పన్ను కడతారా.. జప్తు చేయాలా? | The tyranny in the name of tax collection | Sakshi
Sakshi News home page

పన్ను కడతారా.. జప్తు చేయాలా?

Published Fri, Mar 27 2015 1:25 AM | Last Updated on Wed, Aug 15 2018 9:27 PM

పన్ను కడతారా.. జప్తు చేయాలా? - Sakshi

పన్ను కడతారా.. జప్తు చేయాలా?

సీఎం సొంత జిల్లాలో అరాచకం
పన్ను వసూళ్ల పేరిట దౌర్జన్యం
అప్పటికప్పుడు కట్టాలంటూ హుకుం
ఇళ్ల తలుపులు ఊడబెరికిన వైనం
నగలు తాకట్టు పెట్టి చెల్లింపు
పంచాయతీ అధికారుల వీరంగంపై జనం మండిపాటు

 
సంగారెడ్డి: సీఎం సొంత జిల్లాలో పంచాయతీ అధికారులు రౌడీల్లా ప్రవర్తించి, దౌర్జన్యానికి దిగారు. స్పెషల్‌డ్రైవ్ పేరిట గ్రామాలపై మూకుమ్మడి దాడులకు పూనుకున్నారు. అప్పటికప్పుడు పన్ను చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు. ఏ మాత్రం ఆలస్యమైనా ఇళ్ల తలుపులు పెకిలించారు. ఇళ్లల్లోకి చొరబడి మంచాలు, సిలిండర్లు, టీవీలు, చెంబులు, బిందెలు జప్తు చేశారు. మంచం మీద పసిబిడ్డకు పాలిస్తున్న తల్లీబిడ్డను లాగేసి మంచం ఎత్తుకెళ్లారు. తాళం వేసి పొలానికి వెళ్లి వచ్చేలోగా ఓ రైతు ఇంటి తలుపులు ఊడదీసుకు పోయారు. దొరికిన వస్తువును దొరికినట్టు తీసుకెళ్లి గ్రామ పంచాయతీలో వేలానికి పెట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లాలో గురువారం ఈ అరాచకం జరిగింది. ఆస్తి పన్నును వంద శాతం వసూలు చేయాలనే లక్ష్యంతో పంచాయతీ అధికారులు దౌర్జన్యానికి దిగుతున్నారు. బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ పేరిట అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో గ్రామాలను చుట్టుముడుతున్నారు. గురువారం చిన్నశంకరంపేట, రామాయంపేట మేజర్ గ్రామ పంచాయితీలపై విరుచుకుపడ్డారు. అధికారులు ఇంటింటికి వెళ్లి ‘బకాయిలు కడ్తారా..? లేక ఆస్తులు జప్తు చేయమంటారా?’ అని బెదిరించారు. బకాయి కట్టిన వారికి రశీదులిచ్చారు. కట్టలేని వారి ఇంట్లోకి చొరబడి టీవీలు, మంచాలు, తలుపులు ఎత్తుకుపోయారు. నల్లా కనెక్షన్లు తొలగించారు.  
 
► తాను స్నానం చేస్తుండగానే బాత్‌రూం తలుపులు ఊడదీశారు. ఇంట్లో ఉన్న టీవీ పట్టుకొని పోయారని రామాయంపేటకు చెందిన ఓ మహిళ కన్నీరు కార్చింది.
► చంటి బిడ్డకు పాలిస్తుంటే నెట్టేసి మంచం ఎత్తుకుపోయారని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.
► చిన్నశంకరంపేటలో మేడి ప్రసాద్ అనే వ్యక్తి రూ.1,593 బకాయి పడ్డాడు. అధికారులు వచ్చిన సమయంలో ఆయన పొలం వద్ద ఉన్నారు. అదేం పట్టించుకోని అధికారులు అతని ఇంటి తలుపులు ఊడదీసి పంచాయతీ కార్యాలయానికి తరలించారు.
► అదే గ్రామంలో పలువురి గ్రామస్తులది ఇదే పరిస్థితి. తలుపులతో సహా ఇంట్లోని వస్తువులు ఎత్తుకొని పోయి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పెట్టారు. పరువు పోతుందని భావించిన కొందరు మహిళలు ఒంటి మీద నగలు కుదవబెట్టి పన్నులు కట్టారు.  మరికొంత మంది రైతులు అప్పటికప్పుడు దూడలు, పశువులను విక్రయించి పన్ను చెల్లించారు.
 
 కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు

 రూ. 2 వేలు బాకీ ఉన్నామట. మాకు సెప్పనే సెప్పలేదు. ఇంటికొచ్చిండ్రు దర్వాజలు పీక్కుపోయిండ్రు. వద్దు బిడ్డా అని గదువ పట్టుకొని బతిమిలాడినా... కాళ్లు పట్టుకున్న వినలే.. అనరాని మాటలు తిట్టుకుంట దర్వాజలు గడ్డపారతో పెకిలించిండ్రు. అపుడు మాపెద్ద మనిషి తానంజేత్తుండు. తానం సేసినంక పైసలు ఇస్తమన్నా ఆగలేదు. నేను ఇన్నేండ్లలో ఇసుంటి దౌర్జన్యం ఎప్పుడు సూడలే. నల్లాపైపులు విరగ్గొట్టిండ్రు. నాకు భయంతో బీపీ ఎక్కువయింది.
- దేవుని నర్సవ్వ, దుర్గమ్మ బస్తీ, రామాయంపేట
 
కమ్మలు కుదవబెట్టి కట్టిన..

ఎకాఎకిన ఇంటి మీద సక్తుజేస్తే ఎట్లా... నేనేమో పొలం మీదకు పోయిన.. ఆళ్లు ఇంటిమీదకచ్చిళ్లు. తలుపులు పీక్కపోయిండ్రు. నల్లా కనెక్షన్ పీకేసిళ్లు. నా భార్య ఒంటిమీది కమ్మలు మార్వాడీకి కుదవబెట్టి రూ.5 మిత్తికి రూ.3 వేలు తీసుకొచ్చి కట్టిన.          
- అంజయ్య, చిన్నశంకరంపేట
 
 ‘జప్తు’ చట్టంలోనే ఉంది

 నోటీసులిచ్చిన 12 రోజుల్లో పన్ను బకాయిలు కట్టాలి. అలా కాని పక్షంలో చరాస్తులను జప్తు చేయవచ్చ ని పంచాయతీ చట్టంలోనే ఉంది. జప్తు చేసిన ఆస్తులను వేలం వేయొచ్చు. రామాయంపేట, చిన్నశంకరంపేట పంచాయతీల్లో ఏం జరి గిందో నాకు తెలియదు.       
- సురేశ్‌బాబు, డీపీవో
 
 టీవీ ఎత్తుకపోయిండ్రు

 ట్యాక్స్ కోసం వచ్చిన పంచాయితోళ్లు మా ఇంటికి వచ్చి నల్లా పైపులు విరగ్గొట్టిండ్రు. మమ్ములను నెట్టేసి టీవీ ఎత్తుకపోయిండ్రు. మేము రూ.4 వేలు బాకీ ఉండగా, రూ.2 వేలు కడ్తమన్నా దౌర్జన్యం జేసిండ్రు. వారిపై చర్యలు తీసుకోవాలి.    - జమాల్‌పూరి గణేశ్,   
రామాయంపేట
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement