దసరాకు కొత్త కార్డులు
తెలంగాణ ప్రభుత్వం పేరిట కొత్త రేషన్‌కార్డులు
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హుల గుర్తింపు
వివరాలు అందించాలని పౌరసరఫరాల శాఖకు ఆదేశం
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు శుభవార్త..! దసరా పండుగ తర్వాత అర్హులందరికీ కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పేరుతో ఉన్న ఈ కార్డులను పునఃపంపిణీ చేయాలని భావించింది. కొత్తగా తెలంగాణ ప్రభుత్వ పేరిట వీటిని అందజేయాలని సంకల్పించింది. అలాగే అర్హులైన వారికి కొత్తకార్డులు, అనర్హుల కార్డులను తొలగించేందుకు సర్వం సిద్ధంచేసింది. ఇందుకు సంబంధించి రేషన్‌కార్డుల వివరాలు, ఇంకా కార్డులేని అర్హత కలిగిన వారి వివరాలను అందజేయాలని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం ప్రాథమిక అంచనాతో జాబితాను తయారుచేసేందుకు సిద్ధమవుతోంది.. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 8,69,451 కుటుంబాలు ఉన్నాయి. అయితే అన్ని రకాల రేషన్‌కార్డులు కలిపి 10,38,124 వరకు ఉన్నాయి. అలాగే కార్డులు లేకుండా అర్హులుగా భావించిన 79వేల కుటుంబాలకు కూపన్ల ద్వారా సరుకులు పంపిణీచేస్తున్నారు.
దీంతో రేషన్‌కార్డుల సంఖ్య 11లక్షలపైగా చేరింది. దీంతో కుటుంబాల కంటే రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయని భావించిన సర్కారు అనర్హులను తొలగించేందుకు రంగం సిద్ధంచేసింది. అన్ని కార్డులకూ ‘ఆధార్’ అనుసంధానం తప్పనిసరి చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో 10,38,124 రేషన్‌కార్డులకు కేవలం 7,62,607 కార్డులను మాత్రమే ఆధార్‌తో అనుసంధానం చేయగలిగారు. ఈ సందర్భంగా దాదాపు 57,659 కార్డులను బోగస్‌గా తేల్చారు. ఆధార్ అనుసంధానం చేయని వాటికి ప్రభుత్వ ఆదేశాల మేరకు సరుకులు నిలిపేశారు.
కార్డుల్లో కోత..!
అర్హులైన వారికి కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ అందుకు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. గతంలో మాదిరిగా ప్రజాప్రతినిధుల ఒత్తిడి, అనుకూల తదితర పక్షపాతవైఖరి కాకుండా ప్రస్తుతం నూతన విధానాన్ని అవలంభించనుంది. ప్రభుత్వం ఇటీవల చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. సర్వే వివరాల ప్రకారం జిల్లాలో 9,85,557 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం జనాభా 42,14,865వరకు ఉంది. అంతేకాదు సర్వే ప్రక్రియలో కుటుంబ సభ్యుల జీవన విధానం, ఆర్థికస్థితిగతులకు సంబంధించి అంచనాలు చేసేలా పూర్తిస్థాయి వివరాలు సేకరించారు. దీని ఆధారంగా కొత్త కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సమాచార సేకరణకు పౌరసరఫరాల శాఖ చర్యలు మొదలుపెట్టింది. జిల్లాలో తాజా సర్వే ప్రకారం కూడా కేవలం 9,85,557 కుటుంబాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడయిన నేపథ్యంలో.. ప్రస్తుతం ఉన్న 11లక్షల కార్డులను కుదింపు జరిగే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న10,38,124 రేషన్‌కార్డులకు 18,500వేల మెట్రిక్‌టన్నుల బియ్యం కోటా పంపిణీ చేస్తున్నారు. ఒకవేళ కార్డుల్లో కోత విధిస్తే బియ్యం కోటా తగ్గే అవకాశం ఉంది.