ఈ నెల 20 డెడ్‌లైన్
ఆలోగా ఎస్కలేషన్ ప్రతిపాదనలు ఇవ్వకుంటే అగ్రిమెంట్ రద్దు
♦ కాంట్రాక్టు ఏజెన్సీలకు
♦ మంత్రి హరీశ్‌రావు హెచ్చరిక
♦ జీవో 146పై సుదీర్ఘంగా చర్చ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పరిధిలో పనులు చేస్తు న్న కాంట్రాక్టు ఏజెన్సీలు తమ ఎస్కలేషన్ ప్రతి పాదనలను ఈ నెల 20 నాటికి సమర్పించాలని ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టింది. వారం రోజుల్లోగా సమర్పించని పక్షంలో టెండర్ అగ్రిమెంట్‌ను సైతం రద్దు చేయాలని నిర్ణయించింది. ఎస్కలేషన్ ప్రతిపాదనలపై ఇప్పటివరకు ఏజెన్సీల నుంచి స్పందన లేకపోవడంతో సీరియస్‌గా తీసుకున్న నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు... అధికారులు, ఏజెన్సీలతో శుక్రవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషి, ఈఎన్‌సీలు మురళీధర్, విజయ్‌ప్రకాశ్‌లు హాజ రయ్యారు. జీవో 146 ప్రతిపాదనలను ప్యాకేజీల వారీగా సమీక్షించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం జీవో 146ను తెచ్చిందని, అయితే ఏజెన్సీలు, అధికారులు ఈ జీవో అమలు విషయంలో అలసత్వం వహిస్తున్నారని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
పాలేరు ఎత్తిపోతలకు ‘భక్త రామదాసు’ పేరు
ఖమ్మం జిల్లా ప్రాజెక్టులనూ మంత్రి సమీక్షించా రు. దీనికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. దుమ్ముగూడెం ప్రాజెక్టును సీతారామ ప్రాజెక్టుగా, పాలేరు ఎత్తిపోతల పథకం పేరును భక్త రామదాసు ఎత్తిపోతలుగా పేరు మారుస్తూ వెంటనే జీవో విడుదల చేయాలని హరీశ్ ఆదేశించారు. అలాగే కరీంనగర్ జిల్లా రాయపట్నం దగ్గర ఆర్‌అండ్‌బీ శాఖ నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆ శాఖ మంత్రి తుమ్మలను హరీశ్ కోరారు. స్పందించిన తుమ్మల... జూన్ వరకు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టుపైనా సమీక్షించారు. త్వరగా సర్వేలు పూర్తిచేసి నల్లగొండ జిల్లాలోని రిజర్వాయర్ల వరకు టెండర్లు పిలవాలని సూచించారు.
15న బడ్జెట్‌పై సమావేశం
కాగా ఈ నెల 15న నీటి పారుదల శాఖ బడ్జెట్‌పై సమావేశం కావాలని మంత్రి నిర్ణయించారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఆచరణ సాధ్యమయ్యేలా ఉండాలని, శాస్త్రీయ పద్ధతుల్లో తయారు చేయాలన్నారు.