
పాఠశాలలో మూడు కంప్యూటర్లు చోరీ
కాజీపేట : కాజీపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల(డంకెన్‌బాబా)లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి మూడు కంప్యూటర్లను అపహరించినట్లు సీఐ రమేష్‌కుమార్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం పాఠశాలకు తాళం వేసి సిబ్బందితో కలిసి ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిపోయారు. అర్ధరాత్రి సమయంలో సరస్వతిమాత విగ్రహం పక్కనున్న ఇనుప గ్రిల్ గేట్ తాళంను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు.ప్రత్యేక గదిలో పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన మూడు కంప్యూటర్లను చోరీ చేశారు.
శుక్రవారం ఉదయం పాఠశాలకు వచ్చిన సిబ్బంది తాళం పగులగొట్టి ఉండటంతో ఆందోళనకు గురై వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌లో ప్రధానోపాధ్యాయురాలు కె.పుష్పాంజలి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. క్లూస్‌టీం సీఐ రఘు, ఎస్సైలు భీమేష్, నాగరాజు సిబ్బందితో కలిసి ఘటన స్థలాన్ని సందర్శించి ఆధారాలు సేకరించారు. అనుమానితులను గుర్తించడానికి సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కంప్యూటర్ల విలువ లక్షకుపైగా ఉంటుందని నిందితుల సమాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.