సాక్షి, మంచిర్యాల: కవ్వాల్ అభయారణ్యంలోకి మరో పెద్దపులి వచ్చి చేరింది. మహారాష్ట్ర నుంచి దాదాపు పది రోజల క్రితం ఈ పులి కవ్వాల్ అటవీ ప్రాంతానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల వరుసగా చోటు చేసుకున్న సంఘటనల నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. ఈసారైనా పులి వేటగాళ్ల ఉచ్చు బారిన పడకుండా అటవీ శాఖ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
తిప్పేశ్వర్ టూ కవ్వాల్
పులి జాడలు తగ్గుతున్న జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలోకి ఓ పెద్దపులి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. గత పది రోజుల క్రితం ఈ పులి వచ్చినట్లు అటవీశాఖ అధికారులు కూడా అంతర్గత సంభాషణల్లో ధ్రువీకరిస్తున్నారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యానికి చెందిన ఈ పెద్దపులి జిల్లాకు వచ్చినట్లు తెలిసింది. తిప్పేశ్వర్ అటవీ ప్రాంతం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కడెం, పెంబి ప్రాంతాల గుండా పది రోజుల క్రితం కవ్వాల్ అడవిలోకి ప్రవేశించినట్లు సమాచారం. కాగా, గతంలో మృత్యువాతకు గురైన రాయల్ బెంగాల్ టైగర్ కూడా తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి కవ్వాల్‌కు రావడం తెలిసిందే. కవ్వాల్ అభయారణ్యం నుంచి తిర్యాణి, ఆసిఫాబాద్‌ల గుండా ప్రయాణం చేసి శివ్వారం చేరుకున్న రాయల్ బెంగాల్ టైగర్ అక్కడ వేటగాళ్ల ఉచ్చుకు బలి కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైంది.
‘ఉచ్చు’లో పడొద్దు
పెద్దపులుల రక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంటే, మరో వైపు వేటగాళ్ల ఉచ్చులకు అరుదైన పులులు సైతం జిల్లాలో హతమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు జంతుప్రేమికులతోపాటు ప్రభుత్వాన్ని కూడా ఆందోళనలో పడవేసింది. చిరుత పులితోపాటు రాయల్ బెంగాల్ టైగర్ మృత్యువాత పడడంతో స్థానిక అటవీశాఖ అధికారులపై బదిలీ వేటు కూడా పడింది. శివ్వారం ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చుకు రాయల్ బెంగాల్ టైగర్ బలి కావడం, పులి చర్మం విక్రయం, మోసాలు తదితర ఉదంతాలు వెలుగు చూడడం తెలిసిందే. కవ్వాల్ అభయారణ్యంలోకి ప్రవేశించిన నెల రోజుల లోపే ఆ పెద్దపులి మృత్యువాత పడడం కలకలం రేపింది. గత డిసెంబర్ 15న మొదటి సారి పెద్దపులి కనిపించగా, జనవరి 8న మృత్యువాత పడింది. ఈ సంఘటనకు సంబంధించి అప్పట్లో ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది.
పులి వేట అంతం పేరిట చంద్రాపూర్‌కు చెందిన గ్యాంగ్ పులి చర్మం దందా సాగించిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. పులి చర్మం కోసం అంతర్రాష్ట్ర ముఠా రంగ ప్రవేశం చేయడం, ఎన్జీవో సంస్థ పేరుతో బేరసారాలు చేయడం, డీల్ కుదరకపోవడంతో అటవీ అధికారులకు సమాచారం అందించడం వంటి సంఘటనలపై పరిశోధనాత్మక కథాలు అందించింది. రెండేళ్లలో మూడు అరుదైన పులులు హతం కావడం, మిస్టరీగా మారడంతో సీఎం కేసీఆర్ తీవ్రంగా పరిగణించారు.
పెద్దపులులను రక్షించలేకపోవడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం, కేసును అటవీశాఖ నుంచి పోలీసు శాఖకు బదలాయించగా, దోషులను రామగుండం కమిషనరేట్ పోలీసులు స్వల్పకాలంలోనే అదుపులోకి తీసుకున్నారు. కాని అరుదైన రాయల్‌బెంగాల్‌టైగర్ మృత్యువాత పడడాన్ని జంతు ప్రేమికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా మరో పెద్దపులి కవ్వాల్ అడవిలోకి రావడంతో.. ఈ పులినైనా అటవీశాఖ అధికారులు రక్షిస్తారా అనే చర్చ జిల్లాలో మొదలైంది.
ఇప్పటికే కలప అక్రమ రవాణా, వన్యప్రాణుల వేటను నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విద్యుత్ షాక్‌తో వన్యప్రాణుల ప్రాణాలు తీస్తుండడంపై దృష్టి పెట్టిన అధికారులు, విద్యుత్ సరఫరా, నియంత్రణపై చర్యలు ప్రారంభించారు. ఏదేమైనా తాజాగా కవ్వాల్ ప్రాంతానికి వచ్చిన పెద్దపులి వేటగాళ్ల ఉచ్చులోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత అటవీశాఖ అధికారులపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment