పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం | The statue brings in the four days | Sakshi
Sakshi News home page

పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం

Published Fri, Apr 17 2015 2:19 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM

The statue brings in the four days

- నాలుగు రోజుల్లో విగ్రహం తెప్పిస్తాం
- అనుమతి రాగానే ప్రతిష్ఠాపన
- సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేస్తా
- నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా

నిజామాబాద్‌కల్చరల్: నగరంలోని రైల్వే స్టేషన్ కూడలి వద్ద మహాత్మా జ్యోతి బాపూలే జయంతి సందర్భంగా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడం తనను చాలా బాధకు గురి చేసిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అన్నారు. ఏడడుగుల ఎత్తు గల  పూలే విగ్రహాన్ని తొలగించి పోలీసుస్టేషన్‌లో టాయిలెట్ పక్కన పడేయడంతో పలు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. విగ్రహం తొలగింపుపై ప్రతిపక్షాలు సైతం తీవ్రస్థాయిలో స్పందించారుు.

దీంతో విగ్రహాన్ని పున ప్రతిష్ఠించేందుకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ముందుకొచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన బీసీ సంఘాల నాయకులతో కలసి విగ్రహాన్ని ప్రతిష్ఠించే రైల్వే స్టేషన్ కూడలిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలే విగ్రహం ప్రతిష్ఠించిన విషయం కానీ, తొలగించిన విషయం కానీ తనకు తెలియదన్నారు. మున్సిపల్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తొలగించారని, ఇందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

విగ్రహ తొలగింపులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు. కొందరు పనిగట్టుకొని రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు. ఏదేమైనా విగ్రహ తొలగింపు దురదృష్టకరమని, నాలుగు రోజుల్లో తన సొంత డబ్బులతో జ్యోతిభాపూలే విగ్రహాన్ని తెప్పిస్తానని హామీ ఇచ్చారు. దాన్ని భద్రంగా ఉంచి రైల్వే స్టేషన్ కూడలి వద్ద లేదా అంతకంటే మంచి కూడలి వద్దనైనా ప్రతిష్ఠించేందుకు కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో చర్చించానన్నారు. ఒకటిరెండు రోజుల్లో మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సింగిల్ ఎజెండాతో తీర్మానం చేసి ఆ లేఖను ప్రభుత్వానికి పంపుతామన్నారు. వీలైనంత త్వరగా విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొస్తానని చెప్పారు.

అంతేకాక ప్రభుత్వ భవనానికి, పార్కుకు జ్యోతిబాపూలే పేరు పెడతామని ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు లక్ష్మీనారాయణ, రజక సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ డి. నారాయణరావు(నాని), బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్, ఆంజనేయులు, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, నగర మేయర్ ఆకుల సుజాతశ్రీశైలం, ఆదె ప్రవీణ్‌కుమార్, మట్టెల శేఖర్, బి.విజయలక్ష్మి, సామల చిలకల్‌రాజ్, ఎం.ఎస్.అంబదాస్‌రావు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement