వైద్య శాఖకు చికిత్స | The treatment of the medical department | Sakshi
Sakshi News home page

వైద్య శాఖకు చికిత్స

Published Tue, Jun 17 2014 3:28 AM | Last Updated on Wed, Aug 15 2018 7:59 PM

వైద్య శాఖకు చికిత్స - Sakshi

వైద్య శాఖకు చికిత్స

  •      అధికారుల పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం
  •      చిన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాలన్న డాక్టర్ రాజయ్య
  •      నాలుగోవ తరగతి ఉద్యోగుల్లో మార్పు రావాలని సూచన
  • కలెక్టరేట్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తొలిసారి జిల్లాకు వచ్చిన సందర్భంగా సోమవారం వైద్యారోగ్యశాఖ అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష జరిపారు. ఉత్తర తెలంగాణకే పెద్దదిక్కుగా ఉన్న మహాత్మాగాంధీ స్మారక(ఎంజీఎం) ఆస్పత్రి, కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ) అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన సమస్యలపై చర్చించారు.

    జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పనితీరు మెరుగు పడాలని అధికారులకు స్పష్టం చేశారు. వైద్య విద్యార్థులు ఉండే కేఎంసీ హాస్టళ్లు.. సాంఘిక సంక్షేమ హాస్టళ ్లకన్నా దారుణంగా ఉన్నాయన్నారు. పాముల పుట్టలు పెరిగినా, చెత్తకుప్పలు పేరుకుపోయినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్థానికంగా ఆస్పత్రి అభివృద్ధి మండలి(హెచ్‌డీఎస్), జిల్లా కలెక్టర్, ప్రిన్సిపాల్, సూపరింటెండెంట్ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలు సరిగ్గా 15 రోజుల్లో పూర్తికావాలని ఆదేశించారు.

    ఎంజీఎం, కేఎంసీలో అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేకనే సమస్యలు పేరుకుపోతున్నాయన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరు పూర్తిగా అధ్వానంగా ఉందని, ఈ విషయంలో పూర్తి బాధ్యత ఉన్నతాధికారులదేనని అన్నారు. కింది స్థాయి సిబ్బందితో పనిచేయించుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారని అన్నారు. చెత్త పేరుకుపోయి, లైట్లు లేక, పారిశుద్ధ్యం సక్రమంగా లేక పరిస్థితి అధ్వానంగా తయారైందన్నారు. ఈ సందర్భంగా ఎంజీఎం, కేఎంసీలో గమనించిన సమస్యలకు మంత్రి పరిష్కారాలు సూచించారు.
     
    ఎంపీ లాడ్స్ కేటాయిస్తాం : వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి
     
    ఎంజీఎంలో ఉన్న సమస్యల్లో ఎక్కువగా కొద్దిపాటి నిధులతో పరిష్కారమయ్యేవే ఉన్నాయి. జనరేటర్, వెంటిలేటర్స్, శానిటేషన్, తాగునీటి వసతి వం టివి... నిర్లక్ష్యం వల్ల పెరిగిన సమస్యలు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఒక్కోసారి బాధితులను పరామర్శించేందుకు వద్దామన్నా రోగుల బంధువులు ఆందోళన చేస్తారేమో అనే భయం వేస్తోంది. అధికారులు, కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ  మంత్రి నుంచి ప్రతిపాదనలు వస్తే ఎంపీ నిధులు కేటారుుంచేందుకు సిద్ధం. ఇవన్నీ కావాలంటే అధికారుల్లో కూడా మార్పురావాలి. ప్రతి ఆరునెల్లకోసారైనా ఎంజీఎంపై సమీక్ష నిర్వహించాలి. పనిచేయకుండా నిర్లక్ష్యంగా ఉండేవారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
     
    హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి : మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్
     
    ఎంజీఎం, కేఎంసీలలో విశాలమైన స్థలం ఉంది. అక్కడంతా అడవిలా మారకుండా పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వండి. ఔట్ సోర్సింగ్ వారికి ఇచ్చి గార్డెనింగ్ చేయించండి. నెలకు కేవలం రూ.2లక్షలతో పచ్చదనం అభివృద్ధి చేసుకోవచ్చు.   ఆసుపత్రికి వచ్చిన వారికి ఏ వార్డు ఎక్కడుందో... రక్తం ఉక్కడ దొరుకుతుందో... తెలియదు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల వారు వస్తారు. పీఆర్వోలను తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నందున కనీసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తే కొంత సౌకర్యంగా ఉంటుంది.
     
