
ఓ కొడుకా..
♦ ఆర్టీసీ బస్సు, కారు ఢీ... ముగ్గురు దుర్మరణం
♦ మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
♦ శ్రీశైలం రహదారిపై మొహబ్బత్‌నగర్ గేటు వద్ద ప్రమాదం
కారు, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కుర్మిద్దకు వెళ్లి తల్లిని చూసి వస్తుండగా దారుణం మహేశ్వరం మండలం మొహబ్బత్ గేటు వద్ద ఘటన
అయ్యో కొడుకుల్లారా.. ఎంత ఘోరం జరిగింది.. ఈ కన్నతల్లిని చూడాలని వచ్చి కానరాని లోకాలకు వెళ్లారా.. అంటూ ఆ తల్లి రోదన అందరినీ కలిచివేసింది. కన్నబిడ్డల మృతదేహాలను చూసిన ఆ తల్లి ఏడుపును ఆపడం ఎవరి తరమూ కాలేదు.
మహేశ్వరం: ఆర్టీసీ– బస్సు మారుతీ కారు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన మంగళవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం శ్రీశైలం రహదారిపై మెహబ్బత్‌నగర్ గేటు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి చెందిన పాలోజు చంద్రమౌళి(52), పాలోజు బ్రహ్మచారి(48) పాలోజు శ్వేతæ(20)లు మారుతీ కారులో హైదరాబాద్ నుండి స్వస్థలమైన యాచారం మండలం కుర్మిద్ద గ్రామానికి తల్లిని చూడటానికి వెళ్లారు. తల్లి రామేశ్వరమ్మని చూసి మధ్యాహ్నం 3 గంటలకు కుర్మిద్ద నుండి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. శ్రీశైలం రహదారిపైన మొహబ్బత్‌నగర్ గేటు వద్దకు రాగానే ఇబ్రహీంపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కందుకూరు నుండి హైదరాబాద్ వస్తున్న మారుతీ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు కావడంతో మృతదేహాలు అందులోనే ఇరుక్కుపోయాయి. గ్యాస్ కట్టర్ తీసుకొచ్చి మృతదేహాలను బయటకు తీశారు.
ఆర్టీసీ డ్రైవర్‌కు దేహశుద్ధి..
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ను చితకబాది మహేశ్వరం పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకు మహేశ్వరం సీఐ కొరని సునీల్ సంఘటన స్థలానికి చేరుకొని ఆర్టీసీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ప్రయాణికుల ద్వారా తెలుసుకున్నా రు. వర్షం కురుస్తుండటంతో రోడ్డుపైన వాహనాలు కనబడక రెండు వాహనాలు ఢీకొన్నట్టు భావిస్తున్నారు. అయితే, బస్సు డ్రైవర్ అతివేగంగా నడిపడంతోనే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
బోరున విలపించిన మృతుల తల్లి..
మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు నగరంలో నివాసం ఉంటున్నారు. అన్న పాలోజు చంద్రమౌళి రాజేంద్రనగర్ మండలం కాటేదాన్‌లో నివాసం ఉంటూ వెల్డింగ్ పని చేస్తున్నాడు. తమ్ముడు బ్రహ్మచారి పాతబస్తీ ఉప్పుగూడలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అన్న యాదయ్య కూతురు శ్వేత నగరంలో నివాసం ఉంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో దొరికిన సెల్‌ఫోన్ ఆధారంగా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
దీంతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకొని ముగ్గురి మృతదేహాలు చూసి బోరున విలపించారు. తల్లి రామేశ్వరమ్మ కొడుకులు, మనుమరాలు మృతదేహాలను చూసి కన్నీటి పర్వంతమయ్యారు. తనను చూడడానికి వచ్చి కానరాని లోకాలకు వెళ్లారా బిడ్డ్డల్లారా అంటూ బోరున విలపించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో వారి స్వస్థలమైన కుర్మిద్దలో విషాదం నెలకొంది. ప్రమాద స్థలాన్ని డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ పరిశీలించి మృతుల కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
కుర్మిద్దలో విషాదఛాయలు
యాచారం(ఇబ్రహీంపట్నం): ఇంటి నుంచి బయల్దేరిన గంట సేపటికే తన ఇద్దరు తమ్ముళ్లతోపాటు కూతురి మరణవార్త తెలుసుకున్న యాదయ్య చారి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో స్వగ్రామం కుర్మిద్దలో విషాద ఛాయలు అలముకున్నాయి. గ్రామ ఎంపీటీసీ మాజీ సభ్యుడు పొలోజ్ యాదయ్య చారి తమ్ముళ్లయిన చంద్రమౌళి, బ్రహ్మచారిలు మంగళవారం మధ్యాహ్నం నగరం నుంచి స్వగ్రామానికి వచ్చారు. అన్నా, వదిన, తమ తల్లిని పలకరించారు. వారితోపాటు అన్న కుమార్తె శ్వేతను కూడా వెంటబెట్టుకుని కారులో బయల్దేరారు. ఇంతలో ఆర్టీసీ బస్సు రూపంలో ప్రమాదం జరిగి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. అయితే స్థానికుల కథనం ప్రకారం.. అన్నదమ్ములిద్దరూ తమ అన్న యాదయ్యచారి, వదిన సుగుణలను శ్రీశైలం దేవస్థానానికి తమతో పాటు రమ్మని పిలవడానికే వచ్చారని.. బుధవారం అందరం కలిసి దైవ దర్శనానికి వెళ్దామని పిలవగా.. వారు కుదరదని చెప్పడంతో వారి కుమార్తెను తమతో తీసుకెళ్లారని చెబుతున్నారు.