం
మహిళ జీవితం త్యాగాలమయం. పుట్టినప్పటి నుంచి మట్టిలో గిట్టే వరకు ప్రతి అడుగు పురుషుడి ఎదుగుదల కోసమే ఆమె పరితపిస్తుంది. కష్టసుఖాల్లో తోడూ, నీడగా ఉంటుంది. కూతురిగా, చెల్లిగా, భార్యగా, వదినగా, కోడలిగా, తల్లిగా, అమ్మమ్మగా, నానమ్మగా.. ఇలా ఎన్నో రూపాల్లో స్త్రీమూర్తి పురుషుడికి ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదపడుతోంది. పుట్టెడు కష్టాల్లో ఉన్నా వెన్నంటి ఉండిపురుషుడి వెలుగు దివ్వె అవుతోంది.
అలాంటి అపురూపమైన వ్యక్తిత్వం ఉన్న ఆడవారు నేడు ఆపదలో ఉన్నారు. రకరకాల దాడులు, హింసలకు గురవుతున్నారు. అలాంటి మహిళలను రక్షించుకుందాం. అండగా నిలిచి ఆపదలో ఆదుకుందాం. ఆ మాటకొస్తే ఆపదే రాకుండా అడ్డుకుందాం. ఆడవారి రుణం తీర్చుకుందాం. మగవాడి జీవితంలో విడదీయని బంధంగా ఉన్న ఆడ(జన్మ) వారిపై ప్రత్యేక కథనం.
- బెల్లంపల్లి
అలసట తీర్చే చిన్నారి నవ్వులు
ఇంట్లో పసిపాప ఉంటే ఆ కుటుంబం హరివిల్లవుతుంది. దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఇంటికి వచ్చిన ఆ తండ్రికి ఆ చిన్నారి కూతురి పలకరింపు సంతోషానిస్తుంది. అంతకన్నా మించి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అప్పటి వరకు ఉన్న చికాకు తొలగిపోయి స్వాంతన చేకూరుతుంది. బుడిబుడి నడకలతో ఎదురేగి పలకరించే ఆ చిన్నారి ముచ్చట్లు ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది. ఓ కూతురిగా తనకు తెలియకుండానే ఆ చిన్నారి తల్లిదండ్రుల జీవితంలో వెలకట్టలేని సంతోషాన్ని ఇస్తుంది. సంబరాలను నింపుతుంది. ఇలాంటప్పుడే అనిపిస్తుంది కావొచ్చు కంటే కూతుర్నే కనాలని.
ఇంటికి వెలుగు ఇల్లాలు
పురుషుడి జీవితంలో సగభాగంగా మారే మహిళ జీవితం మహోన్నతమైంది. ఏడడుగులు నడిచి, మూడుముళ్లతో ఒక్కటైనా ఆమె బంధం మగాడి జీవితంతో పెనవేసుకుంటుంది. భర్తకు చేదోడు, వాదోడుగా ఉంటూనే సంసార సాగరాన్ని నెట్టుకొస్త్తుంది. అందుకే కాబోలు ఏ సమస్య ఎదురైనా భర్త ముందుగా భార్యతోనే చెప్పుకుంటాడు. ఆమె సహకారాన్ని అర్థిస్తాడు. చికాకులు, చీదరింపులతో ఇంటికి వచ్చే భర్తతో సన్నిహితంగా మెలిగి ఊరట కల్పిస్తుంది భార్య. కుటుంబ గౌరవాన్ని ఇనుమడింపజేసి సమాజంలో భర్త పాత్రకు ఔనత్యాన్ని కల్పిస్తుంది. అన్నింటికీ మించి ఆ ఇంటికి ఇల్లాలు దీపమై వెలుగునిస్తుంది. భర్త, కుటుంబాన్ని సర్వస్వంగా భావించి జీవితాన్ని అంకితం చేస్తుంది. కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా భర్త వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తుంది. భరోసా కల్పించి, బతుకుబాట చూపిస్తుంది. బాధ్యతలను గుర్తు చేసి భర్తను సన్మార్గంలో పెడుతుంది.
