డీపీ అధినేత చంద్రబాబు సభకు వెళ్లివస్తూ ఇద్దరు, వెళ్తూ ఒకరు రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందారు.
ఎర్రుపాలెం/చండ్రుగొండ, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు సభకు వెళ్లివస్తూ ఇద్దరు, వెళ్తూ ఒకరు రోడ్డుప్రమాదానికి గురై మృతిచెందారు. ఖమ్మంజిల్లాలో గురువారం రెండు చోట్ల జరిగిన ఈ ప్రమాదాలకు సంబంధించి వివరాలు... ఎర్రుపాలెం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన దొండపాటి కృష్ణవర్దన్, దోమందుల వెంకటకృష్ణ అనే ఇద్దరు టీడీపీ కార్యకర్తలు మోటారు సైకిల్‌పై మధిర వెళ్లారు. అక్కడ చంద్రబాబు సభ ముగిసిన అనంతరం ఇరువురు స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలో ఉన్న వెంకటాపురం గ్రామం వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం మోటార్‌సైకిల్‌ను ఢీ కొంది.
దీంతో వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడక్కడే మృతి చెందారు. వీరివురూ ఇంటర్‌మీడియట్ మొదటిసంవత్సరం పరీక్షలు రాశారు. సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని గుండెలవిసేలా రోదించారు. స్థానిక ఎస్‌ఐ కె రామకృష్ణ పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం మధిర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చంద్రబాబు సభకు వెళ్తూ....
చండ్రుగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కావూరి సత్యనారాయణ (40) కొత్తగూడెంలో చంద్రబాబు సభకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందా డు. గ్రామస్తుల కథనం ప్రకారం.... వెంకటాపురానికి చెందిన సత్యనారాయణ, మరో కార్యకర్త శివతో కలిసి తన మోటారుసైకిల్‌పై కొత్తగూడెం బయల్దేరాడు. మార్గ మధ్యలోని తిప్పనపల్లి వద్ద భద్రాచలం నుంచి విజయవాడవైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణతోపాటు శివ కాళ్లు విరిగాయి. వీరిని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సత్యనారాయణను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలిస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య దుర్గమ్మ, ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.