
కనీస వసతుల కోసం
జేఎన్‌టీయూలో ఐదు గంటలపాటు బైఠాయించిన అమ్మాయిలు
పుల్కల్ : ‘తోటి విద్యార్థిని కడుపు నొప్పి వచ్చి పడిపోతే కనీసపు మాత్రలు లేవు. స్థానికంగా ఉన్న ఏఎన్‌ఎన్ వద్దకు వెళితే ఆమె ఎలాంటి పరీక్షలూ చేయలేదు. ఇదేం హాస్టల్.. ఇదేం పర్యవేక్షణ..’ అంటూ అమ్మాయిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులను నిలదీశారు. సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూలో కనీస వసతులు కల్పించాలంటూ శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఆందోళన వెనక ఆవేదన ఇది... గురువారం రాత్రి జేఎన్‌టీయూ బాలికల హాస్టల్‌లో ఉండే సీఎస్‌సీ ఫైనలియర్ విద్యార్ధిని జయ తీవ్రమైన కడుపునొప్పితో కిందపడింది. వెంటనే స్పందించిన తోటి విద్యార్థినులు ఆమెను స్థానికంగా ఉన్న ఏఎన్‌ఎన్‌కు తీసుకెళ్లారు. కానీ అక్కడున్నామె ఎలాంటి పరీక్షలూ చేయలేదు. కనీసం మాత్రలు కూడా అక్కడ అందుబాటులో లేవు. దీంతో జయ పరిస్థితి విషమంగా మారింది.
దీనిపై విద్యార్థినులు ఫైర్ అయ్యారు. వందల మంది ఉండే హాస్టల్ క్యాంపస్‌లో ప్రథమ చికిత్సకు సంబంధించిన పరికరాలు, మందులు, సిబ్బంది లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీపం బీపీ మిషన్ కూడా ఉంచకపోవడంపై ప్రిన్సిపాల్ మంజూర్ హుస్సేన్‌ను నిలదీశారు. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన నల్లాలు పనే చేయడం లేదని, ఫ్లోర్‌కు ఒక ట్యాప్ మాత్రమే పనిచేస్తుందన్నారు. దీంతో అవసరాలెలా తీర్చుకోవాలని ప్రశ్నించారు. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదంటూ ఐదు గంటలపాటు క్యాంపస్‌లో బైఠాయించారు. సమస్యలు పరిష్కరించే వరకూ కదిలేది లేదని పట్టుబట్టారు. వారం రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తానని ప్రిన్సిపాల్ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.