గోపాల్‌పేటలో దొంగల హల్‌చల్
నాగిరెడ్డిపేట : మండలంలోని గోపాల్‌పేటలో శనివారం రాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. ఒకే రోజు ఎనిమిది ఇళ్ల తాళాలు పగులగొట్టి కలకలం సృష్టించారు. నాగిరెడ్డిపేట మండల కేంద్రమైన గోపాల్‌పేటలో ఎక్సైజ్ కానిస్టేబుల్ కంచరి భూపాల్‌తో పాటు మండలంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తూ గోపాల్‌పేటలో అద్దెకుంటున్న సంతోష్, రమేష్, శ్రీహరి ఇళ్ల తాళాలను దొంగలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వీరితో పాటు ఎస్సీ కాలనీలో నివాసముంటున్న పరమల్ల రాములు, ఇదే గ్రామంలో అద్దెకుంటున్న ట్రాన్స్‌కో సబ్‌ఇంజినీర్ సత్యనారాయణగౌడ్, చాకలి రాజు ఇంటి తాళాలను పగులగొట్టి చోరీకి దిగారు.
నాగిరెడ్డిపేటలోని జయంత్‌రెడ్డి ఇంటి తాళాలను సైతం ధ్వంసం చేసి ఇంట్లోని ఇత్తడి సామాగ్రిని ఎత్తుకెళ్లారు. గోపాల్‌పేటలో జరిగిన చోరీలో సంతోష్‌కు చెందిన రెండు సెల్‌ఫోన్లు, రమేష్ ఇంట్లో రూ.2వేల నగదు, రాములుకు చెందిన 4 తులాల వెండి, అరతులం బంగారంతో పాటు రూ.వెయ్యి నగదు అపహరించినట్లు బాధితులు తెలిపారు. దీంతో పాటు సంతోష్ ఇంట్లో నుంచి ఎల్‌ఈడీ టీవీనీ అపహరించేందుకు ప్రయత్నించి కుదరకపోయే సరికి పక్కనే ఉన్న కుర్చీలో పెట్టి వెళ్లిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నాగిరెడ్డిపేట ఏఎస్సై కిష్టయ్య తెలిపారు.
రెండు ఇళ్లలో పట్టపగలే చోరీ..
మండలంలోని గోపాల్‌పేటలో శనివారం పట్టపగలే రెండు ఇళ్లలో చోరీ జరిగింది. గోలిలింగాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తూ గోపాల్‌పేటలో అద్దెకుంటున్న సంతోష్ తన ఇంటికి శనివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో తాళంవేసి రామాయంపేటలోని బంధువుల శుభకార్యానికి వెళ్లారు. ఇది గమనించిన దొంగలు మధ్యాహ్నం సమయంలోనే ఇంటి తాళాలు పగులగొట్టి పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని గమనించిన పక్కింటివారు మరో తాళం వేశారు. విషయం తెలుసుకున్న సంతోష్ శనివారం మధ్యాహ్నమే తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తిం చారు.
దీంతోపాటు సమీపంలోనే ఉన్న ట్రాన్స్ కో సబ్‌ఇంజినీర్ సత్యనారాయణగౌడ్ గది తాళాలను సైతం శనివారం మధ్యాహ్నమే పగులగొట్టి దొంగలు లోనికి ప్రవేశించి వస్తువులను చిందరవందరగా చేసి వెళ్లిపోయారు. విధుల నుంచి తిరిగి వచ్చిన సత్యనారాయణ తన గది తాళాలు పగులగొట్టి ఉండడాన్ని చూసి నివ్వెరపోయారు. ఇంట్లోకి వెళ్లి చూడగా విలువైన వస్తువు లు అపహరణకు గురవకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా రు. కాగా పట్టపగలే మండలకేంద్రంలో దొంగతనాలు జరగడంతో స్థానిక ప్రజలు కలవరపడుతున్నారు.