ఏకైక లక్ష్యం.. సేఫ్ సిటీ :నాయిని నర్సింహారెడ్డి
- అందరి భద్రత.. మా బాధ్యతే
- త్వరలో మరిన్ని కొత్త పోలీస్ స్టేషన్లు
- పదివేల సీసీ కెమెరాలు ఏర్పాటు
- సాక్షి ఇంటర్వ్యూలో హోంమంత్రి నాయిని వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: ‘హైదరాబాద్ మహానగరాన్ని సేఫ్ సిటీగా మార్చటమే మా ఏకైక లక్ష్యం. నగరంలో స్థిరపడ్డ వారందరికీ భద్రత కల్పించటం మా కర్తవ్యం. ఆ దిశగా అవసరమైన మేర పోలీస్ వ్యవస్థను పటిష్టపర్చటం, పోలీస్ కానిస్టేబుల్ మొదలుకుని కమిషనర్ వరకు జవాబుదారీతనంతో వ్యవహరించే దిశగా మా ప్రభుత్వం పనిచేస్తుంది’ అని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన సాక్షి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక అంశాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ప్రజాభద్రతే మా ధ్యేయం
నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఈ మహానగరంలో జీవిస్తున్నారు. అందరికీ భద్రత కల్పిస్తూ నేర నివారణ, నేర పరిశోధనకు ప్రాధాన్యతనిస్తాం. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారి విషయంలో పోలీసులు ప్రవర్తించే తీరులో మార్పు తీసుకువస్తాం. పోలీస్‌స్టేషన్‌లు బలహీనులకు ఓ అండనివ్వాలి. అందుకే కొత్త పోలీస్‌స్టేషన్ల ఏర్పాటు, సిబ్బంది నియామకాలను చేపడతాం. మారుతున్న నేరాలకు అనుగుణంగా పోలీస్ యంత్రాంగానికి అవసరమైన శిక్షణ ఇస్తాం.
లండన్ తరహాలో మెగాసిటీ పోలీస్ పథకం కింద హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో సుమారు పదివేల సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాల ఏర్పాటుతో లండన్‌లో నేరాల శాతం గణనీయంగా తగ్గిపోయింది. పోలీస్‌స్టేషన్ల నిర్వహణ వ్యయం పెంచటంతో పాటు అవసరమైన వాహనాలు సమకూర్చాలని నిర్ణయించాం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను మరింత ఊపుతో ముందుకు తీసుకువెళ్లే దిశగా పోలీస్ యంత్రాంగం తప్పక కృషి చేస్తుంది.
సర్వమత సమ్మేళనంగా సిటీని తీర్చిదిద్దుతాం
హైదరాబాద్ సర్వమత సమ్మేళనం. అన్ని మతాలు మాకు సమానమే. ముఖ్యంగా హిందూ ముస్లింలు గతంలో మాదిరిగా అన్ని పండుగలు కలిసి చేసుకునే సంస్కృతి (గంగాజమున తైజీబ్)ని ముందుకు తెస్తాం. పండుగలు, సామాజిక ఉత్సవాలకు ప్రభుత్వమే అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. తెలంగాణ ఏర్పాటైన అనంతరం పలువురు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి 2001 నుంచి టీఆర్‌ఎస్ ఉద్యమం చేసినా నగరంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదు. ఎవరి వ్యాపారాలనూ అడ్డుకోలేదు. ఉద్యమ హోరులోనూ హైదరాబాద్ ముందుకు వెళ్లగలిగింది. మున్ముందూ ఇదే పంథా కొనసాగుతుంది. విద్య, ఉపాధి, వ్యాపారాల కోసం వచ్చేవారికి మా ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరుస్తుంది.
నగారాభివృద్ధికి నిపుణుల కమిటీ ఏర్పాటు
నగరంలో ఇప్పటికే వివిధ స్వచ్చంద సంస్థలు పలు అంశాలపై పనిచేస్తున్నాయి. అయితే ఆయా రంగాల్లో హైదరాబాద్‌ను మరింత ముందుకు వెళ్లే దిశగా తరచూ ఆయా రంగాల ఎక్స్‌పర్ట్స్‌తో సమావేశ మవ్వాలని భావిస్తున్నాం. ఇందు కోసం ఓ కమిటీ ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో మేధావుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని భావిస్తున్నాం.