కానిస్టేబుల్ కాబోయి.. కటకటాల్లోకి..
► అనుకోని ఘటనతో చోరీలకు పాల్పడిన యువకుడు
► ఏటీఎం మోసగాడిని అరెస్టు చేసిన పోలీసులు
► రూ.80 వేలు స్వాధీనం
ములుగు : పోలీస్ కావాలని లక్ష్యంగా పెట్టుకొని చదువుతున్న ఓ యువకుడు అనుకోని ఘటనతో దొంగగా మారాడు. ఏటీఎం కేంద్రాలకు వచ్చే ఏటీఎం కార్డుదారులను పక్కదారి పట్టిస్తూ నగదు కాజేశాడు. చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యూడు. పోలీసు అవుతాడని తల్లిదండ్రులు కన్న కలలను కల్లలు చేశాడు. ములుగు సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన బాణా ల ప్రశాంత్ హన్మకొండలోని రామప్ప కోచింగ్ సెంటర్‌లో కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్నాడు. నెలవారి ఖర్చులకు తల్లిదండ్రులు ప్రశాంత్ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తే ఏటీఎం ద్వారా తీసుకునేవాడు.
ఏటీఎంలో వచ్చిన డబ్బులతో తప్పుదారి..
2015 నవంబర్‌లో కాజీపేట ఫాతిమానగర్ ఆంధ్రాబ్యాంకులో ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసేందుకు యత్నించగా అవి రాలేదు. దీంతో సదరు వ్యక్తి ఏటీఎం నుంచి బయటికి వచ్చాడు. కొద్ది క్షణాల తర్వాత మిషన్ నుంచి డబ్బులు వచ్చాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ప్రశాంత్ వాటిని తీసుకున్నాడు. దీనిని పూర్తిగా గమనించిన ప్రశాంత్ ఇలా ఏటీఎంల ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చనే దుర్బుద్ధితో ఏటీఎం సెంటర్ల వద్ద పాగా వేయడం మొదలుపెట్టాడు. ఏటీఎం కార్డును వినియోగించడం అంతగా రాని వారిని గమనించి తాను డబ్బులు డ్రా చేసి ఇస్తానని అనేవాడు. పిన్ నంబరు తెలుసుకొని ఎంటర్ చేశాక మిషన్ పనిచేయడం లేదని వారిని నమ్మించేవాడు. వాళ్లు బయటికి వెళ్లిన తర్వాత అకౌంట్ నుం చి డబ్బులు డ్రా చేసేవాడు. ఇలా ఇప్పటి వరకు కాజీపేట, వరంగల్, భూపాలపల్లి, హుజురాబాద్, గోదావరిఖని ప్రాంతాల్లో ఏటీఎం కార్డుదారులను మోసం చేశాడు.
ఇలా ములుగు ఆంధ్రాబ్యాంకు ఏటీఎం ద్వారా ఏప్రిల్ 12న రూ.12 వేలు, 15న రూ.10 వేలు, మే 1వ తేదీన రూ.10 వేలను డ్రా చేశాడు. అకౌంట్ నుంచి డబ్బులు పోయాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఎస్సై సూర్యనారాయణ, పీఎస్సై రాజు, కానిస్టేబుళ్లు సునీల్, వాసు బ్యాంకు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో గురువారం ఉదయం ములుగు బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ప్రశాంత్ పోలీసులను చూసి పరుగు తీశాడు. పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా పై విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అతడిని రిమాండ్‌కు తరలించనున్నట్లు సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. ఆయా ఏటీఎం సెంటర్ల నుంచి నిందితుడు రూ.90 వేలకుపైగా డ్రా చేయగా ములుగు పోలీసులు సుమారు రూ.80 వేలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా రూ.10 వేలు ఖర్చు చేసుకున్నట్లు ప్రశాంత్ తెలిపాడని వెల్లడించారు. సీఐ వెంట ఎస్సై సూర్యనారాయణ, పీఎస్సై రాజు ఉన్నారు.
కానిస్టేబుల్ ప్రిలిమ్స్‌కు అర్హత
కాగా, ప్రశాంత్ ఇటీవల విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్షల్లో అర్హత సాధించాడు. తదుపరి పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇలా దొంగగా పట్టుబడడంతో ఉద్యోగ అవకాశం కూడా చేజారినట్లయింది.