అమ్మ.. ఈ వరుసకు లేదు నిర్వచనం
ఆడజన్మ అందించే అన్ని వరుసల్లో అత్యున్నతమైనది అమ్మ. అందరి సేవలకన్నా ఓ మెట్టు పైన నిలిచేది అమ్మ. సృష్టిలో అమ్మను మించిన దైవం మరొకటి లేదు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది. పురుటినొప్పుల బాధ అనుభవించి పురుడుపోస్తుంది. అల్లారుముద్దుగా పెంచి కంటికి రెప్పలాగా కాపాడుతుంది. ఎంత కష్టమొచ్చినా బిడ్డకు గోరుముద్దలు తినిపించి సంబురపడుతుంది. కొడుకుకు ఏ చిన్న కష్టం వచ్చిన తల్లి మనసు తల్లడిల్లుతుంది. కష్టం కడతేరే వరకు పరితపిస్తుంది. బిడ్డ ఎదుగుదలను కోరుకుంటుంది. మంచి నడవడికను నేర్పుతుంది. కొడుకు ఉన్నత స్థితికి ఎన్ని కష్టనష్టాలనైనా అనుభవిస్తుంది. పడరాని పాట్లు పడుతుంది. కాటికెళ్లే వరకు కొడుకు భవిష్యత్‌నే ఆ తల్లి కోరుకుంటుంది.
కోటి ఆశల కోడలు
ఇంటి బరువు బాధ్యతలన్నీ కోడలిపైనే ఉంటాయి. ఆ కుటుంబం వృద్ధి చెందడానికి, సమాజంలో గౌరవ, మర్యాదలు పొందడానికి కోడలు కీలకమవుతుంది. ఇదంతా ఆమె నడవడికపైనే ఆధారపడి ఉంటుంది. అత్త తర్వాత ఇంటి పెత్తనం కోడలిదే అవుతుంది. అందుకే ఇంటికొచ్చే కోడలిపైనే ఆ కుటుంబం కోటి ఆశలు పెంచుకుంటుంది. కోడలిగా అత్తా, మామలకు సపర్యలు చేస్తుంది. వృద్ధాప్యంలో కూతురిలా చూసుకుంటుంది. ముఖ్యంగా భర్త తరఫు బంధువులను, తోబుట్టువులను చూసుకోవడంలో మర్యాదలు చేయడంలో ఇంట్లో కోడలి పాత్ర ముఖ్యమైనది. ఇంటిల్లిపాదికి తలలో నాలుకలా వ్యవహరించి కోడలిగా కుటుంబంలో ఒదిగిపోతుంది. అత్తను మించిన ఆప్యాయతలను పంచి రుణం తీర్చుకుంటుంది.
మార్గదర్శిగా వదిన
అన్న భార్యగా ఇంటికొచ్చిన వదిన మరుదులకు అమ్మ తర్వాత అమ్మవుతుంది. అమ్మ చూపించే ఆప్యాయతలు వదిన అందిస్తుంది. మరుదులను వదిన కన్న కొడుకుకన్నా మిన్నగా చూసుకుంటుంది. కనిపెంచకున్నా వెన్నెలాంటి మనసుతో మమత పంచుతుంది. మరుదులు చిన్నవారయితే చిటికెను వేలు పట్టి మరీ ముందుకు నడిపిస్తుంది. అన్నదమ్ముళ్ల మధ్య వచ్చే పొరపొచ్చాలను దూరం చేసి ఏకం చేయడానికి దోహదపడుతుంది. జీవితంలో స్థిరపడేందుకు సహాయ సహకారాలు అందిస్తుంది. అరమరికలు లేకుండా అన్నదమ్ములు పాలు, నీళ్లలా కలిసిపోయి ఉండాలని విషయాన్ని అంతర్లీనంగా చెప్తూ ఈ విషయంలో వారికి మార్గదర్శి అవుతుంది. బతుకు సమరం సాగించేందుకు దిక్సూచిగా నిలుస్తుంది. వదిన స్థానమూ కుటుంబంలో అత్యంత ప్రధానమే.