
స్టెతస్కోప్ వదిలేసి చోరీల బాట
దొంగగా అవతారమెత్తిన ఆర్‌ఎంపీ
అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు
రూ.9 లక్షల సొత్తు స్వాధీనం
పరారీలో మరో నిందితుడు
వరంగల్ క్రైం : వైద్యంపై వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో ఓ ఆర్‌ఎంపీ దొంగగా అవతారమెత్తాడు. అప్పటికే ఇళ్లకు కన్నాలేసే విద్యలో ఆరితేరిన తన అన్నతమ్ముడిలాగే తాను చోరీల బాటపట్టాడు. చివరికి వరంగల్ సీసీఎస్ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. అతడి నుంచి పోలీసులు రూ.9 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా కథనం ప్రకారం. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం రామారం గ్రామాని కి చెందిన రాంటెంకి రాజ్‌కుమార్ అలియాస్ రాజు ఆర్‌ఎంపీగా పనిచేస్తుండేవాడు. అతడి అన్న శ్రీనివాస్, తమ్ముడు సారయ్య ఇళ్లలో చోరీలకు పాల్పడుతూ జల్సాలు చేసేవారు. గతంలో ఆదిలాబాద్, కరీంనగర్‌లో దొంగతనాలకు పాల్పడి పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లిన వారిద్దరు మేలో బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆర్‌ఎంపీగా పనిచేయడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో రాజ్‌కుమార్ కూడా దొంగతనాలకు పాల్పడాలనే ఆలోచనకు వచ్చాడు. అనంతరం అతడు తన తమ్ముడు సారయ్యతో కలిసి చోరీలకు పాల్పడ్డాడు. ఇద్దరు కలిసి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో దొంగతనాలు చేశారు. వీరు తాళం వేసిన ఎనిమిది ఇళ్లలో చోరీలకు పాల్పడ డమేగాక.. పది మంది మహిళల మెడలో చైన్‌స్నాచింగ్‌కు పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు.
సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సహకార నగర్, ఎక్సైజ్‌కాలనీ, మిల్స్‌కాలనీ పరిధిలోని శివనగర్ , మామునూరు పరిధిలోని గణేష్‌నగర్, కాజీపేటలోని ఇళ్లలో దొంగతనాలకు పాల్పడ్డారు. సుబేదారి పోలీ స్‌స్టేషన్ పరిధిలోని విజయ్‌పాల్‌కాలనీ, రాంనగర్, అశోకకాలనీ, మట్టెవాడ పరిధిలోని మర్రి వెంకటయ్య కాలనీ, బ్యాంకు కాలనీ, ఇంతెజార్‌గంజ్ పరిధిలోని గిర్మాజీపేట, కాజీపేట రైల్వేక్వార్టర్స్ ప్రాంతాల్లో ఒంటరిగా వెళుతున్న మహిళల మెడలోని బంగారు గొలుసులు లాక్కెళ్లారు. రాజ్‌కుమార్ తాను చోరీ చేసిన సొత్తును బుధవారం వరంగల్ బులియన్ మార్కెట్‌లో అమ్ముకునేందుకు రాగా సమాచారం అందుకున్న సీసీఎస్ సీఐ ఆదినారాయణ తన సిబ్బందితో వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద రూ.9 లక్షల విలువైన 442 గ్రాముల బంగా రం, వంద గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడైన రాజ్‌కుమార్ తమ్ముడు సారయ్య పరారీలో ఉన్నాడు.