సామాన్యుల్లా సరుకులు కొనుగోలు చేసేందుకు కిరాణా దుకాణానికి వెళ్తారు.. అది.. ఇది కావాలంటూ దుకాణాదారుడిని అడుగుతారు.. చివరకు ఉల్లిగడ్డలు కావాలని చెబుతారు.. అవి తెచ్చేందుకు దుకాణాదారుడు పక్క గదికి వెళ్లే సరికి గల్లా పెట్టెలోని డబ్బులు తీసుకుని ఉడాయిస్తారు.. తుంగతుర్తి నియోజకరవ్గంలో ఇదే తరహాలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
అర్వపల్లి : సినీ ఫక్కీలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను ఎట్టకేలకు స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మహ్మద్ అజీజుద్దీన్, మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామానికి చెందిన ముదురుకోల హరికృష్ణ ఇద్దరు యువకులు చోరీలనే వృత్తిగా ఎంచుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అర్వపల్లిలోని చిల్లంచర్ల విద్యాసాగర్ దుకాణంలో సరుకులు కావాలని అడిగి కొన్ని సరుకులు కొన్నారు. దుకాణం లోపల ఉన్న ఉల్లిగడ్డను చూసి అదికూడా కావాలని కోరగా దుకాణం యజమాని భార్య సరిత దుకాణం నుంచి అవతలిరూంలో ఉన్న ఉల్లిగడ్డలు తేవడానికి వెళ్లగా ఇదే అదునుగా భావించి క్యాష్ కౌంటర్ పక్కనే బ్యాగులోఉన్న రూ. 61వేల నగదును వేసుకుని తమ స్కూటిపై ఉడాయించారు.
భార్య కేకలు వేయడంతో ఆమె భర్త విద్యాసాగర్ చుట్టుపక్కల మండలాల్లోని తన స్నేహితులు, ఇతర పోలీస్‌స్టేషన్‌లకు సమాచారం ఇచ్చారు. దీంతో దొంగల కోసం తిరుమలగిరి, తుంగతుర్తి, సూర్యాపేట రూట్లో బైక్‌లపై వెతకడం మొదలు పెట్టారు. అయితే దొంగలు అర్వపల్లి నుంచి తుంగతుర్తి మండలం వెలుగుపల్లికి పోయి అక్కడ కొల్లూరి అంతయ్య దుకాణంలో ఇదే విధంగా సరుకులు కావాలని చెప్పి చివరగా దుకాణం అవతలి గదిలో ఉన్న ఉల్లిగడ్డలు కావాలని కోరడంతో వ్యాపారి ఉల్లి గడ్డలు తెచ్చేలోపు దుకాణంలోని రూ. 5వేల విలువ చేసే సెల్ రిచార్జ్ కూపన్లు చోరీ చేసుకుని పారిపోయారు. అనంతరం ఇదే మండలంలోని అన్నారంలో ఆగి అక్కడ కూడా దొంగతనం చేయడానికి పథకం రూపొందిస్తున్నారు. అయితే వెలుగుపల్లికి చెందిన విత్తనాల దుకాణం యజమాని సైదులుకు విషయం తెలిసి తన స్నేహితులతో కలిసి బైక్‌లపై దొంగల కోసం వెంటపడగా అన్నారంలో ఆగిన దుండగులను పట్టుకున్నారు. ఈ ఇద్దరు దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెల్సింది.
రెండు నెలల క్రితం..
నిందితులు తుంగతుర్తి మండల కేంద్రంలోని మణికంఠ కిరాణం దుకాణంలో కూడా సరుకులు కావాలని వెళ్లి అక్కడ కూడా దుకాణం అవతలి గదిలో ఆరబోసిన ఉల్లిగడ్డలు కావాలని కోరగా యజమాని వీరయ్య అవి తెచ్చేలోపు కౌంటర్‌లోని రూ.60వేల విలువ చేసే రీచార్జ్ కూపన్లు ఇతర సామగ్రి అపహరించుకుపోయారు. వీరంతా శుక్రవారం రాత్రి అర్వపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వచ్చారు. కాగా ఈవిషయమై ఎస్సై మోహన్‌రెడ్డిని వివరణ కోరగా చోరీలు జరిగిన విషయమై తమకు ఫిర్యాదులు వచ్చాయని, వీటిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు. దొంగలను తమ అదుపులోకి తీసుకున్నాక అన్నికోణాల్లో విచారణ సాగిస్తామని చెప్పారు. అన్నారంలో దొంగలను పట్టుకున్న వెలుగుపల్లికి చెందిన సైదులు, ఆయన స్నేహితులను అర్వపల్లిలో ప్రజలు, వ్యాపారులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment