
సినిమాకు వెళ్లొచ్చేసరికి ఇల్లు గుల్ల
3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండి వస్తువుల అపహరణ
క్లూస్ టీంతో ఆధారాలు సేకరించిన క్రైం డీఎస్పీ
ఖిలావరంగల్ : తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన సంఘటన నగరంలోని శివనగర్ ప్రాంతంలోని సాయిగణేష్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి జరి గింది. ఇంట్లోని బీరువా తాళం తీసి 3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండితోపాటు ఒక సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. మిల్స్‌కాలనీ ఎస్సై వెంకటరావు కథన ప్రకారం.. సాయిగణేష్‌నగర్‌కు చెందిన బొజ్జ రంజిత, రాజ్‌కుమార్ దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి శనివారం రాత్రి 9.30 గంటలకు సినిమాకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన దొంగలు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరపడ్డారు. బీరువాపైన ఉన్న తాళం చెవితో తాళాన్ని తీసి సుమారు 90 వేల విలువైన 3.5 తులాల బంగారం, 860 గ్రాముల వెండితోపాటు సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. వారు సినిమా చూసి ఇంటికొచ్చేసరికి ఇంట్లో లైట్లు వేసి.. ఇంటి ముందు గడియ విరిగి కనిపించింది.
డోర్‌ను నెట్టగా రాకపోవడంతో దొంగలు.. దొంగలు అని అరవడంతో దుండగులు ఇంటి వెనక ప్రహరి దూకి పారిపోయారు. బాధితులు ఇంట్లోకి వెళ్లి చూడగా రెండు బెడ్‌రూముల్లో దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో వారు వెంటనే 100కు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే మిల్స్‌కాలనీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆదివారం ఉదయం సీసీఎస్ డీఎస్పీ రాజమహేంద్రనాయక్, మిల్స్‌కాలనీ ఎస్సై బి.వెంకట్రావు, క్లూస్ టీంతో చేరుకుని క్షుణంగా పరిశీలించారు. ఇంటి యజమాని బొజ్జ రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.