
పర్యావరణానికి జై..
- మట్టి వినాయక ప్రతిమలకు పెరిగిన ఆదరణ
- అధికారులు, స్వచ్ఛంద సంస్థల విస్తృత ప్రచారం
- నగరంలో 24 కేంద్రాల ద్వారా మట్టి విగ్రహాల పంపిణీ
- కాజీపేటలో రూపుదిద్దుకున్న పేపర్ వినాయకుడు
- నేడు వాడవాడలా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య
- జిల్లా వ్యాప్తంగా సుమారు పది వేల మండపాల ఏర్పాటు
సాక్షి, హన్మకొండ: నవరాత్రి పూజలు అందుకోవడానికి బొజ్జ గణపయ్య నేడు కొలువుదీరనున్నాడు. కొనుగోలు కేంద్రాల నుంచి విగ్రహాలను భక్తులు మండపాలకు తరలిస్తున్నారు. విగ్రహాలను తరలిస్తున్న వాహనాలతో గురువారం రోడ్లు నిండిపోయాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసిన విగ్రహాల తయారీ వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని జరిగిన ప్రచారం ఈ సారి బాగా ప్రభావం చూపించింది. మట్టితో చేసిన గణపతి విగ్రహాలు కొనుగోలు చేయడాన్ని ప్రజలు తమ బాధ్యతగా గుర్తించారు. దీంతో మట్టి గణపతులు తయారు చేసిన కేంద్రాల వద్ద గతం కంటే ఎక్కువగా సందడి నెలకొంది.
భక్తులకు వీలైనన్ని మట్టి విగ్రహాలు అందించేందుకు అధికారులతో పాటు స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చాయి. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 24 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి రెండు వేల మట్టి విగ్రహాలను భక్తులకు అందిస్తున్నారు. ఇందులో గురువారం నాటికే వెయ్యి విగ్రహాలు భక్తులకు అందించారు. వీటితో పాటు జిల్లా కాలుష్య నియంత్రణ మండలి, కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(కుడా) సంయుక్తంగా ఒక్కొక్కటీ నాలుగున్నర అడుగుల ఎత్తు, డెబ్బై కేజీల బరువు ఉన్న 20 మట్టి విగ్రహాలను తయారు చేశారు.
జిల్లా ఉత్సవ కమిటీ ఎంపిక చేసిన 20 గణేశ్ మండళ్లకు ఈ విగ్రహాలను అందిస్తున్నారు. వీటిని నగరం, జిల్లాలో ముఖ్యమైన కూడళ్లలో ఏర్పాటు చేయనున్నారు. భారీ మట్టి విగ్రహం తయారీ కోసం ఒక్కదానికి రూ.4,200 ఖర్చయింది. వీరితో పాటు జిల్లా నలుమూలలా వివిధ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో వందలాది విగ్రహాలను తయారు చేసి భక్తులకు అందించారు. నగరంలో లేబర్ కాలనీ చేయూత సేవాసంస్థ, పీసీఆర్ ప్రొడక్షన్స్ సంస్థ, యాడ్ స్పేస్ సంస్థలతో పాటు వివిధ పాఠశాలలు మట్టి విగ్రహాలను భక్తులకు పంపిణీ చేశారు. కాగా, హైదరాబాద్‌కు చెందిన సేవ్ సంస్థ నెలన్నర రోజుల పాటు శ్రమించి ఏకశిలపార్కు కేంద్రంగా 360 మట్టి విగ్రహాలను తయారు చేసింది. వీటిని కొనుగోలు చేసేందుకు గురువారం రాత్రి వరకు వాహనాలు బారులుదీరే ఉన్నాయి.
గతానికంటే ఎక్కువ
గణపతి మండళ్లు, ఉత్సవ కమిటీలు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలంటే పోలీసు శాఖ నుంచి తప్పని సరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది వరంగల్ రూరల్ పోలీస్ పరిధిలో 4338 పందిళ్లు ఏర్పాటు కాగా.. ఈ ఏడు ఆ సంఖ్య 5,200కు చేరుకుంది. అదేవిధంగా అర్బన్ పోలీస్ పరిధిలో గతేడాది దాదాపు 4213 మండపాలు ఏర్పాటు కాగా.. ఈ ఏడు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. వీటితో పాటు వీధుల్లో స్థానిక యువకుల ఆధ్వర్యంలో మరికొన్ని మండపాలు వెలుస్తున్నాయి. మొత్తంగా ఈ సారి అధికారిక లెక్కల ప్రకారమే జిల్లా వ్యాప్తంగా సుమాదారు పదివేల మండపాల్లో గణపయ్యలు కొలువుదీరనున్నారు.
ఎన్నికలతో పెరిగిన కల
వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలో ఎన్నికలు జరగనున్న దృష్ట్యా స్థానిక నాయకులు తమ అనుచరవర్గంలో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అందులో భాగంగా గణేశ్ విగ్రహాలను ఇప్పిస్తున్నారు. తమ సొంత ఖర్చుతో విగ్రహాలు కొనుగోలు చేసి అనుచరగణానికి ఉచితంగా పంపిణీ చేశారు. గతంతో పోల్చితే నగరంలో ఈసారి కొత్తగా ఐదు వందల నుంచి వెయ్యి వరకు గణేశ్ మంటపాలు ఏర్పాటు కానున్నాయి. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కొత్తగా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి ఇదే తొలి వినాయక చవితి కావడంతో వారు సైతం మండపాల ఏర్పాటు, విగ్రహాలు స్పాన్సర్ చేయడంలో చొరవ చూపించారు. దానితో ఈ ఏడు జిల్లా వ్యాప్తంగా రెండు వేలకు పైగా కొత్త మండపాలు ఏర్పాటవుతున్నాయి.
జాగ్రత్తలు పాటిస్తే మేలు..
భక్తజనుల ఆధ్వర్యంలో ఏర్పాటైన పదివేలకు పైగా గణేశ్ మండపాల్లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే నవరాత్రుల ఉత్సవాలు కనుల పండువగా జరుగుతాయి. ఇందుకోసం స్థానికంగా ఉన్న పెద్దలు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మండపాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగల పట్ల జాగ్రత్తలు పాటించాలి. మండపాల వద్ద మద్యం సేవించడం, జూదం ఆడటం వంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఇప్పటికే పోలీసుశాఖ హెచ్చరికలు జారీచేసింది. అదేవిధంగా ఉదయం 6గంటల నుంచి రాత్రి 10 గంటల వర కే సౌండ్ సిస్టమ్ వినియోగించాలని భక్తులకు, గణేశ్ ఉత్సవ కమిటీలకు విజ్ఞప్తి చే సింది. మండపాల వద్ద ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లుగా అ నుమానం వస్తే సమీపంలో ఉన్న పోలీసులకు సమచారం అందించడం ఉత్తమం.