కెమెరాకు చిక్కిన పులి
సాక్షి, కోటపల్లి(ఆదిలాబాద్) : మండలంలోని ఎదులబంధం అడవుల్లో పులి కదలికలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకాలం చెన్నూర్, వేమనపల్లి మండలాల్లోని అడవుల్లో పులి సంచరించగా.. తాజాగా కోటపల్లి మండల కేంద్రం, కోటపల్లి మండలంలోని ఎదులబంధం, లింగన్నపేట అటవీ ప్రాంతంలో పులి కదలికలను గుర్తించారు. పులి సంచారం విషయం తెలియగానే గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈనెల8న మండల కేంద్రానికి చెందిన కాశెట్టి తిరుపతి, రాళ్లబండి శ్యాంసుందర్ అనే వ్యక్తులకు చెందిన గేదెలపై పులి దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డాయి. అయితే గేదెల మంద ఎదురుతిరగడంతో పాటు చెల్లాచెదురై గ్రామాల వైపు పురుగెత్తడంతో పులి వెనుకడుగు వేసిందని పశువుల కాపరులు పేర్కొన్నారు.
కాగా ఆదివారం కే4 ఎదులబంధం లింగన్నపేట గ్రామాల సమీపంలో దట్టమైన అటవీప్రాంతం కావడం.. చిన్న చిన్న అడవి జంతువులు ఎక్కువగా ఉండటంతో వాటిని వేటాడుతూ పులి సంచరిస్తున్నట్లు సమాచారం. అయితే మండలంలో ఇప్పటికే కే4, కే6 పులులు ఉండగా తాజాగా ఇంకో పులి వచ్చినట్లు సమాచారం కానీ పులికి రక్షణ దృష్ట్యా అధికారులు ఎవరూ కూడా ఇప్పటివరకు ధ్రువీకరించలేదు. మండలంలో కే4 ఆనవాళ్లు లభ్యమైనా.. అటవీ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో మాత్రం కే6 ఎక్కడా కనిపించలేదు. చెన్నూర్ మండలంలో సంకారం బుద్దారం అటవీ ప్రాంతంలో తిరిగిన పులి ప్రస్తుతం కోటపల్లి మండలంలో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరైనా పులికి హాని తలపెడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలను హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment