ఏళ్ల తరబడి రైతుల ఎదురుచూపులు
వేల సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు
పరిశీలన పూర్తయినా.. నమోదులో జాప్యం
కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశాలు బేఖాతరు
హన్మకొండ అర్బన్ :‘పట్టాదారు పాస్‌పుస్తకాలు, పహాణీల జారీ విషయంలో రైతులను ఇబ్బందులు పెట్టొద్దు. రైతుల ఇంటి వద్దకే వెళ్లి రుణాలు, రెవెన్యూ పత్రాలు అందజేయాలి.’ ఇటీవల కలెక్టర్ ప్రతి సమావేశంలోనూ ఇదే విషయూన్ని చెబుతున్నారు. కానీ.. జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. చాలా మండలాల్లో పహాణీల కోసం రైతులు నానాయాతన పడుతున్నారు. పంటల సాగు నిమిత్తం బ్యాంక్ రుణాల కోసం రైతులకు వారి భూములకు సంబంధించిన మీసేవ పహాణీ తప్పనిసరి. దీంతో రైతులు సమయం వెచ్చించి... ఆర్థికభారం భరించి మీ సేవ కేంద్రాలకు వెళ్లి పహాణీలు తీసుకుంటున్నారు. తీరి వెళ్లి తీసుకుని వస్తే... అందులో ఉన్న సవాలక్ష తప్పులతో రైతులు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. పహాణీలో ఉన్న భూమి కన్నా తక్కువ ఉండడం.. తండ్రి పేరుకు బదులు తాత పేరు ఉండడం.. కబ్జా కాలంలో ఉన్న పేరు మాయమై ఊళ్లో లేని వారి పేరు ప్రత్యక్షమవుతోంది. ఇదేంటని రైతులు.. వీఆర్వోను కలిస్తే ఎమ్మార్వోను కలవమని సలహా ఇస్తున్నారు. రెతులు ప్రయూసపడి అక్కడికి వెళితే నెలల తరబడీ ఎమ్మార్వో దొరకని పరిస్థితి ఉం టోంది. కోర్టు డ్యూటీ, ప్రొటోకాల్. కలెక్టర్, ఆర్డీఓ సమీక్షలు, క్షేత్రస్థాయి పరీశీలనలు, విచారణ నివేదికలంటూ పెద్దపెద్ద మండలాల్లో తహసీల్దార్లు పహాణీలపై దృష్టిసారించకపోవడంతో వేలాదిగా పెండింగ్‌లో పడ్డారుు. స్వయంగా కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కాలం నెత్తి మీదికొచ్చినా తమ ఇబ్బందులను పట్టించుకునే నాధుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హన్మకొండలో 1500కు పైగా పెండింగ్
గ్రామీణ ప్రాంత పరిధి తక్కువగా ఉన్న హన్మకొండ మండలంలో పహాణీలో తప్పులు దొర్లి న దరఖాస్తులు ఇప్పటివరకు సుమారు 1500 కు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయం లో వీఆర్వోలు, ఆర్‌ఐలు క్షేత్రస్థాయి పరీశీలన చేసి నివేదిక ఇచ్చారు. వాటికి కూడా మోక్షం లేదు. రైతులను ఇదిగో.. అదిగో అంటూ ప్రతి రోజూ కార్యాలయానికి తిప్పుకుంటున్నారు.
ఒక్కటే ‘కీ’ సమస్య
ముఖ్యంగా డిజిటల్ కీ సమస్యతోనే వెబ్‌లాండ్ పహాణీ దరఖాస్తులు పేరుకుపోతున్నాయని తెలుస్తోంది. తహసీల్దార్ కార్యాయంలో రేషన్‌కార్డులు, కులం ఆదాయం, నివాసం సర్టిఫికెట్లు, పహాణీల మార్పులకు సంబంధించి మండలానికి ఒకటే డిజిటల్ కీ ఉంటోంది. దీంతో హన్మకొండ మండలంలో అధికారులు పూర్తిగా సర్టిఫికెట్ల జారీకే పరిమితమవుతున్నారు. మిగతా పనులు పెండింగ్‌లో పడుతున్నారుు.
రెండుళ్లుగా తిరుగుతున్నా...
మాకు అమ్మవారి పేట శివారులో భూమి ఉంది. పహాణీ లో మా పేరు కాకుండా వేరేవారి పేరు వస్తోంది. ఈ విషయూన్ని తహసీల్దార్‌కు చెబితే వీఆర్వోకు రాశారు. వీఆర్వో, ఆర్‌ఐలు నివేదిక ఇచ్చారు. కంప్యూటర్‌లో నమోదు కోసం మూడు నెలల నుంచి తిప్పుకుంటున్నారు. ఇప్పటికి రెండేళ్లుగా ఇదే ఇబ్బంది. ఇప్పటికైనా అధికారులు గమనించాలి.
- బిక్షపతి, రైతు, భట్టుపల్లి
6 నెలలుగా రేపటి వాయిదానే...
కడిపికొండ గ్రామ పరిధిలోని మా భూమి వివరాలు కబ్జాలో ఎక్కించాలని ఆరు నెలల క్రితం దరఖాస్తు ఇచ్చాం. వీఆర్వో పరిశీలన పూర్తయింది. కంప్యూటర్‌లో నమోదు కోసం రేపు... మాపు అంటూ ఆరునెలలుగా తిప్పుతున్నారు. పంటల సీజన్‌లో రైతులకు పహాణీ లేనిదే పనులు కావు. అధికారులు మాత్రం ఈ విషయంలో పూర్తి నిర్లక్ష్యంగావ్యవహరిస్తున్నారు.
- రవీందర్‌రెడ్డి, రైతు, హన్మకొండ
పహాణీ పాట్లు
Published Sat, Jul 11 2015 12:53 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement
Advertisement