
కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు ఖరారు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు పొడిచింది. సీపీఐకి ఒక ఎంపీ స్థానం, 12 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి అధిష్టానం సూత్రప్రాయంగా అంగీకరించిందని టీపీసీసీలోని అత్యంత విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొదట సీపీఐ మూడు ఎంపీ స్థానాలు(ఖమ్మం, భువనగిరి, నల్లగొండ), 20 అసెంబ్లీ స్థానాలను అడిగింది. పొత్తులపై చర్చలు సాగుతున్న దశలో కనీసం 14 అయినా ఇవ్వాలని పట్టుబట్టింది. అయితే తమకున్న ఇబ్బందుల దృష్ట్యా 12కు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో సీపీఐ వాటికే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఎంపీల విషయానికొస్తే సీపీఐ మూడు స్థానాలు అడిగినప్పటికీ ఒక్కటి కూడా ఇవ్వలేమని తొలుత కాంగ్రెస్ ఖరాఖండిగా చెప్పేసింది. కానీ, సీపీఐ కనీసం ఒక ఎంపీ స్థానమైనా కావాల్సిందేనని పట్టుబట్టడంతో.. ఖమ్మం లేదా భువనగిరిలలో ఒకటి తీసుకోవాలని కాంగ్రెస్ సూచించింది. అయితే తమ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి నల్లగొండలో పోటీ చేయాలని భావిస్తున్నారని, ఆయన కోసం ఈ స్థానాన్ని వదిలేయాలని సీపీఐ కోరడంతో కాంగ్రెస్ మెత్తబడి అందుకు అంగీకరించినట్లు సమాచారం. సురవరం సీపీఐ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నందున భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని నల్లగొండను ఇవ్వడానికి కాంగ్రెస్ సమ్మతించింది. నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని మునుగోడు అసెంబ్లీకి పంపుతున్నట్లు తెలిసింది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మూడేసి చొప్పున, కరీంనగర్‌లో రెండు, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్, ఆదిలాబాద్‌లో ఒక్కోటి చొప్పున అసెంబ్లీ స్థానాలను సీపీఐ కోరుతోంది. ఒకట్రెండు రోజుల్లో పొత్తును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.