పుష్కరవేళ.. బాసర గోదారమ్మ వెలవెల!
భైంసా (ఆదిలాబాద్): పుష్కరసంబరానికి సమయం దగ్గరపడుతుంటే ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో గోదారమ్మ వెలవెలబోతోంది. ఈ నెల 1న మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 12 గేట్లు ఎత్తడంతో అదే రోజు సాయంత్రానికి బాసరలో గోదావరి పరవళ్లు తొక్కింది. అయితే రెండు రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. గేట్లు ఎత్తి నీరు వదలడంతో పుష్కర భక్తులకు ఇబ్బందులు తీరుతాయని అంతా ఆశపడ్డారు. కానీ, రెండు రోజుల్లోనే బాసరలోని స్నానఘట్టాల వద్ద నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో నల్లని మట్టి పైకితేలి కనిపిస్తోంది.
నదిలో రైలు, బస్సు వంతెనల మధ్య బండరాళ్లు, మట్టికుప్పలు పైకి తేలి కనిపిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే ఉంటే మరో తొమ్మిది రోజుల్లో ఉన్న నీరు ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. దీంతో భక్తుల పుణ్య స్నానాలకు ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయి. మరోవైపు పుష్కరాల్లోపు వర్షాలు కురియకపోతే గోదావరిలో పల్లపు ప్రాంతాల్లో నిలిచే నీటిని పైపులతో స్నానఘట్టాలకు మళ్లించే ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. షవర్ల ద్వారా పుణ్య స్నానాలకు అవకాశం కల్పించనున్నారు.