సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రానంతరం అతి పెద్ద కరువును ఎదుర్కొంటున్నామని, మునుపెన్నడూ లేని రీతిలో చివరకు తాగునీటికి కష్టాలు పడుతున్నామని, ఉపాధి లేకుండా అయిపోయి పల్లె వలస వెళ్లిపోతోందని టీ జేఏసీ కరువు సమాలోచన సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా రాష్ట్రం మొత్తాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించాలని ఈ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన ఈ సమావేశంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, ప్రొఫెసర్ హరగోపాల్, వివిధ రైతు సంఘాల నేతలు, స్వచ్చంద సేవా సంస్థల ప్రతినిధులు, ఆయా జేఏసీల నాయకులు పాల్గొన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఇప్పటి దాకా కనీసం ఒక్క సమీక్ష సమావేశం కూడా జరపలేదని, కనీసం శుక్రవారం జరగనున్న కలెక్టర్ల సమావేశంలోనైనా కరువుపై సమగ్ర చర్చించి రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వాలని ఈ సమావేశం కోరింది.
త్వరలో మౌన దీక్ష
కరువు తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు అన్ని జేఏసీలు, రైతు సంఘాల ప్రముఖులతో కలిసి త్వరలోనే ఒక రోజు మౌన దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రకటించారు. అన్ని పక్షాలతో చర్చించి మౌనదీక్ష తేదీని ప్రకటిస్తామన్నారు. అంతకు ముందు గవర్నర్‌ను కలిసి కరువు నివేదికను అందజేస్తామని తెలిపారు. వీటితో పాటు మే 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో చేపట్టాల్సిన పోరాట రూపాలపైనా చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని కోదండరాం చెప్పారు. తక్షణం తాగునీటిని సరఫరా చేయడం, నీటి నిల్వలను కాపాడడం, పశువులకు తాగునీరు, మేత అందించేందుకు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం, గ్రామాల్లో నీటి తొట్టెల ఏర్పాటు, గ్రామీణ ఉపాధి కూలీలకు వెంటనే ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలని, వృద్ధులు, వికలాంగులకూ మధ్యాహ్న భోజనం అందించాలని, ఆరోగ్య సేవలు అందించేందుకు మొబైల్ వైద్యసేవలు అందుబాటులోకి తేవాలని, వడగాడ్పులతో చనిపోయిన వారికి రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని తదితర తీర్మానాలు చేశారు.
వ్యవసాయ కమిషన్ ఏర్పాటుపై స్పందనే లేదు
వాస్తవాలను అంగీకరించని పాలకవర్గం రావడం తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. కేసీఆర్ సీఎం కాకముందే వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరానని కానీ, ప్రస్తుత ప్రభుత్వం ఏ సలహాలు తీసుకునే స్థితిలో లేదన్నారు. కరువు ప్రకృతి వైఫల్యం కాదని, మానవ వైఫల్యమని ప్రముఖ ఆర్ధికవేత్త అమర్త్యసేన్ చెప్పిన మాటలను తెలంగాణ ప్రభుత్వం అర్ధం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రజలు సంయమనం పాటిస్తున్నారని, ప్రతిపక్షాలు బలహీన పడితే ప్రజలే ప్రతిపక్షం అవుతారని చెప్పారు.
పోరాడిన గ్రామాలు యాచిస్తున్నాయి
తెలంగాణ ఉద్యమంలో పోరాడిన గ్రామాలు ప్రస్తుతం యాచిస్తున్నాయని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆవేదన చెందారు. కరువు వల్ల పల్లెల నుంచి 60 శాతం మంది ప్రజలు వలస పోయారని అన్నారు. నీళ్ల కోసం చెరువులు తవ్విస్తున్నారు కానీ, పూడికలు తీసిన కాంట్రాక్టర్లు బాగుపడ్డారన్నారు. తెలంగాణలో వ్యవసాయం ప్రకృతి ఆధార పడి ఉందని, తెలంగాణకు కొత్త కరువు మాన్యువల్ అవసరమని తెలిపారు. తెలంగాణ గడ్డ రాజకీయంగా నీర పడిందని, గ్రామాల పరిస్థితి దారుణంగా తయారైందని అన్నారు.