    గతంలో చెప్పిన వెంటిలేటర్లు ఏమయ్యాయి : ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్
     
    గత సమావేశాల్లో డీఎంఈ మాట్లాడుతూ 24గంటల్లో వెటిలేటర్లు వస్తాయని చెప్పారు. వాటి సంగతి ఏమైంది. వచ్చాయా... రాలేదా... ఎంజీఎంలో కాంట్రాక్ట్ సిబ్బందికి సక్రమంగా వేతనాలు అందడం లేదు. పీఎఫ్ వంటివి అందడం లేదు. సెక్యురిటీ పనితీరుపై ఆరోపణలు ఉన్నాయి. వాటిని అధికారులు సమీక్షించాలి. గతంలో ఎంజీఎం పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమస్యలు గుర్తించి ప్రభుత్వానికి చెప్పినా పనులు కాలేదు. తొలగించిన కాంట్రాక్టు సిబ్బందిని కూడా తీసుకోవాలి.  
     
    పీఆర్వోలను తొలగించవద్దు : ఎమ్మెల్యే కొండా సురేఖ
     
    ఎంజీఎంలో గత నాలుగేళ్లుగా పనిచేసస్తున్న పీఆర్వోలను తొలగించడం వల్ల వారు ఉపాధి కోల్పోతారు. వారికి ప్రత్యామ్నాయం చూపిస్తే మంచిది. స్థానిక సమస్యలపై స్థానికంగా అధికారులు దృష్టిపెట్టాలి. క్రమంతప్పకుండా జిల్లా స్థాయిలో సమీక్షలు ఏర్పాటు చేయాలి.
     
    కలెక్టర్ దృష్టిపెట్టాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
     
    చిన్న సమస్యలు కూడా అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం వల్ల పెద్దగా తయారవుతున్నాయి. జనగామ ఏరియా ఆస్పత్రిలో కూడా పరిస్థితి ఇలాగే ఉండేది. నేను ప్రత్యేక చొరవతో ఆస్పత్రి సందర్శించడంతో క్రమంగా అధికారుల్లో కూడా మార్పువచ్చింది. ఇప్పుడు మా ఏరియా ఆస్పత్రిలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. కలెక్టర్ కూడా ఈ విషయంలో శ్రద్ధ వహించి పర్యవేక్షణ పెంచితే అధికారుల్లో కొంత మార్పు వస్తుంది. ప్రతి పనీ నిధులతో ముడిపెట్టడం సరికాదు.
     
    వర్ధన్నపేట ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి : ఎమ్మెల్యే అరూరి రమేష్
     
    వర్ధన్నపేట క్లస్టర్ ఆస్పత్రిలో సదుపాయాలు మెరుగుపరిస్తే వర్ధన్నపేట, పాలకుర్తి నియోజకవర్గాల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది. సిబ్బంది కొరత మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. గతంలో ఉన్న వైద్యుడు బదిలీ అయ్యాక సమస్యలు మరింత ఎక్కువయ్యాయి.
     
    మహబూబాబాద్ ఆస్పత్రిలో సిబ్బందిని నియమించాలి : ఎమ్మెల్యే శంకర్‌నాయక్
    మహబూబాబాద్‌లోని ఏరియా ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి. సిబ్బంది నియామకాలు చేపట్టాలి. వైద్యులు, సిబ్బంది మెరుగైన సేవలందించేలా చర్యలు తీసుకోవాలి.
     
    అధికారులు ఏమన్నారంటే...

