పోలీసు కాల్పుల్లో గిరిజనుడి మృతి
చర్ల: చర్ల మండలం దోశిళ్లపల్లికి చెందిన ఇద్దరు యువకులపై పోలీసులు శనివారం రాత్రి కాల్పులు జరిపిన ఘటనలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుంజా నర్సింహరావు అనే గిరిజనుడు ఆదివారం రాత్రి మృతిచెందాడు.
వివరాలిలా ఉన్నాయి..
దోశిళ్లపల్లికి చెందిన యువకులు కుంజా నర్సింహారావు, కనితి సత్తిబాబు శనివారం రాత్రి పది గంటల సమయంలో దోశిళ్లపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై చర్లకు బయల్దేరారు. దోశిళ్లపల్లి శివారులో వీరి వాహనాన్ని అటుగా నడుచుకుంటూ వెళుతున్న పోలీసులు గమనించి ఆగాలని హెచ్చరించారు. అది గమనించని యువకులు ద్విచక్ర వాహనాన్ని ఆపకుండా వెళ్లడంతో పోలీసులు అనుమానించి, వారిపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో వాహనాన్ని నడుపుతున్ననర్సింహారావు పొట్టలోకి రెండు బుల్లెట్లు దిగారుు. వెనుక కూర్చున్న కనితి సత్తిబాబు సురక్షితంగా బయటపడ్డాడు. బుల్లెట్ల గాయాలతో కుప్పకూలిన నర్సింహారావును పోలీసులు అర్ధరాత్రి వేళ హుటాహుటిన భద్రాచలంలోని ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే అతడి పరిస్థితి విషమించడంతో ఆదివారం హైదరాబాదులోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. కాగా, సురక్షితంగా బయటపడిన కనితి సత్తిబాబు ప్రస్తుతం ఎక్కడున్నదీ తెలియడం లేదు.
పోలీసులేమంటున్నారంటే...
కాల్పుల ఘటనపై వెంకటాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అల్లం నరేందర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. సరిహద్దు ప్రాంతంలో ఇటీవల మావోయిస్టుల కార్యాకలాపాలు ఉధృతమయ్యూయని, పెదమిడిసిలేరు-తిప్పాపురం రోడ్డు నిర్మాణానికి మావోయిస్టులు అడ్డంకులు కల్పించకుండా చూసేందుకుగాను ఆ ప్రాంతానికి పోలీసు బలగాలు వెళ్లాయని చెప్పారు. అక్కడ కూంబింగ్ చేస్తున్న పోలీసు బలగాలపై దోశిళ్లపల్లి శివారులో మావోయిస్టులు కాల్పులు జరిపారని, పోలీసులు తేరుకుని ఎదురుకాల్పులు జరపడంతో మావోయిస్టులు పారిపోయారని తెలిపారు. తర్వాత ఆ ప్రాంతాన్ని పరిశీలించగా.. రక్తపు మడుగులో ఓ వ్యక్తి కనిపించాడని, అతడిని ఆసుపత్రికి తరలించామని వివరించారు.
రెండేళ్లలో మూడోసారి..
ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలపై పోలీసుల కాల్పులు జరపడం ఇది మూడోసారి. ప్రతిసారీ పోలీసులు కాకమ్మ కబుర్లతో తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని ఆదివాసీలు, గిరిజన సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నారుు. రెండేళ్ల క్రితం వెంకటాపురం మండలం బోదాపురంలో గిరిజన సాంప్రదాయ వేటకు వెళ్తున్న మడకం బాబూరావుపై పోలీసులు కాల్పులు జరిపారు. గత నెల 7న చర్ల మండలం దోశిళ్లపల్లికి చెందిన కుంజా రమేష్ రాత్రి పూట ద్విచక్ర వాహనంపై వెళుతుండగా పోలీసులు కాల్పులు జరిపారు. దోశిళ్లపల్లికి చెందిన కుంజా నర్సింహారావు, కనితి సత్తిబాబుపై శనివారం రాత్రి కాల్పులు జరిపారు.