కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరగాల్సి ఉండగా నిరవధికంగా వాయిదా వేశారు. కేయూ ఇన్‌చార్‌జ వీసీగా ఉన్న ప్రొఫెసర్ కె.వీరారెడ్డి రాజీనామా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా పడడం ఇది నాలుగో సారి గమనార్హం. ప్రతీసారి తేదీ ప్రకటించడం, ఏదో కారణంతో వాయిదా వేయడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి ఎప్పుడు సమావేశం నిర్వహించే విషయాన్ని కూడా కేయూ ఇన్‌చార్‌జ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు వెల్లడించకపోతుండడం గమనార్హం.
పీహెచ్‌డీ ప్రవేశాలు ఎప్పుడు?
యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలంటే వీరారెడ్డి స్థానంలో మరొకరిని ఇన్‌చార్‌జ వీసీగా నియమించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ స్టాండింగ్ కమిటీలోని ఎజెండాను వీసీ దృష్టికి తీసుకువెళ్లి ఆమోదించాక తేదీ నిర్ణయించాల్సి ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక కేయూ పరిధిలోని పీహెచ్‌డీ ప్రవేశాలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలో ఆమోదించాల్సి ఉంది.
అయితే, తాజాగా కూడా సమావేశం వాయిదా పడడంతో రెండున్నరేళ్లుగా ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ విద్యార్థి సంఘాలు వీసీ చాంబర్‌లో ఆందోళనకు దిగితే బుధవారం నాటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో తేదీ ప్రకటిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇన్‌చార్‌జ వీసీ రాజీనామాతో సమావేశం వాయిదా పడడంతో పీహెచ్‌డీ ప్రవేశాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటివి ఇంకా కొన్ని సమస్యలు కూడా అలాగే మిగిలిపోనున్నాయి.
స్టాండింగ్ కమిటీ సమావేశం నిరవధిక వాయిదా
Published Thu, Oct 23 2014 4:47 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM
Advertisement
Advertisement