    కేఎంసీకి సీనియర్ రెసిడెంట్‌ని నియమించాలి. లైబ్రరీ బిల్డింగ్, పరీక్ష హాలు, హాస్టల్ భవనాలు ఏర్పాటు చేయాలి. సుమారు 120ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కళాశాలలకు అదనంగా దంత వైద్య కళాశాలను మంజూరు చేయాల్సి ఉంది. హెల్త్ వర్సిటీకి కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయి. సెంట్రజైలును అక్కడి నుంచి తరలిస్తే మరో 80ఎకరాలు స్థలం సమకూరుతుంది. ఎంసీఐ నిబంధనలకు అనుగుణంగా సదుపాయాలు కల్పించే అవకాశం ఉంటుంది.

    ఎంజీఎంకు ప్రస్తుతం ఓపీ అత్యవసర విభాగంలో 20పడకలకు మాత్రమే అవకాశం ఉంది. మెడిసిన్ విద్యార్థుల సంఖ్య ప్రకారం మరో 10పడకలు ఏర్పాటు చేస్తే సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న తహసీల్దార్ కార్యాలయం ఖాళీచేసి అక్కడ నూతన భవనం నిర్మిస్తే సమస్యలు తీరుతాయి. ఆసుపత్రిలో టెలిఫోన్ ఇంటర్‌కం సేవలు అందుబాటులోకి తేవాలి. 17ఫ్రొఫెసర్, 4 అసోసియేట్ ప్రొఫెసర్, 30 అసిస్టెంట్ ఫ్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనివల్ల ఎంసీఐ అభ్యంతరం తెలిపింది. సిబ్బంది నియామకాలు చేపట్టాలి. వెంటిలేటర్లు కొనుగోలు చేయాల్సి ఉంది. సీకేఎం ఆసుపత్రిని 1993లో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు.

    సౌకర్యాలు, సిబ్బంది మాత్రం 60పడకలకు మాత్రమే ఉన్నారు. ఆసుపత్రి రోగుల రద్దీ దృష్ట్యా 200 పడకలు చేయాల్సి ఉంది. ప్రసుత్తం 4 ఎకరాల ఖాళీ స్థలం ఆసుపత్రికి అందుబాటులో ఉంది. జిల్లాలో అతిపెద్ద ప్రసూతి ఆసుపత్రిగా ఉంది. పెథాలజీ, రేడియాలజీ, బయాలజీ, మైక్రో బయాలజీ యూనిట్లు ఏర్పాటు చేయాలి. ఎంజీఎంకు రోగులను తరలించేందుకు అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. ఉర్సు ఆసుపత్రికి ఓపీ సౌకర్యం అంబులెన్స్ ఏర్పాటు చేయాలి.
     
    కేఎంసీలో మంత్రి గమనించిన అంశాలు ఇవీ...
    హాస్టల్ గదులు, పరిసరాలు భయానకంగా ఉన్నాయి. పాముల పుట్టలు పెరిగాయి.
         
     నాలుగో తరగతి ఉద్యోగుల పనితీరు సక్రమంగా లేదు వారితో పనిచేయించడంలో అధికారులు విఫలమయ్యారు.
         
     విద్యుత్ సమస్య ఉంది. లోవోల్టేజీ, లైట్లు లేకపోవడం, వైరింగ్ సక్రమంగా లేదు.
         
     తాగునీటి సౌకర్యం లేదు.
         
     ఎక్కడికక్కడ చెత్త, పాత సామాన్లు ఉన్నాయి.
         
     ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త విద్యార్థులు.. ఈ క్యాంపస్ చూస్తే కేఎంసీలో ప్రవేశాలు రద్దు చేసుకుంటారు.
     
     ఎంజీఎంలో గుర్తించిన సమస్యలు...
     శానిటేషన్ సమస్య తీవ్రంగా ఉంది.
         
     సెక్యూరిటీ వ్యవస్థ సక్రమంగా లేదు.
         
     నాలుగో తరగతి సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదు.
         
     జనరేటర్ అందుబాటులోలేదు.
         
     ఎంజీఎంలో పైఅంతస్తుల్లోకి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం లేదు.
         
     పీఆర్వోలను తొలగించడం వల్ల వారు ఉపాధి కోల్పోతున్నారు.
         
     సెక్యూరిటీ, ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు పీఎఫ్, కనీస వేతనాలు అందడం లేదు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement