కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి నేటికి మూడేళ్లు | Three Years To The Kamareddy District | Sakshi
Sakshi News home page

కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి నేటికి మూడేళ్లు

Published Tue, Oct 8 2019 9:36 AM | Last Updated on Tue, Oct 8 2019 9:36 AM

Three Years To The Kamareddy District - Sakshi

జిల్లా పోలీసు కార్యాలయం

జిల్లాల పునర్విభజనతో ఎన్నో మార్పులు వచ్చాయి. ప్రజలకు పాలన చేరువైంది. సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ పెరిగింది. అభివృద్ధి సైతం జోరందుకుంది. మారుమూల ప్రాంతాల కూ జిల్లా స్థాయి అధికారులు వెళ్లి వస్తున్నారు. సమీకృత కలెక్టరేట్, పోలీస్‌ కార్యాలయాల నిర్మాణ పనులు జిల్లాలో దాదాపుగా పూర్తికావచ్చాయి. కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించి మూడేళ్లవుతున్న సందర్భంగా ప్రత్యేక కథనం.. 

సాక్షి, కామారెడ్డి:  పాలనను ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలను పున ర్విభజించింది. ఆ తరువాత కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. 2016 అక్టోబర్‌ 11న కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించింది. గతంలో జిల్లా విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో జిల్లా యంత్రాంగం అన్ని ప్రాంతాలను తిరగడం ఇబ్బందికరంగా ఉండేది. ఒక్కో ప్రాంతానికి ఏడాదికోమారు కూడా వెళ్లే పరిస్థితులు ఉండేవి కాదు. జిల్లాల పునర్విభజనతో ప్రజలకు పాలన చేరువైంది. కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు తరచూ అన్ని మండలాలను చుట్టి వస్తున్నారు. అభివృద్ధి పనుల పరిశీలన, సంక్షేమ పథకాల పర్యవేక్షణ నిరంతరం కొనసాగుతోంది. ప్రతి వారం పథకాల అమలుపై సమీక్షిస్తున్నారు. కలెక్టర్‌ సత్యనారాయణ సెలవు రోజుల్లో సైతం జిల్లాలోని ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును పరిశీలించి వస్తున్నారు. దీంతో పథకాల అమలులో పారదర్శకత పెరిగింది.  

వారంవారం ప్రజావాణి... 
కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్‌తో పాటు జిల్లా అధికారులంతా ప్రజావాణికి హాజరై ప్రజల విన్నపాలను వింటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. మూడేళ్ల కాలంలో దాదాపు 8 వేలకు పైగా అర్జీలు వచ్చాయి. అందులో చాలా వాటికి పరిష్కారం చూపారు. జిల్లా కేంద్రానికి దాదాపు వంద కిలోమీటర్ల దూరాన ఉన్న జుక్కల్‌ నియోజక వర్గ ప్రజలు జిల్లా కేంద్రానికి రావడం ఇబ్బందికరంగా ఉన్న నేపథ్యంలో ప్రతి నెల మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రం లో కలెక్టర్‌ ప్రజావాణి నిర్వహిస్తున్నారు. కలెక్టర్‌ సత్యనారాయణతోపాటు జిల్లా అధికారులంతా ప్రజావాణికి హాజరై ప్రజల సమస్యలను విని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఎస్పీ శ్వేత కూడా బిచ్కుందలో నెలకోరోజు సమయం కేటాయిస్తూ అక్కడి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో కలెక్టర్‌ ప్రతి రోజూ ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతున్నారు.  

పథకాల అమలులో ప్రత్యేక ముద్ర 
కామారెడ్డి జిల్లా వివిధ పథకాల అమలులో ముందంజలో ఉంటోంది. ఉపాధిహామీ, హరితహారం, గొర్రెల పంపిణీ, భూముల రికార్డుల ప్రక్షాళన, భూగర్భజలాల వృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాల అమలులో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచింది. 

కలెక్టర్, జేసీ క్యాంపు కార్యాలయాలు పూర్తి 
సమీకృత కార్యాలయాల ప్రాంగణంలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్, అసిస్టెంట్‌ కలెక్టర్ల కోసం చేపట్టిన భవనాలు నిర్మాణం పూర్తయ్యింది. మూడు నెలల క్రితమే వాటిని ప్రారంభించారు. అధికారులు ఆయా క్యాంపు కార్యాలయాల్లోనే నివాసం ఉంటున్నారు. కలెక్టర్, జేసీతో పాటు అసిస్టెంట్‌ కలెక్టర్‌ తమ కార్యకలాపాలను అక్కడి నుంచే సాగిస్తున్నారు. 

కొత్త డివిజన్, మండలాల్లో ఇబ్బంది
జిల్లాతో పాటే ఏర్పాటైన కొత్త రెవెన్యూ డివిజన్‌ కేంద్రాలు, కొత్త మండలాల్లో కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఇబ్బందులు నెలకొన్నాయి. ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లో రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటు చేయగా.. ఆర్డీవోలు, డీఎస్పీ కార్యాలయాలకు సరైన వసతులతో కూడిన భవనాలు లభించలేదు. ఇప్పటికీ భవనాలకు నిధులు మంజూరు కాలేదు. దీంతో ఆయా కార్యాలయాలకు సొంత భవనాలు ఎప్పుడు నిర్మిస్తారోనని ఎదురుచూడాల్సి వస్తోంది.

సిద్ధమవుతున్న సమీకృత భవనాలు 
2016 అక్టోబర్‌ 11న విజయ దశమి రోజున కామారెడ్డి జిల్లాగా ఆవిర్భవించింది. జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాన్ని పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన మైనారిటీ గురుకుల పాఠశాలలో, జిల్లా పోలీసు కార్యాలయాన్ని అడ్లూర్‌ రోడ్డులోని గిరిజన విద్యార్థి వసతి గృహ భవనంలో ఏర్పాటు చేశారు. ఏ జిల్లాలో లేని విధంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్, పోలీసు కార్యాలయాలకు అన్ని వసతులతో కూడిన భవనాలు దొరకడంతో పాలనకు ఏ ఇబ్బందీ లేకుండాపోయింది. మూడేళ్లుగా ఆ భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతున్నాయి. కాగా జిల్లా ఏర్పాటైన ఏడాదికి 2017 అక్టోబర్‌ 11న జిల్లా కలెక్టరేట్‌తో పాటు జిల్లా పోలీసు కార్యాలయాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పట్టణానికి ఆనుకుని ఉన్న అడ్లూర్‌ శివారులోని 427 సర్వేనంబరులో 90 ఎకరాల్లో అటు కలెక్టరేట్‌ సముదాయం, ఇటు పోలీసు కార్యాలయాల భవనాల నిర్మాణాలు చేపట్టారు. కలెక్టరేట్‌ సముదాయానికి రూ. 44 కోట్లు మంజూరు కాగా, రోడ్లు భవనాల శాఖ పనులను అప్పగించారు. జిల్లా పోలీసు కార్యాలయ భవన నిర్మాణానికి రూ.60 కోట్లు మంజూరు కాగా పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ పనులను పర్యవేక్షిస్తోంది. సమీకృత భవనాల నిర్మాణ పనులు జిల్లాలో వేగంగా సాగాయి. ప్రస్తుతం జిల్లా పోలీసు భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. రాష్ట్రంలో అన్ని జిల్లాలకన్నా ముందుగా కామారెడ్డిలోని పోలీసు కార్యాలయ భవనం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ముందుగా పూర్తయితే సీఎంతో ప్రారంభించా లని అప్పట్లో భావించారు. అయితే ముందస్తు ఎన్నికలు రావడంతో వాయిదాపడింది. ప్రస్తుతం పోలీసు కార్యాలయ భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. త్వరలోనే సీఎం చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది. కాగా కలెక్టరేట్‌ భవన నిర్మాణ పనులూ వేగంగా కొనసాగుతున్నాయి. భవనాల నిర్మా ణం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే కార్యాలయ ప్రాంగణానికి రోడ్ల నిర్మాణం, ఫర్నిచర్‌ కొనుగోలు కోసం నిధుల సమస్య ఏర్పడింది. నిధులు మంజూరైతే నెల రోజుల్లో భవనాలను ప్రారంభించుకునేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.  

ప్రజలకు చేరువయ్యాం 
జిల్లాల పునర్విభజన తరువాత అన్ని ప్రాంతాలపై పర్యవేక్షణ సులువైంది. పలు కార్యక్రమాలు, సంస్కరణలతో పోలీసులు ప్రజలకు దగ్గరయ్యారు. మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లి ప్రజలతో మమేకమవుతున్నాం. ప్రజలు కూడా పోలీసులతో అన్నీ చెప్పుకుంటున్నారు. ప్రజల సహకారంతో సీసీ కెమెరాలను విస్తృతంగా ఏర్పాటు చేశాం. వాటి ద్వారా నేరాల సంఖ్య తగ్గింది. నేరస్తులను పట్టుకోవడం కూడా సులువైంది. అన్ని శాఖల అధికారుల కోఆర్డినేషన్‌తో ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. 
– శ్వేత, ఎస్పీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement