20న జరిగేది అఖిలపక్షమా.. ఏకపక్షమా?
అఖిలపక్ష భేటీకి వైఎస్సార్‌సీపీని పిలవకపోవటం పెద్ద తప్పు
జిల్లాల విభజనలో ప్రజల పక్షాన పోరాటాలు చేస్తాం
ప్రకటనలకే పరిమితమైన బంగారు తెలంగాణ
వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ ధ్వజం
హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ నెల 20న నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం.. కేవలం ఏకపక్ష సమావేశం లాగా కనపడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్‌సీపీని పిలవకపోవటం పెద్ద తప్పు అని ఆయన పేర్కొన్నారు. బుధవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాల విభజనపై 10 జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని, అది గుర్తించిన సీఎం కేసీఆర్ కంటితుడుపు చర్యగా, ఒక పద్ధతి అంటూ లేకుండా అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నారని విమర్శించారు. జీహెచ్‌ఎంసీకి చెందిన 58, 59 జీవోలకు సంబంధించి గత ఏడాది అఖిలపక్షానికి వైఎస్సార్‌సీపీని పిలిచిన ప్రభుత్వం.. ఇప్పుడు పిలవకపోవటంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. సీపీఐ, సీపీఎంను పిలిచి వైఎస్సార్‌సీపీని మాత్రం విస్మరించారన్నారు. అఖిలపక్షానికి పిలిచినా, పిలవకపోయినా జిల్లాల విభజనలో ప్రజల కోరికకు మద్దతుగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ జిల్లాలను విభజిస్తే వైఎస్సార్‌సీపీకి అభ్యంతరలేదని, సీఎం సొంత రాజకీయ ప్రయోజనాల కోసం విభజన చేస్తే మాత్రం ప్రజల పక్షాన నిలిచి ఆందోళనలు సాగిస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్ గెజిట్ పత్రికలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీలను అఖిలపక్షానికి ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిందని, వైఎస్సార్‌సీపీ తప్ప మిగతా పార్టీలన్నింటినీ ఆహ్వానించారని చెప్పారు. ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో వైఎస్సార్‌సీపీ మూడో స్థానంలో ఉందంటూ.. అందుకు సంబంధించిన ఆధారాలను శివకుమార్ మీడియా ప్రతినిధులకు అందజేశారు. ఆగస్టు 15 వేడుకలకు కూడా వైఎస్సార్‌సీపీని పిలవలేదని ఆరోపించారు. 26 నెలల్లో పూటకో మాట, వారానికో ఒక నిర్ణయం లాగా సీఎం కేసీఆర్ పాలన సాగిందని, ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ పత్రికా ప్రకటనలకే పరిమితమైందని చెప్పారు. బంగారు తెలంగాణలో ముఖ్యమంత్రికి సమర్పించాల్సిన వినతిపత్రాల్ని, ఆయన అపాయింట్‌మెంట్ దొరక్కపోవటంతో గవర్నర్‌కు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.
సుప్రీం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..
టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పటికే 16సార్లు మొట్టికాయలు వేసిందని శివకుమార్ గుర్తుచేశారు. పార్టీ ఫిరాయిం చిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు.. స్పీకర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని, 3 వారా ల్లో సమాధానం చెప్పాలని నోటీసులు ఇవ్వటం సరైం దేనన్నారు. సుప్రీం నిర్ణయాన్ని తమ పార్టీ స్వాగతిస్తోందన్నారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులకు పార్టీ కండువలు కప్పినంత మాత్రా న సరిపోదని, ఎన్నికలకు వెళ్లే దమ్ము ధైర్యం ఉండాలని చెప్పారు.
ఆహ్వానం అందకుంటే 20న ఆందోళనలు
నాగర్‌కర్నూల్: పరిపాలనా సౌలభ్యం కోసం కొత్తజిల్లాల ఏర్పాటుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తుందని, కానీ ఈనెల 20న నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీకి ఆహ్వానం అందించకపోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంతర్యమేమిటని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీ ఎంగిలిమెతుకులకు ఆశపడి వెళ్లారని, అంతమాత్రాన పార్టీ విలీనమైనట్లు కేసీఆర్ భ్రమపడుతున్నారని అన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రజలు గుర్తించిన పార్టీ అని పేర్కొన్నారు. గురువారం సాయంత్రంలోగా ఆహ్వానం అందకుంటే హైదరాబాద్‌లో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామన్నారు. జిల్లాల వారీగా అఖిలపక్ష సమావేశాలు నిర్వహించి తరువాత రాష్ట్ర స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులపై స్పీకర్‌కు, పార్టీ ఫిరాయించిన వారికి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చి మూడువారాలలో స్పందించాలని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తన మేనిఫెస్టో భగవద్గీత అని, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని ఒకప్పుడు చెప్పిన కేసీఆర్ ఇప్పుడు రైతులను ఏడిపిస్తున్నారని అన్నారు. మూడో దఫాలో రూ. 25 వేలు రుణమాఫీ చేయాల్సి ఉండగా, రూ. 12,500 మాత్రమే చేశారని, 60 శాతం రైతుల పాస్‌బుక్కులు బ్యాంకుల్లో ఉన్నాయని, రుణాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. పాలమూరు జిల్లాలో రైతులకోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టులు చేపట్టి 90 శాతం పనులు పూర్తి చేశారని, మిగతా పనులు పూర్తి చేస్తే వైఎస్‌కు పేరొస్తుందనే టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయడం లేదన్నారు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లుందని ఎద్దేవా చేశారు. పాల మూరు ప్రాజెక్టుల సందర్శనపై ఈనెల 24న జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మాదిరెడ్డి భగవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంభూపాల్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.